Thursday, May 2, 2024

HZB Updates: ఓటు హ‌క్కు వినియోగించుకున్న ఈట‌ల‌.. టీఆర్ ఎస్ పార్టీపై ఆగ్ర‌హం..

KARIMNAGAR: హుజురాబాద్ ఉపఎన్నిక పోలింగ్ కొనసాగుతోంది. బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్ తన భార్య జమునతో కలిసి కమలాపూర్ లోని 262 నెంబర్ పోలింగ్ బూత్ లో ఓటు హక్కు వినియోగించుకున్నారు. పోలింగ్ సరళిని గమనించారు. అనంతరం మీడియాతో ఆయన మాట్లాడుతూ అధికార టీఆర్ఎస్ పార్టీపై నిప్పులు చెరిగారు.

ఒక ఎన్నిక కోసం ఇన్ని వందల కోట్లను ఖర్చు చేయడం దేశ ప్రజాస్వామ్య చరిత్రలో ఎప్పుడూ జరగలేదని హుజురాబాద్ బీజేపీ అభ్యర్థి ఈటల రాజేంద‌ర్ అన్నారు. ప్రభుత్వ జీవోల ద్వారా వేల కోట్ల రూపాయల ప్రలోభాలకు గురి చేశారని చెప్పారు. హుజూరాబాద్ లో ఏం జరుగుతోందనే విషయాన్ని యావత్ తెలంగాణ ఉత్కంఠగా ఎదురు చూసిందన్నారు. తమ గుండెల్లోని బాధను హుజూరాబాద్ ప్రజలు ఓట్ల రూపంలో వ్యక్తపరుస్తున్నారని తెలిపారు.

పోలింగ్ ప్రారంభమైన వెంటనే పెద్ద సంఖ్యలో ఓటర్లు పోలింగ్ బూత్ లకు తరలి వచ్చారని… 90 శాతానికి పైగా ఓటింగ్ నమోదవుతుందని చెప్పారు. పోలీసులు ఏకపక్షంగా టీఆర్ఎస్ పార్టీకి సహకరించారని మండిపడ్డారు. పోలీసులే ఎస్కార్ట్ ఇచ్చి డబ్బును, మద్యాన్ని తరలించారని ఆరోపించారు. హుజూరాబాద్ పోలీసుల తీరు ప్రజాస్వామ్యానికే మచ్చ అని విమర్శించారు.

టీఆర్ఎస్ నేతలు ఓటర్లను భయభ్రాంతులకు గురి చేశారని ఈటల అన్నారు. ఆ పార్టీ అధికార దుర్వినియోగానికి పాల్పడుతోందని ఆరోపించారు. అయితే, ధర్మం విజయం సాధిస్తుందని ఓటర్లు చెపుతున్నారన్నారు. ప్రజలు స్వచ్ఛందంగా, ధర్మంగా నిజాయతీని నిరూపించుకోవాలని అన్నారు. ఈటల భార్య జమున మాట్లాడుతూ హుజూరాబాద్ లో ధర్మమే గెలుస్తుందని చెప్పారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement