Thursday, May 2, 2024

Big Story: ధరణి స్పీడప్​.. సమస్యల పరిష్కారంలో రంగారెడ్డి టాప్‌!

భూ సమస్యలు పరిష్కరించుకోవాలంటే నెలల తరబడి రెవెన్యూ కార్యాలయాల చుట్టూరా తిరిగాల్సిన పరిస్థితి.. అయినా సమస్యలకు పరిష్కారం దొరుకుతుందో లేదో అన్న పరిస్థితులుండేవి. కానీ, తెలంగాణ ప్రభుత్వం ధరణి పోర్టల్‌కు శ్రీకారం చుట్టిన తర్వాత అట్లాంటి సిచ్యుయేషన్​ కంప్లీట్​గా మారిపోయింది. టైమ్​ సేవ్​ కావడంతోపాటు డబ్బులు కూడా ఆదా అవుతున్నాయంటున్నారు పలువురు వినియోగదారులు. అంతేకాకుండా కింది స్థాయి అధికారిని మొదలుకుని జిల్లా స్థాయి అధికారి వరకు అందరూ సమన్వయంతో పని చేస్తుండటంతో ధరణీలో వచ్చిన దరఖాస్తులు చకచక పరిష్కారమవుతున్నాయి.

ఉమ్మడిరంగారెడ్డి, ప్రభ న్యూస్‌ బ్యూరో : రంగారెడ్డి జిల్లా కలెక్టర్‌ అమోయ్‌కుమార్‌ ప్రత్యేక చొరవతో ధరణీలో వచ్చిన దరఖాస్తులు యమ స్పీడ్​గా పరిష్కారానికి నోచుకుంటున్నాయి. ఇట్లా తెలంగాణ రాష్ట్రంలోనే క్లీయరెన్స్‌లో రంగారెడ్డి జిల్లా ముందు వరుసలో నిలుస్తోంది. పెండింగ్‌ దరఖాస్తులు కేవలం 3.73 శాతమే ఉన్నాయి. సామాన్య, మధ్యతరగతి వర్గాలకు అన్ని రకాల కలిసి వస్తోంది. అందుకే అందరూ ధరణి పోర్టల్‌కు దండాలు పెడుతున్నారు. ధరణీ పోర్టల్‌లో వచ్చిన దరఖాస్తులు చకచక పరిష్కారానికి నోచుకుంటున్నారు. రంగారెడ్డి జిల్లాలో ఇప్పటి వరకు 1,25,185 దరఖాస్తులు ఆన్‌లైన్‌ ద్వారా వచ్చాయి. ఇందులో 1,20,518దరఖాస్తులను క్లీయరెన్స్‌ చేశారు. 74,205దరఖాస్తులను అనుమతులు ఇచ్చేశారు. వివిధ కారణాలతో 46,313 దరఖాస్తులను తిరస్కరించారు.

క్లీయరెన్స్‌ ఇచ్చిన దరఖాస్తుల్లో కేవలం 4667 దరఖాస్తులు మాత్రమే పెండింగ్‌లో ఉన్నాయి. జిల్లాలో ధరణీ పోర్టల్‌లో 96.27శాతం క్లీయరెన్స్‌ చేసి రాష్ట్రంలో మొదటి స్థానంలో నిలిచారు. కేవలం ప్రజావాణి కార్యక్రమంలోనే కాకుండా నేరుగా ప్రజలు వచ్చి వినతులు ఇస్తున్నారు. ఆన్‌లైన్‌లో వచ్చిన దరఖాస్తులను పెండింగ్‌లో పెట్టకుండా చకచక క్లీయర్‌ చేస్తున్నారు. గతంలో ఉన్న రెవెన్యూ సమస్యల పరిష్కారం…ధరణీ పోర్టల్‌ వచ్చిన తరువాత రెవెన్యూ సమస్యల పరిష్కారం ఎలా ఉందనేది పరిశీలిస్తే ఎంతో మార్పు కనిపిస్తోంది. గతంలో మ్యూటేషన్‌ కావాలంటేనే నెలలతరబడి రెవెన్యూ కార్యాలయాల చుట్టూరా తిరగాల్సిన పరిస్థితులు ఉండేవి. ఇప్పుడు ఆ పరిస్థితులు లేవు. వెంటనే రిజిస్ట్రేషన్‌ చేయడంతోపాటు భూ పట్టాకు సంబంధించిన పత్రాలు, పాస్‌బుక్‌కు సంబంధించిన పత్రాలతోపాటు పట్టాదారునికి ఎంతమేర భూమి ఉందనే విషయమై మొత్తం వివరాలు అందిస్తారు. గతంలో రిజిస్ట్రేషన్‌ సమయంలో డాక్యుమెంట్‌ రైటర్ల హవా కొనసాగేది. రిజిస్ట్రేషన్‌కు వాళ్లు ఎంత డిమాండ్‌ చేస్తే అంతమేర డబ్బులు చెల్లించాల్సిన పరిస్థితులు ఉండేవి. నేడు ధరణీ పోర్టల్‌ వచ్చిన తరువాత పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. పైసా కర్చు లేకుండా తహసీల్దార్‌ కార్యాలయంలో చకచక రిజిస్ట్రేషన్లు జరిగిపోతున్నాయి. ఇచ్చిన సమయానికి వెళ్లి రిజిస్ట్రేషన్‌ చేయించుకుని వెంటనే పత్రాలు తీసుకుని ఇంటికి వెళ్లిపోయే పరిస్థితులు నెలకొన్నాయి….

కలెక్టర్‌ అమోయ్‌కుమార్‌ ప్రత్యేక చొరవ..
ధరణీ పోర్టల్‌లో ఆన్‌లైన్‌ల దరఖాస్తుల పరిష్కారంలో రంగారెడ్డి జిల్లా మొదటి వరుసలో నిలిచింది. ఇందులో జిల్లా కలెక్టర్‌ అమోయ్‌కుమార్‌ ప్రత్యేక చొరవ తీసుకుంటున్నారు. హైదరాబాద్‌ మహానగరం చుట్టూరా రంగారెడ్డి జిల్లా విస్తరించి ఉండటంతో ఇక్కడ వీవీఐపీల తాకిడి ఎక్కువే. ప్రోటోకాల్‌ను పక్కాగా పాటించడంతోపాటు ఎప్పటికప్పుడు ధరణీ పోర్టల్‌లో వచ్చిన దరఖాస్తులను పరిష్కరిస్తున్నారు. జిల్లాలో పర్యటనలు ఎక్కువగా ఉంటాయి. సమయాన్ని వృద్ధా చేయకుండా ధరణీ పోర్టల్‌లో వచ్చిన దరఖాస్తులు పరిష్కరిస్తున్నారు. ప్రభుత్వ పథకాల అమలును ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ ముందుకు సాగుతున్నారు. ధరణీ పోర్టల్‌లో వచ్చిన దరఖాస్తులను ఎప్పటికప్పుడు పరిష్కరిస్తూ ఉన్నతాధికారులతో శభాష్‌ అనిపించుకుంటున్నారు. రంగారెడ్డి జిల్లాలో భూ వివాదాలు ఎక్కువే. పెరుగుతున్న ధరలకు తోడు భూ వివాదాలు పెరిగిపోతున్నాయి. చిన్నపాటి ఏమరపాటుతో ఉన్నా తగిన మూల్యం చెల్లించాల్సి ఉంటుంది. అలాంటి పరిస్థితులకు తావివ్వకుండా ప్రతి చిన్న విషయాన్ని లోతుగా పరిశీలించి పరిష్కరిస్తున్నారు జిల్లా కలెక్టర్‌ అమోయ్‌కుమార్‌.

Advertisement

తాజా వార్తలు

Advertisement