Monday, April 29, 2024

BRS Party – ప్ర‌చారంలో అధినేత చిరుత వేగం…. అభ్య‌ర్ధులు మాత్రం తాబేలు న‌డ‌క …

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ: గులాబీ బాస్‌ కాలికి బలపం కట్టుకుని మరీ తిరుగుతున్నారు. రోజుకు రెండు మూడు ప్రజాశీర్వాద సభల్లో పాల్గొంటున్నారు. రాష్ట్రవ్యాప్తంగా జరుగు తున్న ప్రచారాన్ని సమీక్షిస్తున్నారు. ఎప్పటిక ప్పుడు అభ్యర్ధులకు తగు సూచనలు చేస్తున్నారు. ప్రత్యర్ధుల ప్రచార ఎత్తుగడలను గమనిస్తు న్నారు. పైఎత్తులకు ప్రణాళికలను రూపొందిస్తు న్నారు. ఎక్కడ ఏమాత్రం లోపం కనిపించినా వెంటనే ఆయా అభ్యర్ధులకు, ఇన్‌ఛార్జ్‌లను హెచ్చరిస్తున్నారు. ఒకపక్క అధినేత ఇంత కష్టపడుతుంటే మరోపక్క అభ్యర్ధుల ధోరణి మరోలా ఉంది! అలక్ష్యంగా, అతిశయంతో కొం దరు అభ్యర్ధులు వ్యవహరిస్తున్నారు. దీంతో ఆయా నియోజకవర్గాల్లో పరిస్థితి కొంత వెనుకబడి ఉందని శ్రేణులు ఆందోళన చెందుతున్నాయి.


అనారోగ్యాన్ని సైతం లెక్కచేయకుండా అధినేత రోజుకు 18 గంటలు పనిచేస్తుంటే అభ్య ర్ధులు మాత్రం కింది స్థాయి కేడర్‌కు బాధ్యతలు అప్పగించి ఎటుపోయి ఎటొచ్చినా తాము గెల వడం ఖాయమన్న నమ్మకంతో ప్రచార సరళిపై దృష్టి పెట్టడం లేదని కార్యకర్తలు వాపోతున్నారు. తమను పట్టించుకోవడం లేదంటూ ఇప్పటికే ద్వితీయస్థాయి నేతలు వలసబాట పట్టారని, అయినప్పటికీ అభ్యర్ధుల్లో చలనం లేదని వారు పేర్కొంటున్నారు. అధినేత ఎన్నిసార్లు హెచ్చ రించినా కొందరు అభ్యర్ధుల్లో మార్పు కనిపిం చడం లేదని, తాము పాతిక వేలతో గెలుస్తాం… మెజారిటీ 30 వేలు దాటుతుందని గొప్పలు పోతున్నారని, కనీసం తమను కలవడానికి కూడా ఇష్టపడడం లేదని కార్యకర్తలు చెబుతున్నారు.

ఎంతో నమ్మకంతో, భరోసాతో ఆయా అభ్యర్ధులకు మరోసారి అధినేత అవకాశం కల్పిస్తే, అలక్ష్యం, అతిశయంతో నియోజకవర్గాల్లో అభ్యర్ధులు వ్యవహరిస్తున్నారని, వీరివల్ల మొత్తం పార్టీకే దెబ్బతగిలే ప్రమాదం ఉందని కార్యకర్తల తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అధినేత అండ తమకు ఉందన్న ధీమాతో వీరు వ్యవహరిస్తున్నారని, జనబాహుళ్యంలో ఇదే సరళితో కొనసాగితే చేజేతులా వ్యతిరేకతను తెచ్చిపెట్టుకోవడమే అవుతుందని వారంటు న్నారు. తీరిక లేని పనిలో ఉన్నట్టు బిల్డప్‌ ఇస్తూ ప్రచారంలో కూడా నేరుగా పాల్గొనడం లేదంటున్నారు.

అహంకారానికి పోవద్దని, కేడర్‌ని దూరం చేసుకుంటే పుట్టగతులు ఉండవని భారాసఎల్పీ సమావేశంలో కేసీఆర్‌ గట్టిగా హెచ్చరించిన సంగతిని ఈ సందర్భంగా శ్రేణులు గుర్తు చేస్తు న్నాయి. కొందరు ద్వితీయ శ్రేణి నాయకులతో ప్రచారాన్ని కొనసాగిస్తున్నారని, స్వయంగా పాల్గొనాలని కోరితే అది వ్యూహమని నమ్మ బలుకుతున్నారని వాపోతున్నారు. ఓకపక్క ప్రత్యర్ధులు వేగంగా దూసుకువస్తుంటే కొందరు అభ్యర్ధులు ఇంకా నామ్‌కేవాస్తేగా ప్రచారాన్ని చేస్తుండడం కుందేలు, తాబేలు పరుగు పందెంను గుర్తుకు తెస్తోందని పరిశీలకులు వ్యాఖ్యానిస్తున్నారు.

మరోవైపు ట్రబుల్‌ షూటర్లు కేటీఆర్‌, హరీష్‌లు కూడా ప్రచారంలో పూర్తిగా మునిగి పోయి శ్రేణుల్లో ఉత్సాహం కలిగిస్తున్నా… కొందరు అభ్యర్ధులు ఇంకా మొద్దు నిద్రపో తున్నారని, కారు గుర్తే తమను గెలుపుతీరాలకు చేరుస్తుందని చెప్పుకుంటున్నారని విమర్శిస్తు న్నారు. కింది స్థాయి కార్యకర్తల్లో నెలకొని ఉన్న అసంతృప్తిని ఆయా అభ్యర్ధులు ఎంత త్వరగా మేల్కొని చల్లారిస్తే అంత మంచిదని, లేనిపక్షంలో అంతిమ ఫలితంపై ప్రభావం పడుతుందని కార్యకర్తలే హెచ్చరిస్తున్నారు. కార్యకర్తల ప్రాధాన్యాన్ని గుర్తించి ప్రచారంలో పాల్గొంటే తప్ప కొందరు అభ్యర్ధుల పరిస్థితి గడ్డుగానే ఉందని చెప్పకతప్పదని పరిశీలకులు వ్యాఖ్యానిస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement