Friday, May 3, 2024

గణేష్ నవరాత్రి ఉత్సవాలను ఘనంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు : మంత్రి త‌ల‌సాని

ఈనెల 31వ తేదీ నుంచి ప్రారంభం కానున్న గణేష్ నవరాత్రి ఉత్సవాలను ఘనంగా నిర్వహించేలా ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేస్తుందని రాష్ట్ర పశుసంవర్ధక, మత్స్య, పాడి పరిశ్రమల అభివృద్ధి, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ చెప్పారు. మంగళవారం నెక్లెస్ రోడ్ లో గల బుద్ధ భవన్ లో ఉత్సవాల నిర్వహణ, నిమజ్జనం ఏర్పాట్లపై వివిధ శాఖల అధికారులతో సమీక్షించారు. ఈ సమావేశంలో జీహెచ్ఎంసీ కమిషనర్ లోకేష్ కుమార్, అడిషనల్ కమిషనర్ సంతోష్, విజిలెన్స్ ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టర్ విశ్వజిత్, నార్త్ జోన్ డీసీపీ చందన దీప్తి, జోనల్ కమిషనర్ శ్రీనివాస్ రెడ్డి, వాటర్ వర్క్స్ ఈఎన్సీ కృష్ణ, ఎలెక్ట్రికల్ డీఈ శ్రీధర్, ఆర్ అండ్ బీ ఎస్ఈ అజ్మతుల్లా, ఏసీపీలు, సీఐ లు, సికింద్రాబాద్ గణేష్ టెంపుల్ కమిటీ చైర్మన్ జయరాజ్, సికింద్రాబాద్ గణేష్ ఉత్సవ సమితి అధ్యక్షుడు శీలం ప్రభాకర్, పలువురు ప్రతినిధులు పాల్గొన్నారు. సమావేశం అనంతరం మంత్రి మీడియాతో మాట్లాడుతూ… తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ఆధ్వర్యంలోని తెలంగాణ ప్రభుత్వం అన్ని పండుగలను ఎంతో ఘనంగా నిర్వహిస్తున్న విషయాన్ని గుర్తు చేశారు. హైదరాబాద్ లో నిర్వహించే గణేష్ ఉత్సవాలు దేశంలోనే ఎంతో ప్రత్యేకతను సంతరించుకున్నాయని చెప్పారు. జీహెచ్ఎంసీ పరిధిలో సుమారు 35వేలకు పైగా విగ్రహాలను ప్రతిష్టించే అవకాశముంద‌న్నారు. ఉత్సవాల సందర్భంగా ప్రజలు, నిర్వహకులు ఎలాంటి అసౌకర్యానికి గురికాకుండా అన్ని శాఖల ఆధ్వర్యంలో పకడ్బందీ ఏర్పాట్లు జరుగుతున్నాయని పేర్కొన్నారు.

సెప్టెంబర్ 9వ తేదీన పెద్ద సంఖ్యలో వినాయక విగ్రహాల నిమజ్జనం జరగనున్న నేపథ్యంలో ఊరేగింపు నిర్వహించే రహదారులపై ఎలాంటి ఆటంకాలు లేకుండా ప్రత్యేక చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు. దారి పొడవునా విద్యుత్ శాఖ ఆధ్వర్యంలో లైట్లను ఏర్పాటు చేయడం, క్రిందకు ఉన్న విద్యుత్ తీగలను తొలగించడం జరుగుతుందని తెలిపారు. విద్యుత్ సరఫరాలో ఎలాంటి అంతరాయం ఏర్పడకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవడం జరుగుతుందన్నారు. లక్షలాదిమంది రానున్నందున వాటర్ వర్క్స్ విభాగం ఆధ్వర్యంలో ప్రత్యేక కేంద్రాలు ఏర్పాటు చేసి త్రాగునీటిని అందుబాటులో ఉంచుతారన్నారు. అవసరమైన ప్రాంతాల్లో మొబైల్ టాయిలెట్స్ కూడా ఏర్పాటు చేస్తామని చెప్పారు. రౌండ్ ది క్లాక్ పద్దతి లో జీహెచ్ఎంసీ పారిశుధ్య సిబ్బంది విధులు నిర్వహిస్తారని తెలిపారు. ఎప్పటికప్పుడు ఊరేగింపు జరిగే రహదారులు, నిమజ్జనం నిర్వహించే ప్రాంతాల్లో పరిసరాలు పరిశుభ్రంగా ఉండేలా చూస్తారని పేర్కొన్నారు. పండుగలు గొప్పగా జరగాలి, ప్రజలు సంతోషంగా ఉండాలనే ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ఆదేశాల మేరకు ప్రభుత్వం కోట్లాది రూపాయలు వ్యయం చేసి భారీ ఏర్పాట్లు చేస్తున్నట్లు వివరించారు. విగ్రహాల నిమజ్జనం కోసం నగరంలోని పలు ప్రాంతాల్లో బేబీ పాండ్స్ ను ఏర్పాటు చేయడం జరిగిందని, వాటిని వినియోగించుకోవాలని కోరారు. పర్యావరణ పరిరక్షణ చర్యల్లో భాగంగా 6 లక్షల గణపతి మట్టి విగ్రహాలను జీహెచ్ఎంసీ, హెచ్ఎండీఏ, పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ ల ఆధ్వర్యంలో పంపిణీ చేస్తున్న విషయాన్ని గుర్తు చేశారు. అంతేకాకుండా మట్టి విగ్రహాలను ప్రతిష్టించే విధంగా ప్రజల్లో అవగాహన కల్పించే కార్యక్రమాలను కూడా నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ఇప్పటికే భాగ్యనగర్, ఖైరతాబాద్, సికింద్రాబాద్ గణేష్ ఉత్సవ సమితి ప్రతినిధులతో సమావేశాలు నిర్వహించి, అవసరమైన ఏర్పాట్లు చేస్తుందన్నారు. నిర్వహకులు కూడా మండపాల వద్ద తగు జాగ్రత్తలు తీసుకోవాలని, ప్రశాంత వాతావరణంలో ఉత్సవాలు జరిగేలా అధికారులకు సహకరించాలని పిలుపునిచ్చారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement