Saturday, May 4, 2024

TS : పిండాలు పెట్టి ప్రజలను హింసించిన చరిత్ర కాంగ్రెస్, టీడీపీలదే.. మంత్రి జగదీష్ రెడ్డి

పిండాలు పెట్టి ప్రజలను హింసించిన చరిత్ర కాంగ్రెస్, టీడీపీలదేనని మంత్రి జగదీష్‌ రెడ్డి అన్నారు. బుధవారం బీఆర్ఎస్ ఎల్పీ కార్యాలయంలో మంత్రి మీడియాతో మాట్లాడుతూ… కేసీఆర్‌కు పిండం, తద్దినం పెట్టడం గురించి పీసీసీ చీఫ్‌ రేవంత్‌రెడ్డి మాట్లాడుతున్నాడు. కేసీఆర్‌కు ఎందుకు పిండం పెడతావ్.. పేదల బతుకుల్లో వెలుగులు నింపుతున్నందుకా.. ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టినందుకు కేసీఆర్ కు పిండం పెడతావా.. తన ప్రాణాలు అడ్డం పెట్టి తెలంగాణకు ప్రాణం పోసినందుకు కేసీఆర్ కు పిండం పెట్టాలనుకుంటున్నావా అని సూటిగా ప్రశ్నించారు. రేవంత్ పిండం పెట్టాలనుకుంటున్నది కేసీఆర్‌కు కాదు.. తెలంగాణకు అని మండిపడ్డారు. రేవంత్ ఇంకా తెలంగాణ ద్రోహుల చేతుల్లో ఉన్నారు. పీసీసీ అధ్యక్షుడిగా ఉండి ఇలాంటి చిల్లర మాటలు మాట్లాడటం సిగ్గు చేటన్నారు.

దివంగత మాజీ ప్రధాని, తెలంగాణ బిడ్డ పీవీకి సరైన అంత్యక్రియలు నిర్వహించని సంస్కారం లేని పార్టీకి రేవంత్ అధ్యక్షుడని ఘాటుగా విమర్శించారు. రేవంత్ మాట్లాడే భాషను కనీసం వాళ్ల ఇంట్లో నైనా ఒప్పుకుంటారా ? రూ.50 లక్షల లంచం డబ్బుతో దొరికి టీడీపీకి తద్దినం పెట్టినవ్. కరెంటుతో పిచ్చి వ్యాఖ్యలు చేసి కాంగ్రెస్ కు తద్దినం పెట్టినవని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేసీఆర్ గనుక రాజకీయ కక్ష ప్రదర్శిస్తే రేవంత్ వాడుతున్న భాషకు రోడ్ల మీద తిరుగలేవన్నారు. రేపటి రోజుల్లో ప్రజల చేతిలో రేవంత్ కు భంగపాటు తప్పదని హెచ్చరించారు. తమది కల్యాణ లక్ష్మి, కేసీఆర్ కిట్, రైతుబంధు భాష, మీది పిండాల భాష. ప్రజలను చంపడం సంపాదించుకోవడమే మీకు అలవాటని మండిపడ్డారు.

- Advertisement -

సీఎం కేసీఆర్‌కు, తెలంగాణ సమాజానికి రేవంత్ క్షమాపణ చెబితే మంచిదన్నారు. క్షమాపణ చెప్పకపోతే ఏం చేయాలో తెలంగాణ సమాజానికి తెలుసన్నారు. జగన్‌కే కాదు చంద్రబాబుకు కూడా ప్రగతి భవన్‌లో ఆతిథ్యం ఇచ్చామన్నారు. గద్దర్ మాతో కలిసి పని చేశారన్నారు. తెలంగాణ వచ్చాక తమకు ఎవరితో శత్రుత్వం లేదన్నారు. గద్దర్ గురించి అజ్ఞాని రేవంత్‌కు ఏం తెలుసని మాట్లాడుతున్నాడు. గద్దర్ జీవితం ఎవరికి వ్యతిరేకంగా మొదలైంది తెలుసా ? గద్దర్ చరిత్ర తీద్దామా.. గద్దర్‌కు ఫలానా వారే నివాళుర్పించాలని ఎక్కడైనా ఉందా అని ప్రశ్నించారు. గద్దర్ తమతో కలిసి పని చేశారన్నారు. గద్దర్‌ను అడ్డుపెట్టుకుని శవ రాజకీయం చేస్తున్నది తాము కాదని గుర్తు చేశారు. గద్దర్ గురించి మాట్లాడే అర్హత తమకే
ఉందన్నారు. గద్దర్ ఆశయాలను చాలా నెరవేర్చాం. పూర్తిగా సాకారం చేస్తామని స్పష్టం చేశారు. గద్దర్ గురించి రేవంత్ రెడ్డి మాట్లాడితే ఆయన ఆత్మ క్షోభిస్తుందన్నారు. రేవంత్ ఏ పార్టీ లో ఉన్నా ఆ పార్టీ ఖతమేనని మంత్రి జగదీష్ రెడ్డి అన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement