Monday, April 15, 2024

Gutkha: ఏజెన్సీలో గుట్కా జోరు.. అర్ధరాత్రి హ‌ద్దులు దాటిస్తున్న‌ వ్యాపారులు

ఏజెన్సీలో గుట్కా వ్యాపారం ఎట్లా జ‌రుగుతుందో తెలుసా.. అధికారులు, వ్యాపారులు ఏం రిలేష‌న్ మేయింటేన్ చేస్తున్నారో తెలుసా.. గ్రామాలు, ప‌ల్లెల్లోకి గుట్కా ఏ విధంగా స‌ప్ల‌య్ అవుతుందో తెలుసా.. పోలీసుల‌కు గుట్కా వ్యాపారుల‌కు లింక్ ఏమిట‌నే విష‌యాలె తెలియాలంటే.. ఈ స్టోరీ చ‌ద‌వండి..

వాజేడు (ప్రభ న్యూస్): ఏజెన్సీ ప్రాంతంలో గుట్టుచప్పుడు కాకుండా గుట్కా వ్యాపారం కొనసాగిస్తూ కోట్ల రూపాయలు గడిస్తున్నారు. చిల్లర దుకాణాలతో మొదలుకొని పెద్ద పెద్ద కిరాణా షాపుల్లో గుట్కాలను విక్రయిస్తూ ప్రభుత్వ నిబంధనలు బేఖాతరు చేస్తూన్నారు. చట్టాలను చుట్టాలుగా మలుచుకుని బడాబాబులు అధికారులకు కాసులు ఎరగా చూపి రిలేష‌న్‌ కొనసాగిస్తున్నారు. కాసులకు కక్కుర్తిపడి కొందరు అధికారులు గుట్కా వ్యాపారులతో చీకటి ఒప్పందాలు కుదుర్చుకొని వారి వ్యాపారానికి బాసటగా నిలుస్తూ అండదండలు అందించడంతో అక్రమ గుట్కా వ్యాపారానికి అడ్డు అదుపు లేకుండా పోతోంది.

మారుమూల ఏజెన్సీ ప్రాంతమైన ములుగు జిల్లా ఏటూరునాగారం, వెంకటాపురం సర్కిల్ పరిధిలోని వాజేడు, వెంకటాపురం, నాగారం, కన్నాయిగూడెం తదితర మండలాల్లోని గిరిజన పల్లెల్లో గుట్కా వ్యాపారం జోరుగా కొనసాగుతుంది. వ్యాపారానికి అనువుగా ఉన్న గ్రామాలైన కన్నాయిగూడెం, ఏటూరునాగారం, వాజేడు, ధర్మవరం, చెరుకూరు, చందుపట్ల, ప్రజలపల్లి, ఏడుజలపల్లి, ఎలుబాకా వంటి అనువైన గ్రామాలకు గుట్కాలను సరఫరా చేస్తున్నారు. తమ వ్యాపారం మూడు పువ్వులు ఆరు కాయలుగా విరాజిల్లుతోంది.

వెంకటాపురం మండలానికి చెందిన ఓ బడా వ్యాపారి గుట్టుగా ఈ వ్యాపారాన్ని కొనసాగిస్తున్నారు. గుట్కా ప్యాకెట్లను అమ్మ‌కూడ‌ద‌న్న‌ నిబంధన ఉన్నప్పటికీ అవేవి ప‌ట్టించుకోకుండా అడ్డదారిలో వ్యాపారం కొనసాగిస్తున్నారు. ఇంత జరుగుతున్న నిఘా పెట్టాల్సిన అధికారులు ప‌ట్టించుకోవ‌డం లేదు. పైగా వారి వ్యాపారానికి స‌హ‌క‌రిస్తున్న‌ట్టు తెలుస్తోంది. ఈ వ్యాపారం అడ్డులేకుండా కొనసాగడానికి సంబంధిత శాఖ అధికారులకు నెలవారీ ముడుపులు ముట్టజెప్తున్నార‌నే ఆరోపణలు బహిరంగంగా వినిపిస్తున్నాయి.

- Advertisement -

గుట్కా వ్యాపారం జరిగేది ఇలా :
తెలంగాణ సరిహద్దు ప్రాంతమైన ఛత్తీస్గఢ్ రాష్ట్రంలోని మద్దెడు, భూపాలపట్నం ప్రాంతాలనుండి అర్ధరాత్రి వేళ ములుగు జిల్లా నూగూరు వెంకటాపురం మండలానికి లక్షల విలువచేసే గుట్కా ప్యాకెట్లు త‌ర‌లిస్తున్నారు. అక్కడి నుండి వాజేడు, ఏటూరునాగారం, కన్నాయిగూడెం తదితర మండలాల్లోని గిరిజన గ్రామాలకు సరఫరా చేస్తున్నారు. చిరు దుకాణాలతో మొదలుకొని పెద్ద పెద్ద కిరాణా షాపుల్లో గుట్కా ప్యాకెట్లను విక్రయిస్తున్నారు. పది రూపాయల విలువచేసే గుట్కా ప్యాకెట్లను 30నుండి 50 రూపాయల విలువ ధర విక్రయిస్తున్నారు. గుట్కా విక్రయాలపై నిఘా పెట్టిన ఏటూరునాగారం ఏ ఎస్ పి ఆలం గౌస్ అప్పట్లో లక్షల విలువచేసే గుట్కా ప్యాకెట్లను చెరుకూరు ప్రాంతంలో పట్టుకున్నారు. కాగా ఇప్పుడు అధికారులు ప‌ట్టించుకోక‌పోవ‌డంతో సద్దుమణిగిన వ్యాపారం ఏజెన్సీ ప్రాంతంలో మ‌ళ్లీ జోరుగా సాగుతోంది.

మత్తుకు బానిస అవుతున్న యువత
గుట్కా ప్యాకెట్లు ఏజెన్సీ మండలాల్లోని గిరిజన గ్రామాల్లో పుష్కలంగా లభించడంతో యువత మత్తుకు బానిసగా మారుతున్నారు. చిన్న పెద్ద అనే తేడా లేకుండా గుట్కా ప్యాకెట్లను తింటూ ఆరోగ్యాన్ని నాశనం చేసుకుంటున్నారు. కేన్సర్ వంటి వ్యాధులకు గురై కొందరు చనిపోతున్నారు. ఒకవైపు ఆర్థికంగా చితికిపోతూనే.. కుటుంబానికి ఆస‌రాగా ఉండాల్సిన వారు ప్రాణాలను కోల్పోతున్నారు. దీంతో ప‌దుల సంఖ్య‌లో కుటుంబాలు దిక్కులేక అనాథ‌లుగా మారుతున్న ప‌రిస్థితులున్నాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement