Saturday, April 13, 2024

Franchise Vote – ఓటు వేస్తేనే అడిగే హ‌క్కు ఉంటుంది…కొత్త ఓట‌ర్ల‌కు క‌విత పిలుపు

ప్రజాస్వామ్య ప్రక్రియలో యువత క్రియాశీలక భాగస్వామ్యం కావాలని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత గారు పిలుపునిచ్చారు. ఓటు వేయకపోతే పనికిరాని వాళ్లు రాజకీయాల్లోకి వస్తారని స్పష్టం చేశారు. గురువారం నిజామాబాద్ నగరంలోని జనార్దన్ ఫంక్షన్ హాల్ లో కొత్తగా ఓటు హక్కు పొందిన కాలేజీ విద్యార్థినులతో ఎమ్మెల్సీ కవిత సంభాషిం చారు.ఓటు వేయకపోతే ప్రశ్నించే హక్కు ఉండదని, వ్యవస్థలు నిర్వీర్యమ వుతాయని తెలిపారు. ఆరోపణలు చేసే ముందు రాజకీయ నాయకులు ఆలోచించాలని సూచించారు. ప్రజాస్వామ్యం ఎంత బలంగా ఉంటే… దేశం అంత శక్తివంతంగా ఉంటుందని పేర్కొన్నారు. పెద్ద సంఖ్యలో హాజరైన విద్యార్థినులు అడిగిన ప్రశ్నలకు జవాబులిచ్చారు.


ఎన్నికలు అంటే బ్రహ్మపదార్థమనో, సంబంధం లేదనో, ఎవరు గెలిస్తే ఏమిటన్న అభిప్రాయంలో ఉండవద్దని సూచించారు. తిండి, గూడు, బట్ట ఎంత ముఖ్యమో స్వేచ్ఛ కూడా అంతే ముఖ్యమని, దాన్ని పోకుండా చూసుకోవా లని, స్వేచ్ఛను కాపాడుకోవా లని చెప్పారు. సామాజిక మాధ్యమాలను సద్వినియోగం చేసుకోవాలని, సానుకూల దృక్పథంతో సామాజిక మాధ్యమాలను వాడాలని తెలిపారు. ప్రతీ రోజు వార్తాపత్రికలను చదవాలని, సమాజం పట్ల అవగాహన కలిగించుకోవాలని సూచించారు. మంచి భవిష్యత్తు కోసం ప్రజాస్వామ్య ప్రక్రియలో క్రియాశీలకంగా భాగస్వామ్యం కావాలని వివరించారు. ఓటు వేయకపోతే రాజకీయాల్లోకి పనికిరానివాళ్లు, జ్ఞానం లేని వాళ్లు వస్తారని, తద్వారా వాళ్లు తీసుకునే నిర్ణయాలకు ప్రజలంతా ఇబ్బంది పడుతారన్నారు. అందులోనూ సరైన వాళ్లని ఎన్నుకోవాలని స్పష్టం చేశారు. ఓటు వేయకపోతే ప్రభుత్వాలను అడగడానికి హక్కు ఉండదని అభిప్రాయపడ్డారు. భారత సైన్యం ప్రతికూల వాతావరణ పరిస్థితిని తట్టుకొని కూడా దేశానికి రక్షణ కల్పిస్తుంటే కనీసం మనం లైనులో నిలబడి ఓటు వేయలేమా అని ప్రశ్నించారు. ఓటు హక్కును వినియోగించుకోకపోతే వ్యవస్థలు నిర్వీర్యమ వుతాయన్నారు. సినిమాల్లో రాజకీయ నాయకులను, పోలీసులను విలన్లుగా చూపిస్తున్నారని, వాటిని పట్టించుకోవద్దని, మనల్ని మనమే బద్నాం చేసుకుంటే వ్యవస్థ బద్నాం అవుతుందని చెప్పారు. మన ప్రజాస్వామ్యం ఎంత బలంగా ఉంటే మనం మన దేశాన్ని అంత బలంగా కాపాడుకుంటామని స్పష్టం చేశారు. ఐక్యంగా ఉంటాలని, సమూహంలో శక్తి ఉంటుంది కాబట్టి కలిసి ప్రశ్నించాలని సూచించారు.

ప్రపంచాన్ని వ్యాపారం ఆధిపత్యం చెలాయిస్తుంది ..
ప్రపంచాన్ని వ్యాపారం ఆధిపత్యం చెలాయిస్తుందని ప్రస్తావించారు.“అంత సైన్యం ఉన్న అమెరికా చైనాతో నేరుగా పోరాటం చేయడం లేదు. ఎందుకంటే… చైనా నుంచి వచ్చే వస్తువులు అమెరికాకు రాకపోతే మొత్తం అమెరికా ఆర్థిక వ్యవస్థ ఆగిపోయే పరిస్థితి ఉంది. అంటే అక్కడ ఆధిపత్యం వ్యాపారానిది ఉందా ? రాజకీయానిది ఉందా ? కాబట్టి వ్యాపారం వెనుక ఉన్న జియోపాలిటిక్స్ ను అర్థం చేసుకోవాలి” అని వ్యాఖ్యానించారు. ప్రపంచం మారుతున్న క్రమంలో మన దేశాన్ని రక్షించుకోవాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. కాళేశ్వరం ప్రాజెక్టులో రూ. లక్ష కోట్ల మేర అవినీతి జరిగిందని కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ ఆరోపిస్తున్నారని, మొత్తం ప్రాజెక్టు వ్యయం రూ. 80 వేల కోట్లు అయితే రూ. లక్ష కోట్ల అవినీతి ఎలా జరుగు తుందని ప్రశ్నించారు. ప్రాజెక్టు వ్యయానికి మంచి అవినీతి జరిగిందనడానికి తలకాయ ఉండాలని, ఆరోపణ చేసే ముందు కనీసం ఆలోచించాలి కదా అని మండిపడ్డారు. హరితహారం కింద మొక్కలు నాటాలని సీఎం కేసీఆర్ నిర్ణయించినప్పుడు అందరూ విమర్శించారని, కానీ ఇప్పుడు దేశంలోనూ ఏ రాష్ట్రంలో లేని విధంగా తెలంగాణలో 7 శాతానికిపైగా అటవీ విస్తరణ పెరిగిందని గుర్తు చేశారు.

రాజకీయాల్లోకి వచ్చే మహిళలకు, యువతకు ఏం సందేశమిస్తాయని ఓ యువతి అడిగిన ప్రశ్నకు… కవిత సమాధానమిస్తూ… రాజకీయాలు అంత సులువు కాదని, కానీ రాజకీయ నాయకులుగా తీసుకునే ఒక నిర్ణయం కోట్ల మంది మంది జీవితాలను మార్చుతుందని, కాబట్టి కష్టపడి ప్రజల కోసం పనిచేయాలని అన్నారు. అన్ని చేస్తేనే ప్రజలు ఆదరిస్తారని చెప్పారు. అన్నీ ఆలోచిం చుకోవాలని రాజకీయాల్లోకి రావాలని అన్నారు. వచ్చిన తర్వాత మాత్రం ప్రజల కోసం పనిచేయాలని చెప్పారు. కుటుంబ సభ్యుల మద్ధతు లేకపోతే మహిళలు రాజకీయాల్లోకి రావద్దని, కుటుంబ మద్ధతు తీసుకో వాలని స్పష్టం చేశారు.
ప్రభుత్వ రంగంలోనే కాకుండా ప్రైవేటు రంగంలో ఉద్యోగాల కల్పనకు ప్రభుత్వం ఏం చర్యలు తీసుకుంటున్నదని, స్వయం ఉపాధికి సహకారం, జిల్లాల్లో ఐటీ హబ్ ల ఏర్పాటుపై యువతులు అడిగిన ప్రశ్నలకు కవిత గారు స్పందిస్తూ…. దేశంలో ఎక్కడా లేని విధంగా 2.3 లక్షల ఉద్యోగాలు ఇచ్చామని గుర్తు చేశారు. రాష్ట్రానికి దాదాపు 22 వేల కంపెనీలు వచ్చాయని, దాని వల్ల 30 లక్షల మందికి ప్రత్యక్షంగా ఉద్యోగాలు వచ్చాయని, పరోక్షంగా మరో 30 లక్షల మందికి ఉపాధి కలిగిందని వివరించారు. స్వయం ఉపాధి కోసం కూడా స్టార్టప్ వంటివాటిని ప్రోత్సహిస్తున్నామని, ప్రభుత్వం అనేక కార్యక్రమాలు చేపడుతున్నదని చెప్పారు. టీహబ్, టీ వర్క్స్ వంటివాటిని ప్రభుత్వం ఏర్పాటు చేసిందన్నారు. స్వయం ఉపాధికి ప్రభుత్వం చేయుతనిస్తున్నదని స్పష్టం చేశారు. ఎటువంటి హామీ లేకుండా రూ. 2 కోట్ల మేర రుణ సౌకర్యం కల్పిస్తోందని తెలిపారు. నిజామాబాద్ తో సహా ఇతర జిల్లాలకు ఐటీ కంపెనీలను తీసుకురావడంలో అనేక సవాళ్లు ఎదురయ్యా యని, అయినా కూడా స్థానికంగానే యువతకు ఉద్యోగాలు కల్పించాలన్న ఉద్ధేశంతో అనేక సబ్సిడీలు ఇచ్చి జిల్లాల్లో ఐటీ హబ్ లకు కంపెనీలను తీసుకొస్తున్నామని పేర్కొన్నారు. జాబ్ మేళాలు కూడా నిర్వహిస్తున్నామన్నారు.

టీఎస్పీఎస్సీలో సాంకేతిక సమస్యలను పరిష్కారానికి ప్రభుత్వం ఏం చర్యలు చేపడుతుందని ఒక యువతి అడగగా… రాష్ట్రంలో ఒకేఒక్కసారి పేపర్ లీక్ ఉదంతం జరిగిందని, వెంటనే 10 రోజుల్లో నిందితులను పట్టుకున్నామని, ఒక రాజకీయ పార్టీ ప్రమేయం ఉందని గుర్తించామని వివరించారు. రాజస్థాన్ లో 14 సార్లు పేపర్ లీక్ అయ్యిందని, గుజరాత్ లో 28 సార్లు లీక్ అయ్యాయని, ఇతర ప్రభుత్వాలతో పోల్చితే తెలంగాణ ప్రభుత్వం సమర్థవంతంగా పనిచేస్తున్నదని స్పష్టం చేశారు. ఫలితాలు వచ్చిన తర్వాత కొంత మంది కోర్టుల్లో కేసులు వేయడం వల్ల కొన్ని ఉద్యోగాల భర్తీ వాయిదా పడ్డాయని, అది జరగకుండా చూడడానికి ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటోందని తెలిపారు.

- Advertisement -

బీఆర్ఎస్ పార్టీ అద్భుతం.

బీఆర్ఎస్ పార్టీకి ఎందుకు ఓటు వేయాలని ఒక విద్యార్థిని ప్రశ్నించగా.. “బీఆర్ఎస్ పార్టీ అద్భుతం. తెలంగాణ రాష్ట్ర సాధిన కోసం పార్టీ కొట్లాడింది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ప్రతీ రోజూ రాష్ట్ర అభివృద్ధి కోసం బీఆర్ఎస్ పనిచేస్తోంది. అనేక సంస్కరణలు తీసుకొచ్చాము. అనేక సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తున్నాము. ప్రజల నుంచి వచ్చే సలహాలను, సూచలను స్వీకరించి మార్పులు చేస్తున్నాము. అన్ని వర్గాలను సమానంగా చూస్తున్నాము. సానుకూల ధృక్పధంతో బీఆర్ఎస్ రాజకీయాలు చేస్తున్నది. కాబట్టి బీఆర్ఎస్ కు, కారు గుర్తుకు ఓటు వేయాలి” అని కవిత బదులిచ్చారు.అగ్రవర్ణాల పేదల కోసం కూడా ప్రభుత్వం కార్యక్రమాలు చేపడుతోందని, మూడో సారి అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రతీ నియోజకవర్గంలో అగ్రవర్ణాల పేదల కోసం గురుకుల పాఠశాల ఏర్పాటు చేయాలని సీఎం కేసీఆర్ నిర్ణయించారని పేర్కొన్నారు.

తొలిసారి ఓటు వేసినప్పటి అనుభవం చెప్పాలని ఒక విద్యార్థిని కోరగా… మొదటి నుంచి తన తండ్రికే ఓటు వేశానని, చింతమడకలో తొలిసారి తన తల్లిదండ్రులతో కలిసి ఓటు వేశానని, అది ఎప్పటికీ మరిచిపోలేని అనుభవం అని చెప్పారు. అలాగే, అమెరికాలో తాను చదువుకున్న రోజుల్లో అనుభవాలను పంచుకున్నారు.

సామాజిక మాధ్యమాల ద్వారా ఆడపిల్లలను వేధించేవారి పట్ల రాష్ట్ర ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తోందని స్పష్టం చేశారు. ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ తో డీప్ ఫేక్ ఫోటోలు, వీడియోలు సృష్టిస్తున్నారని, వాటిని అడ్డుకోడానికి దేశంలో చట్టం రావాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. చట్టం కోసం తాను కూడా పోరాటం చేస్తానని ప్రకటించారు. వేధింపులు వస్తే షీటీమ్స్ కు ఫిర్యాదు చేయాలని, సైబర్ భద్రత విషయంలో జాగ్రత్తగా ఉండాలని సూచించారు.

ఆయా రాష్ట్రాల్లో జనాభా దామాషా ప్రకారం రిజర్వేషన్లు అమలు కావాలని ఓ ప్రశ్నకు సమాధానమిచ్చారు. దీనిపై చర్చ జరిగితేనే రాజకీయ వ్యవస్థలోనూ ఆలోచన వస్తుందన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement