Monday, April 15, 2024

ఇదే రోజు రాచరిక పరిపాలన నుంచి ప్రజాస్వామ్యంలోకి : ఉప్పల శ్రీనివాస్ గుప్తా

హైద‌రాబాద్ : సీఎం కేసీఆర్ పిలుపు మేరకు తెలంగాణ జాతీయ సమైక్యతా దినోత్సవం సందర్భంగా హైదరాబాద్ హిమాయత్ నగర్ లోని తెలంగాణ రాష్ట్ర పర్యాటక అభివృద్ధి సంస్థ కార్యాలయంలో రాష్ట్ర పర్యాటక అభివృద్ధి సంస్థ చైర్మన్ ఉప్పల శ్రీనివాస్ గుప్తా జాతీయ జెండా ఆవిష్కరించారు. ఈ సంద‌ర్భంగా శ్రీనివాస్ గుప్తా మాట్లాడుతూ.. చరిత్రలో 1948వ సంవత్సరం సెప్టెంబర్ 17వ తేదీకి ఒక విశిష్టత ఉంది, 74 సంవత్సరాల క్రితం ఇదే రోజున మన తెలంగాణ భారతదేశంలో అంతర్భాగంగా మారింది. రాచరిక పరిపాలన నుండి ప్రజాస్వామ్య దశలోకి పరివర్తన చెందింది. అందుకే ఈ సందర్భంగా జాతీయ సమైక్యతా వజ్రోత్సవాలను ఘనంగా జరుపుకుంటున్నామ‌న్నారు. ఇటీవలే భారత స్వాతంత్ర్య వజ్రోత్సవాలను దేశంలో ఏ రాష్ట్రం నిర్వహించనంత ఘనంగా జరుపుకున్నామ‌ని, ప్రజలందరి గుండెల్లో దేశభక్తి భావన పెల్లుబికేలా 15 రోజులపాటు జరుపుకున్నామ‌న్నారు. దానికి కొనసాగింపుగానే సీఎం కేసీఆర్ జాతీయ సమైక్యతా వజ్రోత్సవాలనూ తెలంగాణ జాతి స్పూర్తిని ప్రతిబింబించేలా మూడు రోజుల పాటు వైభవంగా జరపాలని నిర్ణయించారు. భారతదేశం ఈ రోజు కనిపిస్తున్న పరిపాలన స్వరూపంలో మునుపు లేదన్నారు. స్వాతంత్ర్యం పొందిన సమయంలో దేశం రెండు రకాల పరిపాలన ప్రాంతాలుగా ఉండేది. బ్రిటీష్ వాళ్ళు ప్రత్యక్షంగా పరిపాలించిన బ్రిటీష్ ఇండియా ఒక భాగం. స్వదేశీ రాజుల పరిపాలనలో ఉన్న సంస్థానాలు రెండవ భాగం. గాంధీ నెలకొల్పిన సామరస్య విలువల వల్ల, జవహర్ లాల్ నెహ్రూ కల్పించిన విశ్వాసం వల్ల, మౌలానా అబుల్ కలాం ఆజాద్ పాదుకొల్పిన మతాతీత దేశభక్తి భావనల వల్ల, దేశానికి తొలి హోంమంత్రి అయిన సర్దార్ వల్లభ్ భాయ్ పటేల్ ప్రదర్శించిన చాకచక్యం వల్ల సంస్థానాలు భారత దేశంలో కలిసిపోయి దేశం ఏకీకృతమైంద‌న్నారు. నేడు చూస్తున్న భారతదేశం ఆవిష్కృతమైంది. హైదరాబాద్ సంస్థానం భారతదేశంలో ఐక్యమై నేటితో 74 సంవత్సరాలు నిండి 75 వ సంవత్సరంలోకి అడుగిడుతున్నాం. నిజమైన దేశభక్తి 75 ఏళ్ళ స్వతంత్ర భారతంలో తెలంగాణ 60 సంవత్సరాల పాటు అస్తిత్వం కోసం ఉద్యమించింది. గౌరవ ఉద్యమ నేత కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు నేతృత్వంలో 14 ఏళ్ల పోరాటం , అమరుల త్యాగ ఫలితం, 4 కోట్ల ప్రజల ఆకాంక్షను నెరవేర్చి నేడు స్వరాష్ట్రమై అన్ని రంగాల్లో అద్భుతమైన అభివృద్ధిని సాధిస్తూ, అనతికాలంలోనే దేశంలోనే అగ్రగామి రాష్ట్రంగా రూపుదాల్చింద‌న్నారు. సమైక్యాంధ్ర సంకెళ్ల నుండి విముక్తి పొందిన జూన్‌ 2వ తేదీన ప్రతీ ఏటా తెలంగాణ అవతరణ దినోత్సవాన్ని ఘనంగా జరుపుకుం టున్నాం. అదే విధంగా భారత స్వాతంత్య్ర దినోత్సవం, గణతంత్ర దినోత్సవాలను ఘనంగా నిర్వహించుకున్నామ‌న్నారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ హరిత హోటల్స్ జీఎం. కే నాథన్, శాంతి, నర్సింహ్మరావు, రవీందర్ నాయక్, అంజిరెడ్డి, పట్టాభి, లక్ష్మరావు, ఓం ప్రకాష్, రాజేశ్వర్, మహేష్, రామకృష్ణ, హనుమంత్ రెడ్డి, శివ, సమ్మయ్య, రాజేష్, మహేష్, సుభాష్, సునంద, మధుర, HOD’s, TSTDC సిబ్బంది పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement