Friday, April 26, 2024

Delhi: అఫిడవిట్లో క్రిమినల్ కేసులు చూపలే, అనర్హుడిగా ప్రకటించాలి.. ఎంపీ పార్థసారథి రెడ్డిపై ఈసీకి ఫిర్యాదు

న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ: తెలంగాణ రాష్ట్ర సమితి తరఫున కొత్తగా రాజ్యసభ సభ్యులుగా ఎన్నికైన పారిశ్రామికవేత్త బండి పార్థసారథి రెడ్డిని అనర్హుడిగా ప్రకటించాలంటూ కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు అందింది. తెలంగాణలోని యాదాద్రి భువనగిరి జిల్లా భూదాన్ పోచంపల్లి మండలంలోని అంతమ్మగూడెం గ్రామస్థులు ఈ మేరకు ఫిర్యాదు చేశారు. ఆయనపై నమోదైన క్రిమినల్ కేసుల వివరాలను దాచిపెట్టి తప్పుడు అఫిడవిట్ దాఖలు చేశారని, ఈ కారణంగా ఆయన్ను తక్షణమే అనర్హుడిగా ప్రకటించడంతో పాటు తగిన చర్యలు తీసుకోవాలని కోరారు.

హెటిరో గ్రూప్ అధినేతైన పార్థసారథి రెడ్డి, తన సంస్థకు చెందిన హెజెలో ల్యాబ్ విషయంలో భవనాలను విస్తరించే క్రమంలో HMDAకు సమర్పించాల్సిన అనుమతి పత్రాన్ని గ్రామ సెక్రటరీతో కుమ్మక్కై ఫోర్జరీ చేసి రూపొందించారని గ్రామపంచాయితీ ఎగ్జిక్యూటివ్ కమిటీ సభ్యులు పేర్కొన్నారు. పెద్దల సభలో సభ్యులుగా ప్రజా సమస్యలపై చర్చించి పరిష్కారం చూపాల్సిన బాధ్యత ఉంటుందని, కానీ ఆయనే తన ఫార్మా కంపెనీ ద్వారా కాలుష్యం అనే సమస్యను ప్రజలకు కలిగిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తమ గ్రామంలో ఈ కంపెనీకి చెందిన ల్యాబ్‌లు, ఔషధ తయారీ యూనిట్లు అన్నీ కలిపి 100 ఎకరాలు దాటాయి కాబట్టి వాటిని కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి పరిధిలోకి తీసుకోవాలని గ్రామస్థులు కోరారు.

కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసిన అనంతరం ఢిల్లీలోని తెలంగాణ భవన్‌లో మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా గ్రామానికి చెందిన నరేందర్ రెడ్డి మాట్లాడుతూ.. ఎన్నికల అఫిడివట్లో అన్నీ అబద్ధాలు చెప్పారని బండి పార్థసారథి రెడ్డిపై మండిపడ్డారు. బ్లాక్ మనీ కేసును కూడా అఫిడవిట్లో ప్రస్తావించలేదని అన్నారు. ఈ విషయాన్ని టీఆర్ఎస్ నాయకత్వం దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. యాదాద్రి జిల్లాలోని అంతమ్మగూడెంలో పార్థసారథి రెడ్డి ఫార్మా కంపెనీ కారణంగా చుట్టుపక్కల 15 గ్రామాల ప్రజలు ఇబ్బంది పడుతున్నారని, ఆ కంపెనీని మూసేయాలని డిమాండ్ చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement