Friday, April 26, 2024

వామ్మో ‘చీప్’ కొర‌త‌..

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ: రాష్ట్రంలో చౌక మద్యా నికి(చీప్‌ లిక్కర్‌ )కు భారీ డిమాండ్‌ పెరుగుతోంది. ఫలితంగా చౌక మద్యానికి తీవ్ర కొరత ఏర్పడుతోంది. ఉత్పత్తికి మించి డిమాండ్‌ పెరగడంతో ఆబ్కారీ శాఖకు చీప్‌ బెంగ పట్టుకుంటోంది. గుడుంబాను కట్టడి చేయడం, కల్తీ కల్లును అరికట్టడం వంటి చర్యలతో పేదలు తాగే చీప్‌ లిక్కర్‌కు అనూహ్యంగా వినియోగం పెరిగింది. ప్రధానంగా అల్పాదాయ, పేదవర్గాలు నివసించే గ్రామీన, మండల ప్రాంతాల్లో చౌక మద్యానికి విపరీతంగా డిమాండ్‌ ఏర్పడింది. ఎన్నడూ లేని రీతిలో చీప్‌ లిక్కర్‌ విక్రయాలు జరుగుతుండటంతో మద్యం వ్యాపారుల నుంచి డిపోలకు తాకిడి పెరిగింది. దీంతో ప్రభుత్వ మద్యం డిపోలు వారు అడిగినంత స్టాకును ఇవ్వలేకపోతు న్నాయి. కొన్ని ప్రాంతాల్లో తీవ్ర కొరతతో చౌక మద్యంపై రేషనింగ్‌ విధించినట్లు తెలిసింది.

పెరిగిన వాటా…
రాష్ట్రంలోని మొత్తం మద్యం విక్రయాల్లో 40శాతం వాటా ఉన్న చీప్‌ లిక్కర్‌ క్రమంగా తన వాటాను పెంచుకుంటోంది. తాజాగా గుడుంబా, కల్తీ మద్యంపై ఉక్కు పాదం మోపుతుండటం కూడా చీప్‌ వినియోగం పెరగడానికి దోహదపడిందని ఆబ్కారీ అధికారులు అంటున్నారు. ఇప్పుడున్న నెలకు 4 లక్షల పెట్టెల డిమాండ్‌ అనూహ్యంగా 5నుంచి 6 లక్షల పెట్టెలకు పెరిగింది. కొన్ని జిల్లాల్లో చీప్‌ లిక్కర్‌కు కొరత ఏర్పడిందని తెలుస్తోంది. టీఎస్‌బీసీఎల్‌ డిపోలలో కూడా చీప్‌కు కొరత ఏర్పడిందని సమాచారం. కాగా రాష్ట్రంలో ఉన్న 17 డిస్టిలరీలలో రెండు డిస్టిలరీలు పనిచేయడంలేదు. మిగతా 15లో ఐదు డిస్టిలరీలు మాత్రమే చీప్‌ను ఉత్పత్తి చేస్తున్నాయి. మొత్తం 15 డిస్టిలరీలలో 17.55 లక్షల ప్రూఫ్‌ లీటర్ల అన్ని రకాల మద్యం ఉత్పత్తి అవుతోంది. మిగతా పెద్ద డిస్టిలరీలు చీప్‌ను తయారు చేసేందుకు సుముఖంగా లేవు. అవన్నీ ప్రీమియం, మీడియం మద్యాన్ని మాత్రమే ఉత్పత్తి చేస్త్తున్నాయి. ఈ నేపథ్యంలో తాజాగా ఉత్పత్తి చేస్తున్న ఐదు డిస్టిలరీలను అదనపు ఉత్పత్తులు చేయాలని ఆబ్కారీ శాఖ కోరింది. ఇందుకు వెంటనే అదనపు ఉత్పత్తులకు అనుమతులను జారీ చేసింది. కాగా మరోవైపు ఇటీవలే మల్కాజ్‌గిరీలోని ఒక డిస్టిలరీ తన చీప్‌ ఉత్పత్తులను నిలిపివేసింది. మరో రెండు కంపెనీలు కూడా చీప్‌ ఉత్పత్తిని తగ్గించి వేయడంతో నవంబర్‌లో తీవ్ర కొతర నెలకొంది. డిసెంబర్‌లో అది మరింత ప్రభావం చూపింది.

కొత్త డిస్టిలరీలకు అనుమతులు….?
తాజాగా మద్యం డిమాండ్‌ పెరగడంతో కొత్త డిస్టిలరీలకు ప్రభుత్వం ద్వారాలు తెరిచింది. 2006 నుంచి పెండింగ్‌లో ఉన్న నూతన డిస్టిలరీల ఏర్పాటు కు అడ్డంకులను తొలగించిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా నూతన డిస్టిలరీల ఏర్పాటుతో కొరతను అధిగమించవచ్చని ప్రభుత్వం భావించింది. గతేడాది అనుకున్నదే తడవుగా నూతన డిస్టిలరీలకు దరఖాస్తులను ఆహ్వానిస్తూ నోటిఫికేషన్‌ను జారీ చేసింది. మరోవైపు తాజాగా చీప్‌ లిక్కర్‌కు ఏర్పడిన కొరతపై ఆబ్కారీ శాఖ అధికారులు ఉన్నపళంగా ప్రభు త్వానికి ప్రతిపాదనలు పంపారు. దీంతో కొరతను అధిగమించేందుకు ప్రభుత్వం రంగంలోకి దిగింది.
ఇదివరకే ఇలాంటి పరిస్థితిని ఊహించామని, అందుకే ముందస్తుగా నూతన నోటిఫిికేషన్‌ జారీ చేశామని, అదనపు ఉత్పత్తులకు వచ్చిన దరఖాస్తులను సత్వరమే పరిష్కరించి అనుమతులు జారీ చేయాలని సూచించింది. ఈ నేపథ్యంలో చీప్‌ను ఉత్పత్తి చేస్తున్న 7 డిస్టిలరీలకు అదనపు ఉత్పత్తులతోపాటు కొత్తగా రెండు డిస్టిలరీలకు లైసెన్సులను జారీ చేసేందుకు అధికారులు చేసిన ప్రయత్నాలు ఫలించాయి. తాజాగా మెదక్‌ జిల్లా సంగారెడ్డిలో ఎంఎస్‌ డిస్టిలరీ ఏర్పాటుకు ఇటీవలే అధికారులు అనుమతులు జారీ చేసి లైసెన్సును జారీ చేశారు. ఇక అదనపు ఉత్పత్తులు చేసేందుకు ఆర్‌కె డిస్టిలరీస్‌, రైజోమ్‌ డిస్టిలరీస్‌లకు వెంటనే అనుమతులు మంజూరీ చేయడం విశేషం. ఇక సంగారెడ్డిలోనే మరో ప్రతిపాదిత అల్లయిడ్‌ బ్లెండర్స్‌ అండ్‌ డిస్టిలరీస్‌కు త్వరలోనే లైసెన్సును జారీ చేసేలా అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఏబీడీ సంస్థకు ఇప్పటికే దేశంలో అతిపెద్ద యూనిట్లు ఉన్నాయి. మీడియం బ్రాండ్‌లలో ఇది రాష్ట్రాన్ని శాషిస్తోంది. ఎప్పటి నుంచో రాష్ట్రంలో యూనిట్‌ను ప్రారంభించా లని ఈ కంపెనీ ప్రయత్నాలు చేస్తోంది. అయితే తాజాగా నూతన డిస్టిలరీలకు ప్రభుత్వం ఆమోద ముద్ర వేయడంతో వీరికి కలిసివచ్చింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement