Sunday, April 28, 2024

TS: ప్రతి ఒక్కరూ ఓటుహక్కును సద్వినియోగం చేసుకోవాలి… కలెక్టర్ గోపి

ప్రజాస్వామ్య పరిరక్షణకోసం ప్రతి ఒక్కరూ తమ కర్తవ్యాన్ని గుర్తించి తమ ఓటు హక్కును సద్వినియోగం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ డా. బి.గోపి అన్నారు. బుధవారం ఓటరు అవగాహనలో భాగంగా “వి విల్ ఓట్ ఫర్ షూర్ ” నినాదంతో అంబేడ్కర్ స్టేడియంలో నిర్వహించిన సైకిల్ ర్యాలీ-2023 లో సిపి, ఎసిఎల్బి ఇతర జిల్లా అధికారులు, వాలంటీర్లు, విద్యార్థులతో కలిసి జిల్లా కలెక్టర్ డా.బి.గోపి పాల్గొన్నారు. కరీంనగర్ ఆర్డిఓ, టౌన్ ఎసిపి తదితరులు జెండా ఊపి ర్యాలీని ప్రారంభించగా.. స్టేడియం నుండి కలెక్టరేట్, కమాన్ చౌరస్తా, హౌజింగ్ బోర్డు కాలని, కేబుల్ బ్రిడ్జి మీదుగా తిరిగి అంబేడ్కర్ స్టేడియం వద్దకు చేరుకుని ర్యాలీని ముగించారు.

ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ… ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేయాలంటే పౌరులు తమ బాధ్యత గురించి తెలుసుకొని ఓటు హక్కును వినియోగించుకోవాలన్నారు. ఓటు పౌరుడి అస్తిత్వానికి ప్రతీక అన్నారు. ప్రపంచ స్థితిగతులను మార్చే శక్తి ఓటుకు ఉందని, ఒక వ్యవస్థకు ప్రజా ప్రతినిధి ఎంత అవసరమో, ఆ ప్రజా ప్రతినిధిని ఎన్నుకునేందుకు ఓటు అంతే అవసరమని అన్నారు. రాష్ట్రం అభివృద్ధి చెందాలి, సమాజం పురోగతి సాధించాలి, మనం బాగుపడాలనే తాపత్రయం ఉండడమే కాదు ఓటు హక్కును సద్వినియోగం చేసుకోవడం ముఖ్యమేనని తెలిపారు. అంతకుముందు స్వచ్చహి సేవా పోస్టర్ ను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో సీపీ సుబ్బారాయుడు, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ ప్రఫుల్ దేశాయ్, స్వీప్ నోడల్ అధికారి బి. రవీందర్, కరీంనగర్ ఆర్డిఓ కె.మహేష్, జిల్లా మార్కెటింగ్ అధికారి పద్మావతి, క్రీడల అభివృద్ది అధికారి రాజవీర్, ఎస్బియం కిషన్ స్వామి, తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement