Sunday, April 28, 2024

TS: నెగ్గిన జవహర్ నగర్ అవిశ్వాసం… ఊడిన బీఆర్ఎస్ మేయర్ కావ్య పదవి

ప్రభ న్యూస్ ప్రతినిధి, మేడ్చల్ ఫిబ్రవరి 19: మేడ్చల్ – మల్కాజిగిరి జిల్లా జవహర్ నగర్ మేయర్ మేకల కావ్య (బి.ఆర్.ఎస్) పై, బీఆర్ఎస్ అసంతృప్త కార్పొరేటర్లు ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానం నెగ్గింది. అవిశ్వాస తీర్మానం ప్రవేశానికి సంబంధించి జవహర్ నగర్ మునిసిపల్ కార్పొరేషన్ కార్యాలయంలో సోమవారం ప్రిసైడింగ్ ఆఫీసర్ ఉపేందర్ రెడ్డి (డి.ఆర్.వో) అధ్యక్షతన ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి 20మంది కార్పొరేటర్లు హాజరయ్యారని, హాజరైన 20మంది అవిశ్వాస తీర్మానానికి అనుకూలంగా మద్దతు ప్రకటించారని, ఎవరు కూడా వ్యతిరేకించలేదని సమావేశం అనంతరం ప్రిసైడింగ్ ఆఫీసర్ ఉపేందర్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ వెల్లడించారు. ఇదే అంశాన్ని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ కు కూడా నివేదిస్తామని, తదుపరి చేపట్టాల్సిన చర్యలను కూడా కలెక్టర్ ఆదేశాల మేరకే నిర్వహిస్తామని ప్రకటించారు.

కాగా.. అసమ్మతి కార్పొరేటర్లు ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానం నెగ్గడంతో మేకల కావ్య (బి.ఆర్.ఎస్) జవహర్ నగర్ మేయర్ పదవిని కోల్పోయింది. అవిశ్వాసం ప్రవేశపెట్టే సమయంలో కార్పొరేషన్ కార్యాలయానికి చేరుకున్న మేయర్ మేకల కావ్య సమావేశానికి హాజరుకాకుండానే, కార్యాలయం ఇన్వర్డ్ లో ఏవో పేపర్లు సబ్మిట్ చేసి, వెంటనే బయటికి వెళ్లిపోయారు. అటుతర్వాత కార్పొరేషన్ కార్యాలయం నుంచి బయటికి వచ్చిన అసమ్మతి కార్పొరేటర్లు 19మంది నేరుగా తాము వచ్చిన బస్సులోనే కాంగ్రెస్ నాయకులు, మాజీ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డితో కలిసి తిరిగి క్యాంపునకు తరిలివెళ్లారు. దీంతో గత నెల రోజులుగా ఎంతో ఉత్కంఠతతో ఎదురుచూస్తున్న జవహర్ నగర్ కార్పొరేషన్ అవిశ్వాస తీర్మానం కథ సుఖాంతమైంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement