Saturday, May 18, 2024

TS | ఆన్ లైన్ బెట్టింగులకు బలైన కుటుంబం..

ఆన్‌లైన్ బెట్టింగ్‌ల‌కు ఓ కుటుంబం బలి అయింది. ఆన్‌లైన్‌లో డబ్బులు పోగొట్టుకుని ఆర్థిక ఇబ్బందుల్లో కూరుకుపోయి ఆత్మహత్యే మార్గమని భావించి భార్యతో పాటు కుమారునికి విషమిచ్చి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో సోమవారం రాత్రి వెలుగు చూసింది.

పోలీసులు స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం…

బండ్లగూడ జాగీర్ సన్ సిటీ యమునా అపార్ట్ మెంట్ లో ఆనంద్ (38), ఇందిర (36) నివసిస్తున్నారు. వీరికి శ్రేయాన్స్ (4) కుమారు ఉన్నాడు. అయితే, ఆనంద్ ఆన్‌లైన్‌లో గేమ్స్‌ ఆడుతూ బెట్టింగ్‌లు పెట్టి సుమారు 15 లక్షల రూపాయల అప్పులు చేశాడు. ఈ ఆన్‌లైన్ బెట్టింగ్‌తో ఆర్థికంగా పూర్తిగా ఇరుక్కుపోయాడు. దీంతో భార్యాభర్తల మధ్య గొడవ జరిగింది. గత పదిరోజుల క్రితం కుటుంబసభ్యులు బంధువులు, స్నేహితుల వ‌చ్చి… ఆనంద్, ఇందిరాల‌ను సముదాయించి మంచిగా ఉండాలని, ఇకపై ఆన్‌లైన్ బెట్టింగ్‌లకు దిగవద్దని సూచించారు.

అయితే మూడు రోజుల క్రితం ఆనంద్ మరోసారి ఆన్‌లైన్‌లో పందెం కాశారు.. దీంతో సోమవారం ఉదయం నుంచి భార్యాభర్తల మధ్య గొడవ జ‌రిగింది. గొడవ జరిగిన సమయంలో ఇందిర చేవెళ్ల మండలం మల్కారం గ్రామంలో ఉన్న‌ తన తల్లిదండ్రులకు సమాచారం అందించింది. దీంతో తల్లిదండ్రులు ఫోన్లో సముదాయించారు. ఇందిరా తల్లిదండ్రులు తర్వాత మళ్లీ ఫోన్ చేయ‌గా.. ఫోన్ ఎత్తకపోవడంతో కంగారుపడి సన్ సిటీ ప్రాంతంలోని తమ కూతురి ఇంటికి వచ్చారు. అయితే ఇంట్లో ఆత్మహత్య చేసుకుని ఉన్న వారిని చూసి రాజేంద్రనగర్ పోలీసులకు సమాచారం అందించారు ఇందిరా తల్లిదండ్రులు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు.. మృతదేహాలని తరలించి కేసు విచారిస్తున్నారు. ఇందిర తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement