Sunday, December 8, 2024

మనుమడు హిమాన్షు గ్రాడ్యుయేషన్ వేడుక‌ల‌లో ముఖ్యమంత్రి కేసీఆర్ దంపతులు

హైద‌రాబాద్ – మంత్రి కెటిఆర్, శైలిమ దంప‌తులు త‌న‌యుడు హిమ‌న్షురావు 12వ‌ క్లాస్ పూర్తి చేసుకున్నాడు. గచ్చిబౌలిలోని వోక్రిడ్జ్ ఇంటర్నేషనల్ స్కూల్ నుంచి 12వ క్లాస్ ను పూర్తి చేసిన హిమ‌న్ష నేడు జ‌రిగిన‌ గ్రాడ్యుయేషన్ పట్టా ప్ర‌దానోత్స‌వ కార్య‌క్ర‌మంలో ఆ ప‌ట్టాను స్వీక‌రించాడు. ఈ కార్యక్రమానికి హిమాన్షు తాత, నాయనమ్మలైన సీఎం కేసీఆర్, శోభమ్మ దంపతులు, తల్లిదండ్రులు కేటీఆర్, శైలిమ, చెల్లెలు అలేఖ్యతో పాటు ఇతర కుటుంబ సభ్యులు హాజరయ్యారు.
‘గ్రాడ్యుయేషన్ డే’ సందర్భంగా 12వ తరగతిని విజయవంతంగా పూర్తి చేసిన విద్యార్థులకు ఓక్రిడ్జ్ స్కూలు యాజమాన్యం గ్రాడ్యుయేషన్ పట్టాలను అందజేశారు. విద్యనభ్యసిస్తూనే క్రీడలు, సాంస్కృతిక రంగం, సామాజిక సేవ వంటి రంగాల్లో అత్యంత ప్రతిభ కనబర్చిన విద్యార్థినీ, విద్యార్థులకు స్కూల్ యాజమాన్యం ప్రతిభా పురస్కారాలు అందజేసింది. ఇందులో భాగంగా.. హిమాన్షు ‘కమ్యూనిటి యాక్టివిటీ సర్వీసెస్’ (సిఎఎస్) విభాగంలో గొప్ప ప్రతిభను ప్రదర్శించారు. దాంతో హిమాన్షు కు సీఎఎస్ విభాగంలో ఎక్స్ లెన్స్ అవార్డు అందజేశారు.
గ్రాడ్యుయేషన్ పట్టాను అందుకున్న హిమాన్షు స్టేజీ దిగివచ్చి తాత సీఎం కేసీఆర్ చేతుల్లో గ్రాడ్యుయేషన్ పట్టాను పెట్టి పాదాలకు నమస్కరించి ఆశీర్వాదం తీసుకున్నాడు. భవిష్యత్తులో మరిన్ని ఉన్నత శిఖరాలను అధిరోహించాలని మనుమడిని కేసీఆర్ ఆశీర్వదించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement