Tuesday, April 30, 2024

Budget Speech – లెక్కల పద్దు కాదు…భవిష్యత్తుకు నమూన … గవర్నర్ తమిళిసై

( ఆంధ్రప్రభ స్మార్ట్, హైదరాబాద్ ప్రతినిధి ) రాష్ట్ర ప్రజలు ప్రజాస్వామ్యం కోసం పోరాటం చేశారని, నియంతృత్వ పోకడలను జనం తుదముట్టించారని, స్వేచ్ఛ స్వాతంత్ర్యాన్ని , సమానత్వాన్ని, సామాజిక న్యాయాన్ని కోరుకున్నారని, ఇందుకు అనుగుణంగా తెలంగాణ ప్రభుత్వం ముందుకు సాగుతోందని తెలంగాణ గవర్నర్ తమిళసై సౌందరరాజన్ అన్నారు. గురువారం తెలంగాణ ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగించారు. ప్రజాకవి కాళోజీ మూడు కోట్ల తెలంగాణ ప్రజల కోసం రచించిన కవితతో గవర్నర్ తన ప్రసంగాన్ని ప్రారంభించారు. కొత్తగా కొలువుదీరిన కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను వివరించారు. ప్రజా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రజాభవన్ వద్ద గత సర్కార్ ఏర్పాటు చేసిన కంచెను తొలగించిందని తెలిపారు. దీంతో ప్రజాభవన్‌లో ఫిర్యాదులు ఇచ్చేందుకు ప్రజలకు అనుమతి లభించిందన్నారు. ప్రగతిభవన్‌.. ప్రజాభవన్‌గా అందుబాటులోకి వచ్చిందన్నారు. ప్రజావాణి ద్వారా ప్రభుత్వం ప్రజా సమస్యలను తెలుసుకుంటోందన్నారు. ప్రజాపాలనలో గ్రామ సభలు నిర్వహిస్తున్నామని చెప్పారు.

ప్రజల కోసమే ఈ ప్రభుత్వం
తెలంగాణాలో ప్రజల కోసం ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వం పని చేస్తోందని, నియతృత్వ పోకడల అధ్యయనం ముగిసిందని, ఈ ప్రభుత్వం ప్రజల కోసమే పని చేస్తోందని గవర్నర్ తమిళిసై స్పష్టం చేశారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన ఆరు గ్యారంటీలను సకాలంలో అమలు చేస్తామని గవర్నర్ హామీ ఇచ్చారు. ఇప్పటికే మహాలక్ష్మి పథకంలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పించిన విషయాన్ని గుర్తుచేశారు. ఇప్పటికి 15 కోట్ల ట్రిప్పుల్లో మహిళలు ఉచితంగా ప్రయాణం చేశారు. త్వరలో మరో 2 గ్యారంటీలు అమలు చేస్తామని తెలిపారు. అర్హులైనవారికి రూ.500లకే గ్యాస్‌ సిలిండర్‌ అందిస్తామని చెప్పారు. రైతులు, మహిళలు, యువతకు ఇచ్చిన హామీల అమలు చేసేందుకు కట్టుబడి ఉన్నామని గవర్నర్ స్పష్టంచేశారు.

అప్పుల కుప్పగా మార్చారు
గత ప్రభుత్వం రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చి అప్పగించిందని తమిళిసై అన్నారు. ధనిక రాష్ట్రంలో ఆర్థిక వ్యవస్థను చిన్నాభిన్నం చేశారని ఆరోపించారు. రాష్ట్రాన్ని పునర్ నిర్మించే ప్రయత్నం చేస్తున్నామని పేర్కొన్నారు. దశాబ్దకాలంలో నష్టపోయిన సంస్థలను తిరిగి బాగు చేసేందుకు ప్రయత్నిస్తున్నాయని తెలిపారు. గత సమావేశాల్లో రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై శ్వేతపత్రం విడుదల చేశామన్నారు. ప్రజలపై భారం వేయకుండా ఆర్థిక వ్యవస్థను సరిదిద్దుతామని హామీ ఇచ్చారు. వాస్తవ పరిస్థితులకు అనుగుణంగా కొత్త పారిశ్రామిక విధానం తీసుకొస్తామని ప్రకటించారు. విద్యలో ఉద్యోగం సాధించేలా యువత నైపుణ్యాలను పెంచుతామని, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మహిళ, వికలాంగ పారిశ్రామిక వేత్తలను ప్రోత్సహిస్తామని, చిన్న పరిశ్రమల అభివృద్ధి కోసం కొత్త ఎంఎస్‌ఎంఈ పాలసీ తీసుకొస్తామన్నారు. వెయ్యి ఎకరాల్లో 10-12 ఫార్మా విలేజీల క్లస్టర్ల ఏర్పాటును ప్రతిపాధిస్తామని, సమగ్ర డిజిటల్ అక్షరాస్యత కార్యక్రమాన్ని ప్రభుత్వం చేపడుతుందని గవర్నర్ తమిళసై వివరించారు. 50 నుంచి 100 ఎకరాల్లో ఏఐ సిటీని ఏర్పాటు చేస్తామని, రూ.2వేల కోట్లతో ప్రభుత్వ ఐటీఐలను ఆధునిక టెక్నాలజీ కేంద్రాలుగా మారుస్తామని, క్రీడారంగంలో అగ్రగామిగా రాష్ట్రాన్ని మార్చుతామని, త్వరలోనే రాష్టంలో కులగణన చేపడుతామని, ఈ బడ్జెట్ కేవలం ఆర్థిక పత్రం కాదు, భవిష్యత్తుకు నమూనా అని గవర్నర్ విశదీకరించారు.

మౌలిక సదుపాయాల అభివృద్ధే ధ్యేయం
మౌళిక వసతులను అభివృద్ధి చేస్తామని తెలిపారు. ఇంటర్నెట్‌ కనీస అవసరంగా గుర్తించి అందించే ప్రయత్నం చేస్తున్నామన్నారు. ప్రతీ ఇంటికి ఇంటర్నెట్‌ అందిస్తాని తెలిపారు. టీఎస్పీఎస్ సీ , ఎస్ హెచ్ ఆర్ సీ లాంటి సంస్థలు బాధ్యతాయుతంగా పనిచేసే స్వేచ్ఛను కల్పిస్తామని గవర్నర్ తెలిపారు. టీఎస్‌పీఎస్సీని ప్రక్షాళన చేస్తున్నామన్నారు. టూరిజం అభివృద్ధికి ప్రత్యేక పాలసీ తీసుకువస్తామని గవర్నర్ తెలిపారు. మూసీ నది ప్రక్షాళనలకు ప్రణాళిక రూపొందించామన్నారు. మూసీని అభివృద్ధి చేసి ఉపాధి కల్పిస్తామని చెప్పారు. దేశానికి హైదరాబాద్‌ను ఏఐ రాజధానిగా మార్చే ప్రయత్నం చేస్తున్నామన్నారు. కొత్తగా రూ.40 వేల కోట్ల పెట్టుబడులకు ఒప్పందాలు కుదిరాయని తెలిపారు. ప్రజాపాలనలో కోటి 80 లక్షల దరఖాస్తులు వచ్చాయని వెల్లడించారు. ఎకో ఫ్రెండ్లీ టూరిజం హబ్‌గా హుస్సేన్‌సాగర్‌, లక్నవరాన్ని అభివృద్ధి చేస్తామని హామ ఇచ్చారు. త్వరలో గ్రీన్‌ ఎనర్జీని తీసుకువస్తామని తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement