Saturday, April 27, 2024

పార్కింగ్ విష‌యంలో వివాదం.. క‌త్తుల‌తో దాడి

పార్కింగ్ విష‌యంలో చెల‌రేగిన వివాదం చివ‌రికి క‌త్తుల‌తో దాడి చేసుకునేంద వ‌ర‌కు వ‌చ్చింది.సంబంధం లేని వ్యక్తులు ఈ గొడవలోకి ఎంటర్ కావడంతో మరింత ముదిరింది. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని లాఠీఛార్జ్ చేసి రెండు వర్గాలను చెదరగొట్టారు. దీంతో స్థానికులు ఊపిరిపీల్చుకున్నారు. ఈ సంఘ‌ట‌న హైదరాబాద్‌లోని పాతబస్తీలో చోటు చేసుకుంది.
నిత్యం రద్దీగా ఉండే బార్కస్‌ ప్రాంతంలోని ఓ జిమ్‌కు ఫహద్‌, ఖాలీద్‌ అనే ఇద్దరు వ్యక్తులు వచ్చారు. జిమ్‌ పక్కనే ఉన్న ఓ షాపు ఎదుట తమ వాహనాన్ని పార్కింగ్ చేశారు. అయితే షాపు యజమాని వాహనం ఇక్కడ పార్కింగ్ చేయవద్దంటూ చెప్పాడు. దీంతో వారి మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది.

ఇదంతా చూస్తున్న ఓ రౌడీషీటర్‌ సులేమాన్‌ వారిద్దరి వివాదంలోకి తలదూర్చాడు. గొడవను ఆపాలని తన వంతు ప్రయత్నం చేశాడు. దీంతో చెలరేగిన ఫహద్‌ తన సోదరుడు అయిన చంద్రాయణగుట్ట రౌడీషీటర్‌ అలీకి ఫోన్‌ చేసి రమ్మని చెప్పాడు. రావడంతోనే కత్తులతో విన్యాసాలు చేసుకుంటూ అక్కడికి వచ్చిన అలీ యజమాని.. సులేమాన్‌తో వాగ్వాదానికి దిగాడు. సులేమాన్‌పై అలీ కత్తులతో విచక్షణారహితంగా దాడికి పాల్పడ్డాడు. ఈ ఘటనతో బార్కస్‌లో భారీగా ట్రాఫిక్‌ జామ్‌ అయింది. సమాచారం తెలుసుకున్న చంద్రాయణగుట్ట ఇన్‌స్పెక్టర్‌ నాగేంద్రప్రసాద్‌ వర్మ.. ఘటనా స్థలానికి చేరుకున్నాడు. లాఠీఛార్జ్‌ చేసి ఇరు వర్గాలను చెదరగొట్టి పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు. దీంతో స్థానికంగా ప్రశాంత వాతావరణం నెలకొంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement