Monday, December 2, 2024

Appeal – రేవంత్ సార్…డాక్టర్‌ను ఆరోగ్య శాఖ మంత్రిగా నియమించండి – ‘ జూడా’ వినతి

తెలంగాణ కొత్త ముఖ్యమంత్రిగా ఎంపికైన పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ప్రస్తుతం ఢిల్లీ పర్యటనలో ఉన్నారు. ఈ సాయంత్రానికి ఆయన హైదరాబాద్‌కు చేరుకుంటారు. గురువారం లాల్ బహదూర్ స్టేడియంలో ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తారు. ఆయనతో పాటు కొందరు మంత్రులు ప్రమాణ స్వీకారం చేయనున్నారు.

ఈ నేపథ్యంలో తెలంగాణ జూనియర్ డాక్టర్ల నుంచి మొట్టమొదటి విజ్ఞప్తి రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి అందింది. తెలంగాణ జూనియర్ డాక్టర్స్ అసోసియేషన్ ఈ మేరకు ఓ వినతిపత్రాన్ని విడుదల చేసింది. మొన్నటి ఎన్నికల్లో అసెంబ్లీకి ఎన్నికైన డాక్టర్లందరినీ అభినందిస్తూనే.. తమ కోరికను బయటపెట్టింది. కాబోయే ప్రభుత్వంలో- ఓ డాక్టర్‌ను ఆరోగ్య మంత్రిగా నియమించాలని విజ్ఞప్తి చేసింది .

ఈ ఎన్నికల్లో కాంగ్రెస్, బీఆర్ఎస్ నుంచి అసెంబ్లీకి ఎన్నికైన డాక్టర్ వంశీకృష్ణ- అచ్చంపేట్, డాక్టర్ రామ్‌చందర్ నాయక్- డోర్నకల్, డాక్టర్ మురళీ నాయక్- మహబూబాబాద్, డాక్టర్ సత్యనారాయణ- మానకొండూర్, డాక్టర్ మైనంపల్లి రోహిత్- మెదక్, డాక్టర్ పర్ణికా రెడ్డి- నారాయణపేట్, డాక్టర్ సంజీవరెడ్డి- నారాయణఖేడ్, డాక్టర్ వివేక్ వెంకటస్వామి- చెన్నూర్, డాక్టర్ భూపతిరెడ్డి- నిజామాబాద్, డాక్టర్ రంగమయి- సత్తుపల్లి, డాక్టర్ కూచుకుళ్ల రాజేష్ రెడ్డి- నాగర్ కర్నూల్, డాక్టర్ పాల్వాయి హరీష్- సిర్పూర్, డాక్టర్ తెల్లం వెంకట్రావ్- భద్రాచలం, డాక్టర్ కల్వకుంట్ల సంజయ్- కోరుట్ల రూరల్, డాక్టర్ సంజయ్- జగిత్యాల్‌ను అభినందించింది.

వేర్వేరు పార్టీల నుంచి ఇంతమంది డాక్టర్లు అసెంబ్లీకి ఎన్నిక కావడం శుభపరిణామం అని, భవిష్యత్తులో తెలంగాణలో వైద్య, ఆరోగ్యరంగం మరింత మెరుగుపడుతుందని ఆశిస్తున్నట్లు తెలిపింది. వైద్య విధానాలను రూపొందించడంలో డాక్టర్ల సూచనలు తప్పకుండా సహాయపడతాయని వ్యాఖ్యానించింది. వైద్య వ్యవస్థ ఎలా ఉండాలనే విషయంపై డాక్టర్లకే సమగ్రమైన అవగాహన ఉంటుందని పేర్కొంది

రోగుల అవసరాలు, ఆసుపత్రులు, పరికరాలు, మందులు, వైద్య- ఆరోగ్య రంగంలో మౌలిక సదుపాయాల కల్పన.. వంటి అంశాలపై డాక్టర్ ఎమ్మెల్యేల సూచనలను కొత్త ప్రభుత్వం స్వీకరించాలని కోరింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement