Thursday, May 2, 2024

నియామక భర్తీ తర్వాతే సాధారణ బదలీలు.. నిర్ణయించిన సర్కార్‌

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ: రాష్ట్రంలో ఉద్యోగ నియామక ప్రక్రియ పూర్తయిన తర్వాతే సాధారణ బదలీల దిశగా సర్కార్‌ యోచిస్తున్నట్లుగా తెలిసింది.. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల సాధారణ బదలీలకు తీవ్ర జాప్యం ఎదురైన నేపథ్యంలో ప్రస్తుత సర్దుబాట్లతో కొంత మేర ఈ కసరత్తు పూరత్తయినట్లుగా ప్రభుత్వం భావిస్తున్నది. నూతన నియామకాల భర్తీ తర్వాత సీనియర్లకు ప్రాధాన్యతలతో బదలీల ప్రక్రియను చేపట్టాలని నిర్ణయించింది. వచ్చే ఏడాది మే, జూన్‌ నెలల్లో బదలీలకు గడువుగా నిర్దేశించుకున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే జిల్లా, జోన్‌, మల్టి జోన్ల పరిధిలో పలువురు ఉద్యోగులు ఆయా జిల్లాలు, జోన్లు, మల్టి జోన్లలో విధుల్లో చేరారు. దీంతో మెజార్టీ ఉద్యోగులకు స్థానచలనం కల్గింది. పరస్పర, స్పైజ్‌ బదలీలు కూడా ముగియడంతో పాలనపై దృష్టి పెట్టాలని సర్కార్‌ ఆదేశించింది. జిల్లా కేంద్రాలు, నగరాలు, పట్టణాల్లో పలు పోస్టుల్లో ఖాళీలు ఎక్కువగా ఉన్నాయి. గత కొంత కాలంగా వేలాదిమంది ప్రభుత్వోద్యోగుల నిరీక్షణకు మోక్షం దక్కడంలేదు. ఉమ్మడి రాష్ట్రంలోనూ, ఆ తర్వాత స్వరాష్ట్రం తెలంగాణలోనూ ఉద్యోగ బదలీలపై ప్రభుత్వం సానుకూల నిర్ణయం తీసుకోలేదు. అయితే తాజాగా తెలంగాణలో ఉద్యోగ బదలీలపై నెలకొన్న స్థబ్దత మరింత పెరిగింది. కీలకమైన ప్రభుత్వ శాఖల్లో దాదాపు ఏడేళ్లుగా బదలీలు లేకపోవడంతో ఉద్యోగుల్లో నిరాశ పెరుగుతోంది. ప్రతీ ఏటా ఏప్రిల్‌లో నోటిఫికేషన్‌ జారీ చేసి మే నాటికి సాధారణ బదలీలు జరిపేవారు. మూడున్నరేళ్లుగా తెలంగాణలో బదలీల షెడ్యూల్‌ ప్రకటించలేదు. ప్రతీ మూడేళ్లకోసారి బదలీలు జరిపి తీరాలన్న నిబంధన అమలు కావడంలేదు. గతంలో రెవెన్యూ శాఖలోని కొందరితోపాటు, అక్రమాలు వెలుగులోకి రావడంతో సబ్‌ రిజిస్ట్రార్‌లను బదలీ చేశారు. ఇందులో భాగంగా 6వ జోన్‌లోని సబ్‌ రిజిస్ట్రార్‌లను మూకుమ్మడిగా బదలీ చేశారు. ఆ తర్వాత మిగతా శాఖల్లోనూ బదలీలు ఉంటాయని ప్రభుత్వం ప్రకటించినా ఆచరణరూపం దాల్చలేదు.

పీడిస్తున్న కొరత…

కొత్త జిల్లాల ఏర్పాటు తర్వాత భారీగా సిబ్బంది కొరత ఏర్పడింది. కొన్ని శాఖల్లో అయితే ఏకంగా ఔట్‌ సోర్సింగ్‌, కాంట్రాక్టు సిబ్బందితోనే పనులను నెట్టుకొస్తున్న పరిస్థితి ఉంది. కొత్తగా ఏర్పడిన జిల్లాలకు తాత్కాలిక పద్దతిలో ఆర్డర్‌ టూ సర్వ్‌ ప్రాతిపదికన ఉద్యోగులు, సిబ్బందిని కేటాయించారు. కొత్త జిల్లాలు ఏర్పాటైన తర్వాత కొందరిని తమ సొంత జిల్లాలకు బదలీ చేశారు. మూడున్నరేళ్లకుపైగా లాంగ్‌ స్టాండింగ్‌లో ఒకే చోట విధుల్లో ఉన్న ఉద్యోగులకు తప్పనిసరిగా స్థానచలనం కల్పించే దిశగా ప్రభుత్వం విధివిధానాలను ఖరారు చేయాలని మే నెలలో నిర్ణయించారు. ఇందుకు ఆర్ధిక శాఖ కూడా ప్రతిపాధనలు సిద్దం చేసింది. చేయనున్నట్లు ప్రభుత్వ వర్గాలు చెప్పాయి. ఆరోగ్య కారణాలు, స్పౌస్‌ కేసులను ప్రత్యేకంగా పరిశీలించే అవకాశాలున్నాయి.

ఉద్యోగ భర్తీ తర్వాతేనా….

రాష్ట్రంలో మొత్తం ఉద్యోగుల సంఖ్య 4,41,995 కాగా ప్రస్తుతం 3,33,781 మంది పనిచేస్తున్నారు. ఇందులో ప్రస్తుతం ఖాళీల సంఖ్య 80039గా ఉంది. 11103 మంది కాంట్రాక్టు ఉద్యోగులను క్రమబద్దీకరించే ప్రక్రియ ప్రారంభించారు. ఇక మిగిలిన ఖాళీలను దశల వారీగా భర్తీ చేసే కార్యాచరణ పురోగతిలో ఉంది. ఇప్పుడున్న కొరత నేపథ్యంలో ఐఏఎస్‌ అధికారినుంచి కింది స్థాయి ఉద్యోగి వరకు ఇంచార్జీ బాధ్యతలు నెరవేర్చాల్సిన పరిస్థితి ఉంది. ఇందులో లక్షమందికిపైగా సెలెక్ట్‌ క్యాడర్‌(జూనియర్‌ అసిస్టెంట్‌కు మించిన స్థాయి)లో ఉన్నారు. వీరిలో ఎక్కువ మంది మూడేళ్లకు మించి ఒకేచోట పనిచేస్తున్న వాళ్లే. వీరిని బదలీ చేస్తేనే అసహనంతోపాటు, అవినీతి తగ్గుతుందని ప్రభుత్వం కూడా గతంలో నిర్ణయించింది.

- Advertisement -

ఏడేళ్లుగా అంతే…

సమైక్య రాష్ట్రంలో అనేక ఇబ్బందులను ఎదుర్కొన్న ఉద్యోగులు 2012 నుంచి బదలీల కోసం ఎదురుచూస్తున్నారు. 2013లో ప్రభుత్వం జీవో జారీ చేసినా అనేక కారణాలతో అది కార్యారూపంలోకి రాలేదు. ఈ నేపథ్యంలో శాఖాధిపతులపై ఉద్యోగులు ఒత్తిడి పెంచుతూ బదలీలపై దరఖాస్తులను సమర్పిస్తున్నారు. అయితే గతేడాది భార్యాభర్తల అంశంలో బదిలీలపై తెలంగాణ సర్కార్‌ జీవో 182ను జారీ చేసింది.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement