Sunday, April 28, 2024

Follow up: హుస్నాబాద్​లో హైటెన్ష‌న్… బండి యాత్ర‌పై కాంగ్రెస్ దాడి..

బిజెపి, కాంగ్రెస్ కార్య‌క‌ర్త‌ల మ‌ధ్య ఘ‌ర్ష‌ణ‌ల‌తో హుస్నాబాద్‌ మండలం రాములపల్లిలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. బిజెపి ఎంపి బండి సంజయ్‌ యాత్రను అడ్డుకునేందుకు కాంగ్రెస్‌ నేతలు యత్నించారు. దీంతో కాంగ్రెస్‌, బీజేపీ కార్యకర్తల మధ్య ఘర్షణ చోటుచేసుకోవడంతో పోలీసులు పలువురిని అరెస్ట్‌ చేశారు. హుస్నాబాద్‌లో బీజేపీ ఫ్లెక్సీలను కాంగ్రెస్‌ కార్యకర్తలు చించివేశారు. హుస్నాబాద్‌ నియోజకవర్గంలో పోలీసులు మోహరించడంతో టెన్షన్ వాతావరణం నెలకొంది. కాగా, మంత్రి పొన్నం ప్రభాకర్‌పై బండి సంజయ్‌ అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ కాంగ్రెస్‌ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దీనిని నిర‌సిస్తూ బండి యాత్ర‌ను అడ్డుకున్నామంటూ ప్ర‌క‌టించారు.

- Advertisement -

నాలుక‌,ఒళ్లు ద‌గ్గ‌ర పెట్టుకో – బండికి పొన్నం వార్నింగ్…

ఈ ఘ‌ర్ష‌ణ‌ల‌పై మంత్రి పొన్నం ప్ర‌భాక‌ర్ మాట్లాడుతూ, నాలుక, ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడాలని బండి సంజయ్ పై మంత్రి ఫైర్ అయ్యారు. బండి సంజయ్ రాజకీయ డ్రామాలకు తెరలేపారని అన్నారు. అయిదు సంవత్సరాల పదవి కాలంలో కరీంనగర్ పార్లమెంట్ పరిధిలోని ప్రజలకు బండి సంజయ్ ఏం చేసారు? అని మండిపడ్డారు. శ్రీరాముని పేరు మీద ఓట్ల ఆడడం కాద‌ని, .. నిజంగా నియోజకవర్గ ప్రజలకు ఏం చేశారో చెప్పాలని అన్నారు. రాముడి పుట్టుక గురించి, అక్షింతల గురించి తాను మాట్లాడలేదని అన్నారు. త‌న తల్లి జన్మకు సంబంధించిన మాటలు బండి మాట్లాడుతున్నార‌ని, ఇది ఎంత వరకు సమంజసమో సభ్య సమాజం గ‌మ‌నించాల‌ని అన్నారు.

రాముడిని అంటే బ‌రాబ‌ర్ దాడి చేస్తాం… బండి సంజ‌య్

తాను ఎవరిపైనా వ్యక్తిగత వ్యాఖ్యలు చేయలేదని బండి సంజయ్‌ అన్నారు. రాజకీయ లబ్ధి కోసం కాంగ్రెస్‌ ప్రయత్నిస్తోందన్నారు. రాముడిని అంటే బరాబర్‌ కౌంటర్‌ అటాక్‌ చేస్తాం, మంత్రి పొన్నం కాంగ్రెస్ శ్రేణులను రెచ్చగొడుతున్నారని బండి సంజయ్‌ మండిపడ్డారు. 6 గ్యారంటీలను అమలు చేయడం చేతగాక.. ప్రశాంతంగా ప్రజాహిత యాత్ర చేస్తుంటే కాంగ్రెస్ మూకలను పంపి విధ్వంసం సృష్టించాలనుకుంటే చూస్తూ ఊరుకునే ప్రసక్తే లేదని పొన్నం ప్రభాకర్‌ను హెచ్చరించారు. గతంలో రేవంత్ రెడ్డి పీసీసీ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు పొన్నం ప్రభాకర్ ఆయనను తీవ్రంగా వ్యతిరేకించారని.. ఇప్పుడు కూడా ఇలాంటి విధ్వంసాలకు పాల్పడుతూ అరాచకాలు సృష్టిస్తూ శాంతి భద్రతల సమస్య తలెత్తేలా చూస్తున్నారని మండిపడ్డారు. పొన్నం పట్ల జాగ్రత్తగా ఉండాలని రేవంత్ కు సూచించారు. కొత్తగా మంత్రి అయినవని ఊరుకుంటున్నాన‌ని, మనోడే కదా అని భరిస్తున్నాని అన్నారు. కానీ సహనాన్ని చేతగానితనంగా భావిస్తే ఊరుకుంటామా..? మా రాముడిని, దేవుడిని కించపరిస్తే భరించాలా అని ప్రశ్నించారు బండి సంజ‌య్.

Advertisement

తాజా వార్తలు

Advertisement