Friday, May 3, 2024

ప్రజల దృష్టి మరల్చేందుకే దశాబ్ది ఉత్సవాలు : ధర్మార్జున్

సూర్యాపేట, ప్రభ న్యూస్ : ఆరు దశాబ్దాల తెలంగాణ ఉద్యమ ఆకాంక్షలను దశాబ్దంలోపే నీరుగార్చిన కేసీఆర్ ప్రజల దృష్టి మరల్చేందుకే దశాబ్ది ఉత్సవాలు అని తెలంగాణ జన సమితి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, సూర్యాపేట నియోజకవర్గ అభ్యర్థి ధర్మార్జున్ విమర్శించారు. జూన్ 4న సూర్యాపేటలో నిర్వహించే తెలంగాణ జన సమితి రాష్ట్ర ప్లీనరీ ఏర్పాట్లలో భాగంగా ఆదివారం నిర్వహించిన సూర్యాపేట నియోజకవర్గ సమన్వయ కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడారు. క్యాబినెట్ నిండా తెలంగాణ వ్యతిరేకులను పెట్టుకొని ప్రభుత్వ సలహాదారులుగా తెలంగాణ ఉద్యమ వ్యతిరేకులను పెట్టుకొని సీమాంధ్ర పెట్టుబడిదారి శక్తులతో లాలూచీ పడి తెలంగాణ వనరులన్నీ వారికి ధారపోస్తున్నరని ఆరోపించారు. వందలాది మంది యువకులు ఆత్మబలిదానాలు చేసుకుంది పండుగలకు పబ్బాలకు ఇచ్చే చీరసారల కోసం సేమ్యాల కోసం కాదని ఎద్దేవా చేశారు. తెలంగాణ సమగ్ర అభివృద్ధి, నీళ్లు, నిధులు, నియామకాలు కోసం సిద్ధించిన తెలంగాణ దొరల చేతిలో బందీ అయిందన్నారు.

నిధులను దుబారా చేస్తూ తెలంగాణను అప్పులపాలు చేశారని రైతు బంధు బూచి చూయించి వ్యవసాయ రంగాన్ని నిర్వీర్యం చేస్తున్నారని ఆరోపించారు. వ్యవసాయ ఉపకరణాలకు ఇవ్వాల్సిన సబ్సిడీ, పండించిన పంటకు గిట్టుబాటు ధర కల్పించడం లేదని విమర్శించారు. రాష్ట్రం ఏర్పడితే నియామకాలు లభిస్తాయని ఉపాధ్యాయులు మెరుగుపడతాయని యువకులు బలిదానాలు చేశారో ఆ తరం యువకుల ఉద్యోగ ఆశలపై నీళ్లు జల్లులతో నోటిఫికేషన్లు వేయకుండా వేసిన ఏదో కొద్దిపాటి నోటిఫికేషన్లలో కూడా ప్రశ్నాపత్రాలు అమ్ముకునే నీచమైన స్థితికి దిగజారార ని విమర్శించారు. స్థానిక ఎమ్మెల్యే, రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి జగదీష్ రెడ్డి విద్యుత్ పై అనర్గళంగా అబద్ధాలు ప్రచారం చేస్తున్నార‌ని, మొత్తం తెలంగాణ విద్యుత్ పై తొమ్మిదేళ్లుగా జరిగిన కొనుగోలు, ఉత్పత్తి, అవినీతిపై శ్వేత పత్రం విడుదల చేస్తారా అని ప్రశ్నించారు. ఈ సమావేశంలో రాష్ట్ర కమిటీ సభ్యులు గట్ల రమా శంకర్, జిల్లా అధ్యక్షులు మాండ్ర మల్లయ్య, యువజన సమితి రాష్ట్ర ఉపాధ్యక్షుడు నారాబోయిన కిరణ్, నాయకులు కుంచం చంద్రకాంత్ వీరేష్ నాయక్, బచ్చలకూరి గోపి, రఫీ,కొల్లు కృష్ణారెడ్డి,జాటోత్ శ్రీను నాయక్,సుమన్ నాయక్, అంగోత్ సూర్యనారాయణ, బంధన్ నాయక్,రాజు, యాకూబ్ రెడ్డి, మోహన్ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement