Monday, April 29, 2024

Exclusive – భూ బ‌కాసురుల‌పై ఉక్కుపాదం! భ‌ర‌తం ప‌ట్టేందుకు రేవంత్ స‌ర్కారు రెడీ

రూపుదాలుస్తున్న కొత్త చట్టాలు
సర్కారు చేతికి అక్రమార్కుల చిట్టా
హైదరాబాద్‌ చుట్టూ వేల కోట్ల దోపిడీ?
కొరడా ఝులిపించేందుకు సిద్దమవుతున్న ప్రభుత్వం
క‌ఠినమైన నిబంధనలతో ఆర్‌ఆర్‌ యాక్టు ముసాయిదా
సీఎం ఆదేశాలతో అధ్యయనం చేస్తున్న అధికారులు
కబ్జాకోరులు, భూ బకాసురుల భరతం పట్టేందుకు చర్యలు
హైదరాబాద్‌ మహానగరం చుట్టూ వేలాది ఎకరాలు హాంఫట్‌
రెవెన్యూ రికవరీ యాక్టు ప్రయోగం ద్వారా తిరిగి స్వాధీనం!
త్వరలో సాధ్యాసాధ్యాలపై సమీక్షించనున్న సీఎం రేవంత్‌
రెవెన్యూ, అనుబంధ విభాగాల అధికారులతో సమాలోచన

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ బ్యూరో :
అధికారంలోకి వచ్చిందే తడువుగా వెలుగుచూసిన అవినీతి అక్రమాలు, భూ కుంభకోణాలపైనే ప్రత్యేక దృష్టి కేంద్రీకరించిన రేవంత్‌ రెడ్డి సర్కారు.. ఇక బాద్యులపై కొరడా ఝులిపించడమే లక్ష్యంగా చర్యలకు సిద్ధమవుతోంది. అయితే, అధికారాన్ని అడ్డం పెట్టుకుని చేసిన అక్రమాలు, ప్రభుత్వ భూముల ఆక్రమణల విషయంలో ఇప్పుడున్న చట్టాలు, వాటిలోని లొసుగులు చర్యలకు అడ్డొస్తున్నాయి. ఈ కారణంగా వేల కోట్ల రూపాయల ఆస్తులు కొల్లగొట్టినా.. అక్రమార్కులు దర్జాగా తప్పించుకుని తిరుగుతున్న దాఖలాలు అనేకంగా ఉన్నాయి. అందులో కబ్జా కోరులే కాదు.. రాజకీయ దురంధరులు, ఉన్నతాధికారలు, సమాజంలో పలుకుబడి కలిగిన పెద్దలు కూడా ఉన్నారు. ఈ అనుభవాలను దృష్టిలో పెట్టుకుని చట్టాలను మరింత కఠినతరం చేయడం, అవసరమైతే కొత్త చట్టాలను తీసుకురావడంపై ముఖ్యమంత్రి సమాలోచన చేస్తున్నారు. గత రెండు నెలల కాలంగా ఈ అంశంపై అధ్యయనం చేసిన ముఖ్యమంత్రి హైదరాబాద్‌ మహానగరం చుట్టూ 6 జిల్లాల్లో విస్తరించి ఉన్న హెచ్‌ఎండీఏ పరిధిలోనే కాదు.. ఆయా జిల్లా కేంద్రాల్లో జరిగిన భూ భాగోతంపై ఆధారాలన్నీ సేకరించారు.

విశ్వసనీయంగా అందిన సమాచారం మేరకు భూ అక్రమార్కుల చిట్టా తాజాగా సర్కారు చేతికి అందింది. ఓ వైపు విజిలెన్స్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ దర్యాప్తు, మరోవైపు శాఖాపరమైన విచారణ, ఈ రెండింటికీ భిన్నంగా ధరణి కమిటీ అధ్యయనం.. ఇలా పలు కోణాల్లో జరిగిన భూ దోపిడీని, క్విడ్‌ ప్రోకో సందర్భాలను గుర్తించి జాబితాలు సిద్ధం చేసుకున్నారు. తనవద్ద ఉన్న ఆధారాలతో కొరడా ఝులిపించేందుకు త్వరలో కొత్త చట్టాలను తీసుకువచ్చే ప్రయత్నంలో ఉన్నారు. సీఎం రేవంత్‌ రెడ్డి ఆదేశాలతో ఈ అంశంపై ఉన్నతాధికారులు అధ్యయనం చేస్తున్నారు. కబ్జాకోరులు, భూ బకాసురుల భరతం పట్టేందుకు చర్యలు ఉన్న అవకాశాలన్నింటినీ పరిశీలిస్తున్నారు. హైదరాబాద్‌ మహానగరం చుట్టూ వేలాది ఎకరాలు అత్యంత ఖరీదైన భూములు గడిచిన పదేళ్ళ కాలంగా రెగ్యులరైజేషన్‌ రేరుతో ప్రైవేటు పరమయ్యాయి. తాజాగా వెలుగులోకి వచ్చిన హెచ్‌ఎండీఏ మాజీ డైరెక్టర్‌ శివబాలకృష్ణ ఉదంతం నేపథ్యంలో ప్రభుత్వం మరింత లోతుగా, క్షుణ్ణంగా అధ్యయనం చేసింది. ఈ కోణంలో జరుగుతున్న విచారణ తోడుతున్న కొద్దీ భూ అక్రమాలు పుంకాలుగా వెలుగుచూశాయి. ఈ దోపిడీని తీవ్రంగా పరిగణిస్తున్న కాంగ్రెస్‌ ప్రభుత్వం రెవెన్యూ రికవరీ యాక్టు ప్రయోగించి కొల్లగొట్టిన ప్రభుత్వ ఆస్తులన్నీ తిరిగి స్వాధీనం చేసుకునే దిశగా కసరత్తు చేస్తోంది. ఇందుకు సంబంధించి ఇప్పటికే పలుసార్లు అంతర్గతంగా సమీక్షించిన సీఎం రేవంత్‌ కఠిన చర్యలకు పూనుకునే అంశంపై త్వరలోనే ఉన్నతాధికారులతో సమీక్షించనున్నారు. సాధ్యాసాధ్యాలపై మరింత లోతుగా చర్చించి రెవెన్యూ, అనుబంధ విభాగాల అధికారులతో సమాలోచన చేయనున్నారు.

ప్రక్షాళన దిశగా పట్టణాభివృద్ధి, ప్రణాళిక విభాగాలు..
భారీగా అవినీతి వెలుగుచూసిన హెచ్‌ఎండీఏలోని ప్లానింగ్‌ విభాగాన్ని, అలాగే రాష్ట్రంతా వర్తించేలా పురపాలక పట్టణాభివృద్ధి , ప్రణాళికా విభాగాలను కూడా పూర్తిగా ప్రక్షాళన చేయాలని సర్కారు భావిస్తోంది. శివ బాలకృష్ణ తరహాలో మున్ముందు లేఅవుట్ల ఆమోదం, అడ్డదారిలో భవన నిర్మాణ అనుమతుల జారీ వంటి అవినీతి పునరావృతం కాకుండా పకడ్బందీగా చర్యలు చేపట్టేందుకు కఠిన చర్యలకు సిద్దమవుతోంది. అప్పటివరకూ లే-అవుట్ల ఆమోదం కానీ భవన నిర్మాణ అనుమతులు గానీ జారీ చేయవద్దని అంతర్గత ఆదేశాలు కూడా ఇచ్చారు. ల్యాండ్‌ యూసేజ్‌ కన్వర్షన్‌ వంటి వాటికి సంబంధించిన లావాదేవీలను కూడా నిలిపివేశారు. ఇప్పటికే ప్రభుత్వం విద్ద పరిశీలన దశలో ఉన్న దరఖాస్తులు చట్టబద్ధంగా, నిబంధనల ప్రకారం ఉన్నాయా? లేదా? అన్న విషయాన్ని గమనించేందుకు జీహెచ్‌ఎంసీ, హెచ్‌ఎండీఏతో పాటు- రెరా అధికారులుతో పర్యవేక్షిస్తున్నారు.

కఠినమైన నిబంధనలతో చట్టాలకు పదును..
హెచ్‌ఎండీఏ, జీహెచ్‌ఎంసీ విభాగాలకు ప్లానింగ్‌ సిబ్బందిని డిప్యూటేషన్లపై పంపే డైరెక్టర్‌ ఆఫ్‌ టౌన్‌ అండ్‌ కంట్రీ- ప్లానింగ్‌ నిఘాను మరింతగా పటిష్టం చేశారు. గత ప్రభుత్వంలో అధికారులు డిప్యూటేషన్‌ రూల్స్‌ను ఉల్లంఘించి ఏళ్లతరబడి ఒకే సీటులో కొనసాగినందువల్లే భారీగా అవినీతి, అక్రమాలు, నిబంధనలకు విరుద్ధంగా లే అవుట్ల ఆమోదం, భవన నిర్మాణ అనుమతుల జారీ వంటివి చోటు-చేసుకుంటు-న్నాయని ఇప్పటికే ఉన్నతాధికారులు తమ విచారణ నివేదికలో ప్రభుత్వానికి స్పష్టం చేశారు. ప్రస్తుతం జీహెచ్‌ఎంసీలోని 30 సర్కిళ్లు, ఆరు జోన్లతో పాటు- ప్రధాన కార్యాలయంలోని టౌన్‌ ప్లానింగ్‌ విభాగాల్లో సిబ్బంది కొరత చాలా ఉన్నందున, తొలుత 100 మంది సిబ్బందిని సర్కారు జీహెచ్‌ఎంసీకి కేటాయించారు. హెచ్‌ఎండీఏ, జీహెచ్‌ఎంసీ విభాగాల్లోని ప్లానింగ్‌ విభాగాలను ప్రక్షాళన చేసి, గాడినపెట్టేందుకు అత్యంత కఠినమైన నిబంధనలతో చట్టాలకు పదును పెట్టబోతున్నారు.

ఆర్వోఆర్‌ చట్టం సమూల మార్పులతో ప్రక్షాళన..
రాష్ట్రంలో మరింత మేలైన భూ పరిపాలన వ్యవస్థను ఆవిష్కరించి రైతులకు, భూ యజమానులకు మెరుగైన సేవలు అందించేందుకు ఆర్వోఆర్‌ చట్టాన్ని సమూలంగా ప్రక్షాళన చేయనున్నారు. 1948, 1971లతో పాటు- ఇతర అన్ని రాష్ట్రాల విధానాలను కమిటీ- సభ్యులు అధ్యయనం చేస్తున్నారు. ఇందులోనే సమకాలీన పరిస్థితులకు తగ్గట్లు-గా చేర్పులు, మార్పులతో కొత్త చట్టాన్ని రూపొందించాలన్న సూచనలను త్వరలో చేయనున్నట్లు- అధికారులు చెబుతున్నారు. భూ సమస్యలకు పరిష్కార మార్గాలను గత ప్రభుత్వం కేంద్రీకృతం చెయడం ద్వారా తహశీల్దార్‌ చేసే పనిని కూడా సీసీఎల్‌ఏకు ప్రతిపాదించాల్సి వస్తోంది. దీంతో భూమాతను అమలు చేస్తే అధికార వికేంద్రీకరణ అనివార్యమని ఇప్పటికే కమిటీ- తేల్చేసింది. దీన్ని కేటగిరిలుగా విభజించనున్నట్లు- తెలిసింది. గ్రామ, మండల, జిల్లా, రాష్ట్ర స్థాయిలో చేసే పనులను గుర్తించనున్నట్లు- సమాచారం. ఉదాహారణకు విరాసత్‌ గ్రామ స్థాయిలోనే పూర్తవుతుంది. వారసులెవరో ఆ ఊరిలోనే తేల్చేయొచ్చు. చిన్నచిన్న క్లరికల్‌ మిస్టేక్స్‌ మండల స్థాయిలోనే చేయవచ్చు. ఇలా అన్నింటినీ విడదీసేందుకు ప్లాన్‌ చేస్తున్నారు. అలాగే భూమాతకు ముందే గ్రామ సభల ద్వారా రెవెన్యూ డేటాను సరిదిద్దాలన్న సంకల్పంతో ఉన్నారు. అక్కడికక్కడే సమస్యల పరిష్కారాన్ని చూపడం ద్వారానే మెరుగైన భూ పరిపాలన వ్యవస్థ ఏర్పడుతుందని ప్రభుత్వం భావిస్తోంది. ఈ అంశాలన్నింటినీ దృష్టిలో పెట్టుకుని చట్టాలను కఠినతరం చేయనున్నారు.

- Advertisement -

చర్యలకు ముందు ముందుగా చట్ట సవరణ అనివార్యమే..
అధికారంలోకి రాగానే ముందుగా సమస్యలపై అధ్యయనానికి ప్రభుత్వం ధరణి కమిటీ వేసింది. ఈ కమిటీ- వివిధ శాఖల అధికారులతో అనేక సమావేశాలను నిర్వహించింది. దరఖాస్తులు పెండింగ్‌లో ఉండడానికి కారణాలను అన్వేషించింది. శాఖల మధ్య సమన్వయం లోపాన్ని గుర్తించింది. అయితే ధరణి పేరు మార్పు మొదలు.. ఏది చేయాలన్నా.. ముందుగా చట్ట సవరణ అనివార్యమే వాస్తవాన్ని ప్రభుత్వానికి ఇప్పటికే రెండు పర్యాయాలు ప్రాథమిక దర్యాప్తు నివేదికలను అందజేసింది. తెలంగాణ రైట్స్‌ ఇన్‌ ల్యాండ్‌ అండ్‌ పట్టాదారు పాస్‌ బుక్స్‌ యాక్ట్‌ – 2020 లోనే ధరణి పోర్టల్‌ ప్రస్తావన ఉండడం మూలాన ఉన్నపళంగా భూమాతగా తీసుకొచ్చే ఆస్కారమే లేదని కమిటీ స్పష్టం చేసింది. ధరణి పోర్టల్‌, కొత్త ఆర్‌ఓఆర్‌ చట్టం అమలుకు ముందు, ఆ తర్వాత క్షేత్రస్థాయిలో పర్యటించిన అధికారులు, నిపుణులు వాస్తవాలను తెలుసుకున్నారు. లీఫ్స్‌ అనే సంస్థ ద్వారా ధరణి సృష్టించిన సమస్యలపై సీఎం అధ్యయనం చేయించారు. ఎండోమెంట్‌, వక్ఫ్‌ ఆస్తులపై స్పష్టత వచ్చిన తర్వాత ఆ శాఖల్లో ట్రిబ్యునళ్లు లేకుండా జారీ చేసిన ఎన్వోసీలపై విచారణ జరిపే వ్యవస్థను ఆవిష్కరించనున్నారు. ఫారెస్ట్‌ ల్యాండ్‌ వివరాలపై అటవీ శాఖ లెక్కలకు, రెవెన్యూ శాఖ డేటా మధ్య తేడా నియంత్రణకు అవసరమైన చర్యలు తీసుకోనున్నారు. అలాగే సామాన్యులను ఇబ్బందులకు గురి చేస్తున్న గెజిట్‌ నోటిఫికేషన్‌పై కూడా సీఎం సమీక్ష చేయనున్నారు.

తాజాగా సీఎం దృష్టికి మరో భారీ కుంభకోణం..
గత ప్రభుత్వంలో భారీగా అవినీతి జరిగిందని గుర్తించిన సీఎం రేవంత్‌ రెడ్డి వివిధ ప్రాజెక్టుల నిర్మాణంలోనే కాదు.. బిల్లుల చెల్లింపుల విషయంలోనూ భారీ స్కాం ఉన్నట్లు గుర్తించారు. 2014 నుంచి 2023 వరకు సీఎంఆర్‌ఎస్‌ నిధులు భారీగా దుర్వినియోగం అయినట్లు- నిర్ధారించారు. 2018లో ముందస్తు ఎన్నికలకు ముందు అప్పటి ఎమ్మెల్యేల దగ్గరున్న అనుచరులకు నియోజకవర్గానికి 20 మంది చొప్పున ఎలాంటి మెడికల్‌ బిల్లులు లేకుండానే రూ.10 నుంచి 15 లక్షల వరకు చెక్కులు అందించినట్లు- తాజాగా సర్కారు గుర్తించింది. మొత్తం రూ.200 కోట్లకు పైగానే నిధుల గోల్‌మాల్‌ అయినట్లు- అధికారులు అంచనా వేస్తున్నారు. ఇక ఈ అంశంపై ఫోకస్‌ పెట్టిన సీఎం అంతర్గతంగా విచారణ చేపట్టి వాస్తవాలను తెలుసుకున్నారు. ఈ వ్యవహారంలో ఎవరెవరి హస్తం ఉందన్న అంశంపై ఒక క్లారిటీతో ఉన్నట్లు తాజా సమాచారాన్ని బట్టి తెలుస్తోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement