Sunday, October 6, 2024

నేడు హైద‌రాబాద్ లో స‌ద‌ర్ ఉత్స‌వాలు..

హైద‌రాబాద్ న‌గ‌రంలో నేడు స‌ద‌ర్ ఉత్స‌వాలు ఘ‌నంగా నిర్వ‌హించ‌నున్నారు. దీపావళి పండుగ వచ్చిందంటే చాలు యాదవులు తమ ఐక్యతను చాటుతూ సదర్‌ ఉత్సవాలను నిర్వహిస్తుంటారు. సదర్‌ ఉత్సవాలను ఘనంగా నిర్వహించేందుకు యాదవులు సిద్ధమ‌య్యారు.. వివిధ రాష్ట్రాల నుంచి ప్రత్యేకంగా దున్నలను తీసుకొచ్చి సిద్ధం చేస్తున్నారు. ఒక్కప్పుడు హైదరాబాద్‌కు పరిమితమైన ఈ ఆనవాయితీ క్రమంగా కాలనీలు.. టౌన్‌లు, గ్రామాలకు కూడా విస్తరించింది. అయితే.. ఎన్నో సంవత్సరాలుగా హైదరాబాద్‌లో ఈ ఉత్సవాలను యాదవ సోదరులు నిర్వహిస్తూ వస్తున్నారు. ఇప్పటికే శుక్రవారం రాత్రి నగరంలోని కొన్ని ప్రాంతాల్లో సదర్‌ ఘనంగా జరిగాయి.


రెండో రోజులో భాగంగా ఇవాళ ఖైరతాబాద్‌, సైదాబాద్‌, బోయిన్‌పల్లి, కాచిగూడ, ఈస్ట్‌ మారెడ్‌పల్లి సహా మరికొన్ని ప్రాంతాలతో పాటు.. నగర శివారులోని కొన్ని ప్రాంతాల్లో కూడా సదర్‌ ఉత్సవాలు జరగనున్నాయి.. ఈ కార్యక్రమానికి పలువురు రాజకీయ నేతలతో పాటు.. ఇతర ప్రముఖులు కూడా హాజరుకానున్నారు. అయితే ఈ ఉత్స‌వాల సంద‌ర్భంగా పోలీసులు భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. ఇద్దరు ఏసీపీలు, 8 మంది ఇన్‌స్పెక్టర్లు, 15 మంది ఎస్సైలు, 200 మందికిపైగా కానిస్టేబుళ్లతో బందోబస్తును ఏర్పాటు చేస్తున్నారు. సదరు ఉత్సవాల సంద‌ర్భంగా న‌గ‌రంలో నేడు ట్రాఫిక్ ఆంక్ష‌లు అమలు కానున్నాయి. నారాయణగూడ వైఎంసీఏ కూడలిలో శనివారం రాత్రి 7 గంటల నుంచి ఆదివారం ఉదయం 5 గంటల వరకు ట్రాఫిక్‌ ఆంక్షలు అమల్లో ఉండనున్నాయి. ప్రత్యామ్నాయ మార్గాలు చూసుకోవాలని ట్రాఫిక్‌ పోలీసులు సూచిస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement