Friday, May 10, 2024

బిసి మంత్రుల‌పై కోవ‌ర్ట్ ఆప‌రేష‌న్ – రేవంత్ పై మంత్రి శ్రీనివాస్ గౌడ్ గ‌రం గ‌రం

హైద‌రాబాద్ – తెలంగాణ వ్యాప్తంగా సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ మహరాజ్ వేడకలు ఘనంగా జరిగాయి. సీఎం కేసీఆర్, ఇతర ముఖ్యనేతలు ఆయనకు ఘనంగా నివాళులర్పించారు. వీరత్వంలో శివాజీకి ఏ మాత్రం తీసిపోని సర్వాయి పాపన్న జయంతి సందర్భంగా ఆయనను గుర్తు చేసుకున్నారు. మరోవైపు హైదరాబాద్ రవీంద్రభారతిలో సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ మహరాజ్ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. బీసీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో అధికారికంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర BC సంక్షేమ శాఖ ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం, రాష్ట్ర గీత కార్పొరేషన్ చైర్మన్ పల్లే రవి కుమార్ గౌడ్, పుల్లెంల రవీందర్ కుమార్ గౌడ్, పల్లె లక్ష్మణరావు గౌడ్, వట్టికూటి రామారావు గౌడ్ అయిలీ వెంకన్న గౌడ్, ఎలికట్టే విజయ్ కుమార్ గౌడ్, మాజీ మంత్రి రాజేశం గౌడ్ , నారాయణ గౌడ్ మరియు తదితరులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా మంత్రి శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ.. గతంలో సర్వాయి పాపన్న వేడుకలు రవీంద్రభారతిలో నిర్వహించాలి అంటే అడ్డుకున్నారని ఆరోపించారు. ఇప్పుడు ప్రభుత్వమే అధికారికంగా నిర్వహిస్తుందని మంత్రి తెలిపారు. మరోవైపు బీసీలు ఎదుగుతుంటే అణిచి వేసే కుట్రలు ఇంకా అక్కడక్కడ జరుగుతున్నాయని పేర్కొన్నారు. ఉన్న ముగ్గురు బీసీ మంత్రులపై కోవర్టు ఆపరేషన్ చేస్తున్నారని మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు.

టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి బీసీలకు వ్యతిరేకంగా కుట్రలు పన్నుతున్నాడని శ్రీనివాస్ గౌడ్ తెలిపారు. తమ వృత్తుల పట్ల అవహేళన చేసిన వారిని వదిలిపెట్టబోమని హెచ్చరించారు. అంతేకాకుండా.. తమ జాతులను కించ పరిచే విధంగా మాట్లాడితే రాజకీయంగా అణగతొక్కుతామని శ్రీనివాస్ గౌడ్ తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement