Sunday, April 28, 2024

త్వరలో రాబోతున్న పల్లె దవాఖానాలు..

నిజామాబాద్‌, (ప్రభన్యూస్‌) : జిల్లాలోని గ్రామీణ ప్రాంతాల్లో మెరుగైన వైద్యసేవలు అందించేందుకు త్వరలో పల్లె దవాఖానాలు ఏర్పాటు కానున్నాయి. పీహెచ్‌సీలపైన భారం తగ్గించడంతో పాటు గ్రామీణులకు ఉత్తమమైన సేవలు అందించేందుకు నేషనల్‌ హెల్త్‌ మిషన్‌ ద్వారా వీటిని ఏర్పాటు చేస్తున్నారు. వైద్యులతో పాటు ఇతర సిబ్బందిని నియమించేందుకు నోటిఫికేషన్‌ ఇచ్చారు. .ఈ దవాఖానాల్లో ప్రాథమిక చికిత్సకు కావాల్సిన పరికరాలను అందుబాటులో ఉంచడంతో పాటు ప్రతీరోజు వైద్య సేవలు అందేవిధంగా ఏర్పాట్లు చేస్తున్నారు.

జిల్లాలో 32 పీహెచ్‌సీలతో పాటు ఏరియా ఆసుపత్రులు, ప్రభుత్వ జనరల్‌ ఆసుపత్రి ఉన్నాయి. వీటి పరిధిలో జిల్లాలోని అన్ని గ్రామాలకు వైద్య సేవలు అందిస్తున్నారు. ఇవేకాకుండా జిల్లాలో సబ్‌ సెంటర్‌లు కూడా ఉన్నాయి. ఇవన్నీ ఉన్నా కూడా సరైన సిబ్బంది లేకపో వడం, ఖాళీలు ఎక్కువగా ఉండడం వల్ల కొన్ని పీహెచ్‌ సీల పరిధిలో వైద్య సేవలు పూర్తిస్థాయిలో అందడం లేదు. జిల్లా లో 90 మంది వరకు వైద్యులు ఉండాల్సి ఉండగా.. 45 మందిలోపే పీహెచ్‌సీల్లో పనిచేస్తున్నారు. కీలక సమయంలో వైద్య సేవలకు ఆటంకాలు ఏర్పడుతున్నాయి. కరోనా సమయంలో ఉన్న సిబ్బందిపైనే ఎక్కువ భారం పడింది.

మూడు, నాలుగు గ్రామాలకు కలిపి ఒక పల్లె దవాఖానాను సబ్‌ సెంటర్‌, ఇతర ప్రాంతాల్లో ఏర్పాటు చేస్తున్నారు. వీటికోసం కొత్తగా 94 మంది మెడికల్‌ ఆఫీసర్‌లను కాంట్రాక్ట్ పద్ధతిలో నేషనల్‌ హెల్త్‌ మిషన్‌ కింద భర్తీ చేస్తున్నారు. కొద్ది రోజుల్లో ఇంటర్వ్యూలు నిర్వహించి వీరిని భర్తీ చేయనున్నారు. వీరితో పాటు అత్యవసర సిబ్బంది అయిన నర్సింగ్‌, ఇతర విభాగాల వారిని కూడా ఈ మిషన్‌ కింద తీసుకుంటున్నారు. ఈ దవాఖానాలో ఆక్సిజన్‌, ఇతర పరికరాలను కూడా అందుబాటులో ఉంచుతున్నారు. ఈ నెలలోనే వీటిని ప్రారంభించేందుకు సిద్ధమవుతున్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. రియల్ టైమ్ న్యూస్ అప్ డేట్స్ కోసం.. ప్రభన్యూస్ ఫేస్‌బుక్‌, ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి
https://twitter.com/AndhraPrabhaApp, https://www.facebook.com/andhraprabhanewsdaily

Advertisement

తాజా వార్తలు

Advertisement