Thursday, April 25, 2024

ఇందిరానగర్​ హైస్కూల్​.. 23 ఏళ్ల తర్వాత కలిసిన దోస్తులు

అది ఖమ్మం జిల్లాలోని ఇందిరా నగర్ హైస్కూల్.. అక్కడ 1998లో చదివిన స్టూడెంట్స్​ అంతా చాలా ఏళ్ల తర్వాత ఒకే దగ్గర కలుసుకున్నారు. చదువులు పూర్తయ్యాక కొంతమంది పెళ్లిళ్లు చేసుకుని అత్తారింటికి వెళ్తే.. ఇంకొందరు వివిధ వృత్తుల్లో స్థిరపడ్డారు.. కొంతమంది జాబ్స్​ కోసం దేశంలోని పలు ఏరియాలకు వెళ్లారు. అట్లాంటి వారంతా వాట్సాప్​ గ్రూపుల్లో సమాచారం చేరవేసుకుని 23 ఏళ్ల తర్వాత ఒకే దగ్గర ఆత్మీయంగా కలుసుకున్నారు. అప్పట్లో వారు చేసిన చిలిపి పనులు, అల్లరి చేష్టలను యాదికి తెచ్చుకుని దోస్తులతో కలిసి సరదాగా గడిపారు. అంతేకాకుండా వారికి చదువులు చెప్పిన గురువులను, హెడ్​ మాస్టర్​ని సన్మానించుకుని వారిపట్ల ఉన్న మమకారాన్ని చాటిచెప్పారు.

ఖమ్మం ఇందిరానగర్​ పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం హ్యాపీగా, సందడిగా సాగింది. దాదాపు పాతికేళ్ల తర్వాత గురు శిష్యులు ఈ సమ్మేళన కార్యక్రమంలో కలుసుకున్నారు. 1998లో ఇందిరా నగర్ హైస్కూల్లో పదో తరగతి చదువుకున్న విద్యార్థులంతా దేశంలోనే కాక వివిధ ప్రాంతాల్లో వృత్తి, ఉద్యోగాల్లో స్థిరపడ్డారు. వాట్సాప్ గ్రూప్ ద్వారా ఎప్పడూ కాంటాక్ట్ లో ఉండే వారంతా ఉపాధ్యాయులతో ఆత్మీయ సమ్మేళనం ఏర్పాటు చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. కాగా, ఆదివారం ఖమ్మంలోని భవాని గ్రాండ్ హోటల్లో కార్యక్రమాన్ని నిర్వహించారు.

అప్పట్లో తమకు విద్యాబుద్ధులు నేర్పిన వివిధ సబ్జెక్టుల ఉపాధ్యాయులు, హెడ్ మాస్టర్ గా పనిచేసిన విజయభాస్కర్, సుధారాణి, సత్యనారాయణ, కృష్ణవేణి, వెంకటేశ్వర్లును శాలువా కప్పి పూలమాలలు, మెమోంటోలతో సన్మానించారు. ఈ సందర్భంగా ఉపాధ్యాయులు విద్యార్థులకు తమ అనుభవాలతో దిశానిర్దేశం చేశారు. విద్యావంతులందరూ విజ్ఞానవంతులు కారని, ప్రతిఒక్కరూ సంస్కారంతో మెలగాలని, కుటుంబ వ్యవహారాల్లోనూ ఎంతో బాధ్యతగా వ్యవహరించాలని గురువులు తమ శిష్యులకు సందేశమిచ్చారు. హెడ్ మాస్టర్ గా పనిచేసి రిటైర్డ్ అయిన విజయ్ భాస్కర్ సరదా గేమ్స్ ఆడించి, పాటలు పాడించి అందరినీ ఉత్సాహపరిచారు. తమ ఉపాధ్యాయుల ప్రతి మాటా తమకో ఆణిముత్యమని ఆత్మీయ సమ్మేళనంలో విద్యార్థులు హర్షం వ్యక్తం చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement