Thursday, April 25, 2024

శిథిలావస్థలో పశు వైద్యశాల భవనం

కొత్తగూడ, (ప్రభ న్యూస్) : కొత్తగూడ మండల కేంద్రంలోని పశువైద్యశాలను ఎప్పుడో నిర్మించిన.. పురాతనకాలం నాటి కాలంచెల్లిన భవనంలో పశు వైద్యాధికారితో పాటు పశువుల యజమానులు అనేక అవస్థలు పడుతున్నారు. సరిపడా సిబ్బంది సైతం లేకపోవడంతో పనిభారం ఎక్కువవుతోంది. శిథిలావస్థకు చేరిన భవనం ఏ క్షణాన కూలిపోతుందో తెలియక వైద్యాధికారి బిక్కుబిక్కుమంటూ విధులు నిర్వహిస్తున్నారు. అయినా పాలకులు, అధికారుల్లో మాత్రం చలనం కనిపించడం లేదు. గత నెల 27న సంచార పశువైద్యశాలను ఏర్పాటు చేశారు. అరకొర గదులతో మందులను నిలువచేయాలన్నా, సంచార వైద్యశాల సిబ్బంది ఉండాలన్నా ఇబ్బందికరంగా ఉంటోంది. చిన్నపాటి వర్షానికే పైకప్పు ఊడుతుండ‌డం, గదుల్లోకి వర్షపునీరు అధికంగా రావడంతో వర్షాకాలంలో నానా తంటాలు పడుతున్నారు. కొత్తగూడ మండల కేంద్రంలో గల ప్రాథమిక పశువైద్యశాల శిథిలావస్థలోకి చేరింది. పశువైద్యశాల భవనం నిర్మించిన నాటి నుంచి నేటి వరకు భవనం ఆధునీకరణకు, అభివృద్ధికి నోచుకోలేదు. ఎప్పుడు కూలుతుందో తెలియని పరిస్థితిలో బిక్కు బిక్కుమంటూ వైద్యులు ఇక్కడ విధులు నిర్వహిస్తున్నారు.

ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి : శ్రీకాంత్, పశు వైద్యాధికారి
ప్రతి రోజు ఇక్కడ 30 నుంచి 40 వరకు జంతువులకు వైద్య సేవలందిస్తున్నాం. నాటి నుంచి నేటి వరకు భవనం ఎలాంటి ఆధునీకరణకు నోచుకోలేదు. ఒక ప్రక్క స్లాబ్ నుండి పెచ్చులు ఊడిపడుతున్నాయి. ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియని భయంతో ఉన్నాము. శిథిలమైపోయిన పశువైద్యశాల పాత భవనాన్ని కూల్చివేసి అదే స్థలంలో అత్యాధునిక సదుపాయాలతో నూతనంగా నిర్మించే విధంగా చర్యలు తీసుకోవాలని పశు వైద్యాధికారి శ్రీకాంత్ కోరుతున్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement