Monday, May 6, 2024

Peddapalli: ప్రతి దరఖాస్తును స్వీకరించాలి..కలెక్టర్‌ ముజమ్మిల్‌ ఖాన్‌

పెద్దపల్లి, జనవరి 2 (ప్రభన్యూస్‌): ప్రజా పాలన కార్యక్రమంలో భాగంగా ప్రజల నుంచి వచ్చే ప్రతి దరఖాస్తు తప్పనిసరిగా తీసుకోవాలని జిల్లా కలెక్టర్‌ ముజమ్మిల్‌ ఖాన్‌ అన్నారు. మంగళవారం జిల్లా కలెక్టర్‌ ముజమ్మిల్‌ ఖాన్‌ పెద్దపల్లి మున్సిపాలిటీలోని 19వ వార్డు అంబేద్కర్ నగర్‌లో ఏర్పాటు చేసిన ప్రజాపాలన దరఖాస్తుల స్వీకరణ కార్యక్రమాన్ని పరిశీలించారు. ప్రజాపాలన కార్యక్రమానికి వచ్చిన ప్రజలతో కలెక్టర్‌ మాట్లాడి.. ప్రభుత్వ గ్యారెంటీ పథకాలకు దరఖాస్తు చేసుకుంటున్న వారి వివరాలను అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వం విడుదల చేసే నిర్దేశిత మార్గదర్శకాల ప్రకారం అర్హులందరినీ ఎంపిక చేసి గ్యారెంటీ పథకాలను పారదర్శకంగా అమలు చేస్తామన్నారు. ప్రభుత్వ గ్యారంటీలతో పాటు ఇతర సమస్యలపై దరఖాస్తులు స్వీకరిస్తున్నామని, ఇతర దరఖాస్తుల స్వీకరణకు ప్రత్యేక కౌంటర్‌ ఏర్పాటు చేశామని, జిల్లా యంత్రాంగం పరిధిలో ఉన్న సమస్యలన్నింటినీ పరిష్కరించేందుకు చిత్తశుద్ధితో కృషి చేస్తామని కలెక్టర్‌ తెలిపారు. దరఖాస్తుల స్వీకరణ కార్యక్రమం వార్డు సభ మొదలైనప్పటి నుండి జనవరి 6 వరకు ఉంటుందని, వార్డు సభల్లో తమ దరఖాస్తులను అందజేయని వారు జనవరి 6 వరకు అందజేయాలని తెలిపారు. ప్రజాపాలన కేంద్రాలకు వచ్చి సమర్పించే ప్రతి దరఖాస్తును తీసుకోవాలని, దరఖాస్తులను తిరస్కరించడానికి వీలు లేదన్నారు. కేంద్రానికి వచ్చిన మహిళలతో దరఖాస్తుల పంపిణీ, నమోదు, వారి సమస్యలను గురించి అడిగి తెలుసుకున్నారు.

కార్పోరేట్‌కు ధీటుగా విద్యా బోధన..

పెద్దపల్లిలోని ప్రభుత్వ పాఠశాలల్లో మౌళిక వసతులు కల్పించి కార్పొరేట్‌కు ధీటుగా విద్యను అందిస్తున్నామని, ప్రభుత్వ పాఠశాలలను పరిశీలించి తమ పిల్లలని పంపాలని కలెక్టర్‌ మహిళలను కోరారు. మన పిల్లల అభివృద్ధి కోసం మనం బాధ్యత తీసుకోవాలని, వారి చదువుపై శ్రద్ధ వహించాలని, ప్రతిరోజూ కొంత సమయం పిల్లలు చదువుకునేలా పర్యవేక్షించాలని కలెక్టర్‌ సూచించారు. ప్రజలు దరఖాస్తులు సమర్పించిన తరువాత వారికి ఏ పథకాలకు దరఖాస్తు చేసుకున్నారో తెలియజేస్తూ అందిస్తున్న రశీదును కలెక్టర్‌ పరిశీలించి, సదరు రశీదును జాగ్రత్తగా భద్రపర్చుకోవాలని కలెక్టర్‌ ప్రజలకు సూచించారు. కలెక్టర్‌ వెంట పెద్దపల్లి మున్సిపల్‌ చైర్‌ పర్సన్‌ డాక్టర్‌ మమతా రెడ్డి, మునిసిపల్‌ కమిషనర్‌, ప్రజా ప్రతినిధులు, సంబంధిత అధికారులు, అంగన్‌వాడీ, ఆశా కార్యకర్తలు, రెవెన్యూ, మునిసిపల్‌ అధికారులు, సిబ్బంది, ప్రజలు పాల్గొన్నారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement