Sunday, May 5, 2024

దళిత బంధు, బీసీ బంధు పథకాలతో ప్రజలను మోసం చేయొద్దు – చాడ వెంకటరెడ్డి

హుస్నాబాద్, జూలై 23 (ప్రభన్యూస్): – రాష్ట్రంలో దళిత బంధు, బీసీ బంధు పేరుతో ప్రజలను మోసం చేయొద్దని సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యులు మాజీ ఎమ్మెల్యే చాడ వెంకటరెడ్డి తెలిపారు. సంక్షేమ పథకాల పేరుతో ప్రజాధనాన్ని వృధా చేయొద్దని రాష్ట్ర ప్రభుత్వానికి సూచించారు. ఆదివారం సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ పట్టణంలోని స్థానిక అనభేరి, సింగిరెడ్డి అమరుల భవనంలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ. రాష్ట్రంలో కొత్త రేషన్ కార్డులు, ఆసరా పెన్షన్లు, ధరణి పోర్టల్ లో ఉన్న లోపాలను సవరించాలని లేనిపక్షంలో కలెక్టరేట్ల ముట్టడి చేస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు.

స్వతంత్ర భారతావనిలో రోజురోజుకు మతోన్మాదం పెట్టి పోతుండడంతో మహిళలకు రక్షణ కరువైందని అన్నారు. నరేంద్రమోడీ ప్రభుత్వం ప్రజాస్వామ్యాన్ని పక్కనపెట్టి రాజకీయ పార్టీలను చీల్చి అధికార దుర్వినియోవానికి పాల్పడుతుందని ఆరోపించారు. మోడీ ప్రభుత్వం చేస్తున్న అరాచకాలపై ప్రశ్నిస్తున్న ప్రతిపక్షాలపై ఐటీ, ఈడీ దాడులు చేయించడం అప్రజాస్వామికమన్నారు.

కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను వ్యతిరేకిస్తూ దేశవ్యాప్తంగా పలు పార్టీలు ఏకమై కూటమిగా ఏర్పడ్డాయని తెలిపారు. బీజేపీ సర్కార్ కు వ్యతిరేకంగా ఏర్పడిన కూటమిని తట్టుకోలేక, ప్రత్యామ్నాయంగా మోడీ సర్కార్ మరోకూటమిని ఏర్పాటు చేస్తుందని చెప్పారు. రాబోయే అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికల్లో భారత కమ్యూనిస్టు పార్టీ(సీపీఐ) బరిలో నిలుస్తుందని వెల్లడించారు.

నరేంద్ర మోడీ మౌనం వీడి మణిపూర్ లోని మహిళలపై అత్యాచారం చేసిన నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. దేశవ్యాప్తంగా మహిళలపై నిత్యం ఏదోచోట దాడులు జరుగుతున్న వాటిని నియంత్రించ లేకపోవడం సిగ్గుచేటన్నారు. దేశవ్యాప్తంగా కులమతాలకు అతీతంగా రాజకీయ పార్టీలు పనిచేసినప్పుడే ప్రజాస్వామ్యం విరాజిల్లుతుందని చెప్పారు.

- Advertisement -

ఈ కార్యక్రమంలో సీపీఐ జిల్లా కార్యదర్శి మంద పవన్, రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు గడిపె మల్లేష్, జిల్లా కార్యవర్గ సభ్యులు ఎడల వనేష్, జాగిరి సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement