Friday, May 17, 2024

Exclsive – బిసి సిఎం ….’ప‌ద్మ‌వ్యూహంతో’ రేస్ లో క‌మ‌ల‌ద‌ళం

భాజపాలో మ‌ళ్లీ జోష్‌ నెలకొంది. శ్రేణుల్లో ఒక్కసారిగా మ‌ళ్లీ ఉత్సాహం పెల్లుబకడానికి పనిచేసిన మంత్రం బీసీ కార్డ్‌! తెలంగాణలో తాము అధికారంలోకి వస్తే బలహీనవర్గాలకు చెందిన వ్యక్తిని ముఖ్యమంత్రిని చేస్తామని కేంద్ర హోమ్‌ మంత్రి, భాజపా అగ్రనేత అమిత్‌షా ప్రకటించారు. దీంతో తెలంగాణలో పరిస్థితి మరోసారి ఒక్కసారిగా మారినట్టయింది. ఇప్పటివరకూ వెనుకబడి ఉన్న భాజపా మ‌ళ్లీ పోటీలోకి దూసుకువచ్చింది. భారాస, కాంగ్రెస్‌లతో ఢీ అంటే ఢీ అనే స్థాయికి చేరుకుంది! ఇంత మార్పునకు కారణం బీసీ సీఎం నినాదం!

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ: రాష్ట్రంలో అధికార భారాస, విపక్ష కాంగ్రెస్‌ల మధ్య పథకాలు, మేనిఫెస్టోలు, హామీలపై సవాళ్లు, ప్రతిసవాళ్లు సాగుతుండగా, భాజపా సరికొత్త నినాదం ఎత్తుకోవడం రాజకీయ పరిశీలకులను సైతం ఆశ్చర్యపరిచింది. బీసీ సీఎం నినాదం వెనుక చాలా కసరత్తే జరిగిందంటున్నారు. ప్రస్తుతం జరుగుతున్న ఆయా రాష్ట్రాల ఎన్నికల్లోనే కాకుండా, ఇంతకుముందు కూడా ముందుగానే సీఎం అభ్యర్దిని భాజపా ప్రకటించడం అరుదు. అయితే, తెలంగాణలో నెలకొని ఉన్న ప్రత్యేక పరిస్థితులు, పరిణామాల నేపథ్యంలో మోదీ-షాల ద్వయం ఎవరూ ఊహించనివిధంగా బీసీ సీఎం అస్త్రాన్ని ప్రయోగించడంతో రాజకీయం ఒక్కసారిగా మారిందని పరిశీలకులు అంచనా వేస్తున్నారు.


తెలంగాణలో అత్యధిక స్థానాల్లో బలహీనవర్గాలు మెజారిటీ ఓట్లు కలిగి ఉన్నారు. ఓట్లు మావి? సీట్లు మీవా! అన్న నినాదంతో బలహీనవర్గాలు ఆయా పార్టీలను దామాషా ప్రకారం సీట్లివ్వాల్సిందేనన్న డిమాండ్లు మొదలయ్యాయి. ఈ నేపథ్యంలో ఒకరిని మించి మరొక పార్టీ తాము బీసీలకు ఎక్కువ సీట్లిస్తామంటూ ఊరిస్తున్నాయి. సీట్లు దక్కని నియోకవర్గాల్లో భారీగా నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. ఆ ప్రభావం ఇతర స్థానాల్లో కూడా పడుతోంది. నెమ్మదిగా ఇది రాష్ట్రవ్యాప్తంగా పాకింది.
అలకలు, నిరసనలు, బెదిరింపుల పర్వాలు రోజు రోజుకూ పెరుగుతున్న ఈ నేపథ్యంలో రాష్ట్ర పర్యటనకు వచ్చిన అమిత్‌షా తెలంగాణలో తాము అధికారంలోకి వస్తే కచ్చితంగా బీసీని ముఖ్యమంత్రిని చేసి తీరతామని ప్రకటించారు. ప్రధాన పార్టీలైన భారాస, కాంగ్రెస్‌లకు ఆయన సవాల్‌ కూడా విసిరారు. ఇప్పటికే కాంగ్రెస్‌లో బీసీలకు తగు ప్రాధాన్యత లభించలేదని, తమ సీట్లను కూడా ఆర్థికంగా బలమైన అగ్ర కులాలకే కేటాయిస్తున్నారని గగ్గోలు పెడుతున్నారు. చాలా చోట్ల అలక వహించిన బీసీ నేతలు పార్టీని కూడా వీడుతున్నారు. ద్వితీయ శ్రేణి నేతలైతే సరేసరి!
ఇప్పటికే అధికార పార్టీకి ప్రత్యామ్నాయంగా బలపడి ఆ తర్వాత నీరసపడిన భాజపా సరైన సమయంలో సరైన ఆయుధాన్ని అంది పుచ్చుకుందని పరిశీలకులు వ్యాఖ్యానిస్తున్నారు. అధికార పార్టీలో బీసీ ముఖ్యమంత్రి అయ్యే ఛాన్సే లేదని, కాంగ్రెస్‌లో బీసీ ముఖ్యమంత్రిని చేస్తామని చెప్పే ధైర్యం ఆ పార్టీ అగ్ర నేతలకు కూడా లేదని అంటున్నారు. మెజారిటీ జనాభాను అమిత్‌షా ప్రకటన అమితంగా ఆకర్షించిందని, దీంతో ఇప్పటి వరకూ శ్రేణుల్లో నెలకొని ఉన్న నిస్త్రాణతను వదిలించినట్టయిందని చెబుతున్నారు.
ఆయా రాజకీయ పార్టీల్లోని ద్వితీయ శ్రేణి నేతలైతే భాజపాలో గుర్తింపు లభిస్తుందన్న ఆశతో ఆ పార్టీలో చేరేందుకు మొగ్గు చూపుతున్నారు. ఇప్పటివరకూ ఉన్న నేతలకు ప్రత్యామ్నాయంగా ఎదగవచ్చన్న ఆశ వారిలో భాజపా వైపు మళ్లించేందుకు దోహదపడుతోందన్నది పరిశీలకుల అంచనా! ఇక బలహీన వర్గాలకు చెందిన సామాన్య ప్రజల్లో అయితే, అమిత్‌షా ప్రకటన ప్రకంపనలనే సృష్టించింది. ముఖ్యంగా తమ నేత ఏకంగా ముఖ్యమంత్రి పదవిని అధిష్టించితే భవిష్యత్తులో ఎంతో కొంత తమకు మరింత మేలు జరుగుతుందన్న ఆలోచన వారిలో మొలకెత్తింది!
ప్రతి ఎన్నికల్లోనూ యాంత్రికంగా ఓట్లేయడం తప్ప తమకు, తమ సామాజిక వర్గానికి చెందిన నేతల్లో ఒకరిని ముఖ్యమంత్రిని చేసే అవకాశం భాజపా ఇస్తుండడంతో వారిని విపరీతంగా ఆకర్షిస్తోంది. బీసీల్లో ప్రధానంగా ఉన్న అయిదు సామాజికవర్గాలలో మెజారిటీ ఓట్లను ఈసారి తాము కొల్లగొట్టడం ఖాయమన్న ధీమాతో భాజపా నాయకుల్లో కనిపిస్తోంది. దీనికితోడు అధికార పార్టీ నుంచి సాగుతున్న వలసల్లో అత్యధిక శాతం బీసీ వర్గాలు కావడం గమనించదగిన అంశమని రాజకీయ పండితులు చెబుతున్నారు.
త్వరలో ప్రకటించనున్న మేనిఫెస్టోలో కూడా బీసీ వర్గాలకు ఆకర్షణీయ పథకాలు ఉంటాయని చెబుతున్నారు. సంక్షేమాభివృద్ధి పథకాలతో తమ మేనిఫెస్టో సమపాళ్లలో ఉంటుందని భాజపా నేతలు చెబుతున్నారు. రాష్ట్రంలో కూడా అధికారం ఇస్తే డబుల్‌ ఇంజిన్‌ సర్కార్‌తో అభివృద్ధి పథంలో దూసుకుపోవడం ఖాయమని అంటున్నారు. ఇన్నేళ్లకు, ఇన్నాళ్లకు బీసీలకు ఏకంగా ముఖ్యమంత్రి పదవిని ఇస్తామని ప్రకటించిన భాజపా పట్ల బలహీనవర్గాలు సమీకృతమవుతున్నాయని అంచనా వేస్తున్నారు!

Advertisement

తాజా వార్తలు

Advertisement