Tuesday, April 30, 2024

తెలంగాణకు రూ.38,114 కోట్ల ‘ముద్ర’ రుణాలు

ప్రధాన మంత్రి ముద్ర యోజన (పీఎంఎంవై) పథకం కింద తెలంగాణ రాష్ట్రానికి ఇప్పటి వరకు రూ.38,114 కోట్ల రుణాలు మంజూరు చేశామని కేంద్రం వెల్లడించింది. ఆ మొత్తం 47,26,819 ఖాతాల్లోకి బదిలీ అయ్యాయని కేంద్ర ఆర్దిక శాఖ సహాయ మంత్రి డాక్టర్ భగవత్ కరాడ్ తెలిపారు. పీఎంఎంవైలో భాగంగా శిశు, కిషోర్ మరియు తరుణ్ పథకాల కింద తెలంగాణ రాష్ట్రానికి ఇప్పటి వరకు ఎన్ని ముద్ర’ నిధులు మంజూరయ్యాయి? కేటగిరీల వారీగా పథకం ద్వారా లబ్ధి పొందిన లబ్ధిదారుల వివరాలు, ఈ విషయంలో వచ్చిన ఫిర్యాదులు, ప్రభుత్వం తీసుకున్న చర్యలపై కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ సోమవారం పార్లమెంట్ లో అడిగిన ప్రశ్నకు కేంద్ర ఆర్దిక శాఖ సహాయ మంత్రి డాక్టర్ భగవత్ కరాడ్ లిఖిత పూర్వక సమాధానమిచ్చారు.

2015 ఏప్రిల్ లో ప్రధానమంత్రి ముద్ర యోజన పథకం ప్రారంభమైందని, నాటి నుండి నేటి వరకు దేశవ్యాప్తంగా రూ. 15.52 లక్షల కోట్ల రుణాలు మంజూరయ్యాయన్నారు. ఇక తెలంగాణ విషయానికొస్తే… ప్రధాన మంత్రి ముద్ర యోజన పథకం ప్రారంభమైనప్పటి నుండి నేటి వరకు గత ఆరేళ్లలో మొత్తం 47,26,819 మంది ఖాతాలకు రూ.38,114 కోట్ల రుణాలు మంజూరు చేసినట్లు కేంద్ర మంత్రి తెలిపారు. వీటిలో 37,46,740 మంది రూ.50 వేలలోపు (శిశు పథకం) రుణాలు తీసుకున్నట్లు పేర్కొన్నారు. అలాగే రూ.5 లక్షల లోపు (కిషోర్ పథకం) రుణాలు తీసుకున్న వారు 7,94,193 మంది, రూ.10 లక్షలలోపు (తరుణ్ పథకం) రుణాలు తీసుకున్న వారి సంఖ్య 1,85886 మంది ఉన్నట్లు వివరించారు.

వ్యవసాయ, వాణిజ్య, ఉత్పత్తి, సేవల రంగాల్లో తెలంగాణను అగ్రగామిగా నిలబెట్టేందుకు  నరేంద్ర మోదీ ప్రభుత్వం ప్రధానమంత్రి ముద్ర యోజన పథకం కింద వేలాది కోట్ల రుణాలను మంజూరు చేసి లక్షలాది మందికి లబ్ది చేకూరుస్తోందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ అన్నారు. అయినప్పటికీ తెలంగాణ ప్రభుత్వం కేంద్రం నుండి ఎలాంటి సాయం అందడం లేదంటూ పచ్చి అబద్దాలు వల్లిస్తూ ప్రజలను తప్పుదోవ పట్టిస్తుండటం సిగ్గు చేటని విమర్శించారు. తెలంగాణ అభివృద్ధి కోసం కేంద్ర ప్రభుత్వం చిత్తశుద్దితో పని చేస్తోందనడానికి గత ఏడేళ్లుగా రాష్ట్రానికి వివిధ రంగాల్లో కేటాయించిన నిధులు, మంజూరు చేసిన రుణాలే నిదర్శనమని బండి తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement