Friday, April 26, 2024

బీజేపీలో చేరిన జగిత్యాల మాజీ మున్సిపల్ చైర్ పర్సన్ భోగ శ్రావణి..

జగిత్యాల ప్రతినిధి : జగిత్యాల మున్సిపల్ మాజీ ఛైర్ ప‌ర్సన్ భోగ శ్రావణి ప్రవీణ్ బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ వేధింపులు భరించలేక తాను జగిత్యాల మున్సిపల్ చైర్ పర్సన్ పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించిన డాక్టర్ బోగ శ్రావణి అనంతరం బీఆర్ఎస్ సభ్యత్వానికి, కౌన్సిలర్ పదవికి రాజీనామా చేశారు. బిఆర్ఎస్ సభ్యత్వానికి రాజీనామా చేసిన అనంతరం నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్, హుజురాబాద్ ఎమ్మెల్యే, బీజేపీ నేత ఈటెల రాజేందర్ లు భోగ శ్రావణి ఇంటికి వచ్చి బీజేపీ పార్టీలోకి ఆహ్వానించారు. వారి ఆహ్వానం మేరకు భోగ శ్రావణి ప్రవీణ్ బుధవారం ఢిల్లీకి వెళ్లి కేంద్ర మంత్రి భూపేందర్ యాదవ్ సమక్షంలో బీజేపీలో చేరి పార్టీ సభ్యత్వాన్ని స్వీకరించారు.


“మోడీ” సైన్యంలో సైనికురాలిగా పనిచేస్తా : శ్రావణి
దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సైన్యంలో ఒక సైనికురాలిగా పనిచేస్తానని బీజేపీలో చేరిన అనంతరం భోగ శ్రావణి అన్నారు. జగిత్యాల ఎమ్మెల్యే అణచివేతకు గురై, కన్నీరు పెట్టుకొని తాను మున్సిపల్ చైర్ పర్సన్ పదవికి, బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేశానన్నారు. తాను కన్నీటితో రాజీనామా చేసినప్పటికీ బీఆర్ఎస్ పార్టీ నుండి తనకు ఎలాంటి ఓదార్పు లభించలేదని, అయితే ఒక ఆడబిడ్డగా తనను అక్కున చేర్చుకున్న బీజేపీ నాయకత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. తనకు భరోసా కల్పించిన బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ కుమార్, ఎంపీ ధర్మపురి అరవింద్, ఎమ్మెల్యే ఈటల రాజేందర్ లకు కృతజ్ఞతలు తెలిపారు. మోడీ నాయకత్వంలో భారతమాత సేవ చేసేందుకు ఒక సైనికురాలిగా పని పనిచేస్తానని తెలిపారు. జగిత్యాల జిల్లాలో బీజేపీ బలోపేతానికి తనవంతు కృషి చేస్తానని ప్రకటించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు, మాజీ మంత్రి డీకే అరుణ, బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యులు వివేక్ వెంకటస్వామి, జగిత్యాల బీజేపీ జిల్లా అధ్యక్షులు మోర పెళ్లి సత్యనారాయణ రావు, జగిత్యాల మున్సిపల్ మాజీ కౌన్సిలర్ రంగు గోపాల్, తదితరులున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement