Wednesday, December 6, 2023

Karimnagar – బండి ఓటుకు 20 వేలు ఇస్తున్నాడోచ్…తీసుకుని కారుకు ఓటేయండి – గంగుల క‌మ‌లాక‌ర్

క‌రీంన‌గ‌ర్ – ఎంపిగా బండి సంజయ్ అందరినీ దోచుకొని కోట్లు సంపాదించాడని..ఓటుకు ఇరవై వేలు ఇద్దామని సిద్దమయ్యాడని…ఆయన ఇచ్చే డబ్బు మనదేనని తీసుకొని కారు గుర్తుకు ఓటేయాలని బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. కరీంనగర్ రూరల్ మండలంలోని ధుబ్బపల్లి, ఫకీర్ పేట, జూబ్లీ నగర్ లో శనివారం ఎన్నికల ప్రచారం నిర్వహించారు.గ్రామస్థులు గంగులకు డప్పు చప్పుళ్లతో మంగళ హారతులతో ఘన స్వాగతం పలికారు. డప్పు చప్పుళ్ల మధ్య ఇంటింటికి తిరుగుతూ ఓటు అభ్యర్థించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… ఎంపీగా గెలిచి నాలుగేళ్లలో బండి సంజయ్ ఒక్క గ్రామానికి వచ్చింది లేదని మళ్ళీ ఎన్నికలు రాగానే మాయమాటలు చెప్పేందుకు వస్తున్నాడని అన్నారు. బీజేపీ కాంగ్రెస్ నాయకులు కేవలం ఎన్నికలప్పుడు మాత్రమే కనిపిస్తారని వాళ్లకు ఓట్లు వేయించుకొని మాయం అవడం తప్ప తెలిసిందేమీ లేదని అన్నారు. తాను ఎల్లప్పుడూ మీ కళ్ళ ముందే మీ ఆపదలో అండగా ఉన్నానని గుర్తు చేశారు. బీజేపీ కాంగ్రెస్ లు మోసగాళ్ళ పార్టీలని..యాభై ఏళ్లు పాలించిన కాంగ్రెస్ పార్టీ మన బతుకులు చీకటిమయం చేశాయని అన్నారు.

తెలంగాణ రాష్ట్రం సాధించుకున్న తర్వాత కోట్ల రూపాయల నిధులతో గ్రామీణ రహదారులన్నీ పూర్తి చేసి గ్రామాల రూపురేఖలు మార్చాం అని అన్నారు. దుబ్బపల్లి గ్రామాన్ని దత్తత తీసుకుంటున్నామని గ్రామంలో దళితులు అందరికీ దలితబందు అందజేస్తామని, మిగిలిన బీసీ బంధు కూడా పూర్తి చేస్తానని హామీ ఇచ్చారు. అన్నదాత లను అరిగొస పెట్టి ఆత్మహత్యలకు కారణం అయిన పార్టీ కాంగ్రెస్ అని, బీజేపీ అధికారంలోకి వచ్చే పరిస్థితి లేదని అన్నారు. బీజేపీ కాంగ్రెస్ నాయకుల మాయమాటలు నమ్మితే మన పిల్లల భవిష్యత్ అంధకారం అవుతుందని అన్నారు. జనవరి నుంచి అందరికీ కొత్త రేషన్ కార్డులు, పించన్లు అందేజేస్తమని తెలిపారు. పచ్చని తెలంగాణ పై ఆంధ్రోళ్ల కన్ను పడిందని తెలంగాణ ను కాపాడుకోవాల్సిన బాధ్యత మీ చేతుల్లోనే ఉందని అన్నారు. పదేళ్ల కెసిఆర్ అభివృద్ధి పై గ్రామాల్లో చర్చించాలని..మన ఇంటి పార్టీ అయిన బీ ఆర్ ఎస్ కు ఓటు వేసి కెసిఆర్ చేతులను బలోపేతం చేయాలని కోరారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement