Saturday, May 4, 2024

HYD: విజయవంతంగా ముగిసిన యూత్ స్కాల‌ర్ లెర్నింగ్ ప్రోగ్రామ్

హైదరాబాద్ : యూత్ స్కాలర్ లెర్నింగ్ ప్రోగ్రామ్‌ను ఐఎంటి హైదరాబాద్ సీఎస్ఆర్ క్లబ్, పహేల్ విజయవంతంగా ముగించింది. ఐఎంటి హైదరాబాద్ విద్యార్థులు ప్రతి ఆదివారం 6-14 సంవత్సరాల పిల్లలకు గత నాలుగు నెలలుగా నిర్వహిస్తున్న బోధనా కార్యక్రమమిది. ఐఎంటి హైదరాబాద్ క్యాంపస్‌లో నాలుగు నెలల పాటు నిర్వహించిన కార్యక్రమంలో ఘస్మియాగూడ, శంకరపురం, చెర్లగూడ గ్రామాలకు చెందిన దాదాపు అరవై మంది పిల్లలు ఈ కార్యక్రమం ద్వారా ప్రయోజనం పొందారు. కమ్యూనిటీ కనెక్ట్ చైర్‌పర్సన్ డా. రోమీనా గ్రామీణ వర్గాల పిల్లలకు విద్యాపరమైన సహాయాన్ని అందించడానికి ప్రోగ్రామ్ ఎలా రూపొందించబడిందో వివరించారు.

ఈ ముగింపు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన యునైటెడ్ వే ఆఫ్ హైదరాబాద్ సిఇఒ రేఖా శ్రీనివాసన్ మాట్లాడుతూ… సామాజిక కార్యక్రమాలలో విద్యార్థుల అనుభవం భవిష్యత్ వ్యాపారవేత్తలుగా వారి నిర్ణయాలను ఎలా రూపొందిస్తుందో పేర్కొన్నారు. పర్యావరణ, సామాజిక సవాళ్లు పెరుగుతున్న తరుణంలో యువతరం ఒక ఆశాకిరణంగా పనిచేస్తుందన్నారు. ఈ కార్యక్రమానికి గౌరవ అతిథిగా విచ్చేసిన అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ పి.రాంచందర్ రావు విద్యార్థి వాలంటీర్ల కృషిని అభినందించారు. ఐఎమ్‌టి హైదరాబాద్ డీన్ డాక్టర్ వి.చక్రపాణి మాట్లాడుతూ… ఇదొక అద్భుతమైన కార్యక్రమమని, అధ్యాపకులు కూడా దీనిలో భాగమై ఆనందించారని అన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement