Sunday, May 5, 2024

Bonalu – ఘ‌నంగా ల‌ష్క‌ర్ బోనాలు ప్రారంభం.. తొలి బంగారు బోనం స‌మ‌ర్పించి మంత్రి త‌ల‌సాని

సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి బోనాలు ప్రారంభమయ్యాయి. తొలి పూజల అనంతరం తెల్లవారుజామున 3.30 గంటలకు రాష్ట్ర పశుసంవర్ధకశాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ కుటుంబ సభ్యులతో కలిసి అమ్మవారికి ప్రభుత్వం తరపున పట్టువస్త్రాలు, బోనం సమర్పించి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం మంత్రి తలసాని మీడియాతో మాట్లాడుతూ.. బోనాలను ఘనంగా నిర్వహించుకోవాలి అనే ఉద్దేశంతోనే ఆలయాలకు ప్రభుత్వం ఆర్ధిక సహాయం అందిస్తున్నదని చెప్పారు.
ప్రైవేట్ దేవాలయాలకు కూడా ఆర్థికంగా సహాయం అందిస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అన్నారు. బోనాల సందర్భంగా వచ్చే లక్షలాది మంది భక్తులు ఎలాంటి అసౌకర్యానికి గురికాకుండా అన్ని ఏర్పాట్లు చేశామన్నారు. మహంకాళి బోనాల జాతర విశ్వవాప్తమైందని మంత్రి చెప్పారు. అమెరికా, లండన్‌, దుబైలో కూడా మహంకాళి బోనాలను నిర్వహిస్తున్నారని తెలిపారు. అమ్మవారి దర్శనానికి దేశ విదేశాల నుంచి కూడా భక్తులు వస్తున్నారని వెల్లడించారు. కులాలు, మతాలు, రాజకీయాలకు అతీతంగా ఈ ఉత్సవాలను జరుపుకొంటామన్నారు. అన్ని శాఖల అధికారులు కలిసి బోనాల ఉత్సవాలు ఘనంగా జరిగేలా కృషిచేస్తున్నారని, వారందరికి అభినందనలు తెలిపారు.

మరోవైపు, అమ్మవారికి బోనాలు సమర్పించేందుకు భక్తులు ఉదయం నుంచే క్యూకట్టారు. దీంతో ఆలయం వద్ద కోలాహలం నెలకొంది. అమ్మవారికి బోనం సమర్పించి మొక్కులు సమర్పించుకుంటున్నారు. అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తుల కోసం ఆరు క్యూలు ఏర్పాటు చేశారు. బోనాల నేపథ్యంలో ఆర్టీసీ బస్సు ప్రత్యేకంగా 150 సిటీ బస్సులను నడుపుతోంది. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. మరోవైపు, బోనాల నేపథ్యంలో సికింద్రాబాద్ వైపు నుంచి వెళ్లే ట్రాఫిక్‌ను నేడు, రేపు ప్రత్నామ్నాయ మార్గాల గుండా మళ్లిస్తున్నారు.

ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అమ్మవారికి బోనం సమర్పిస్తారు. ఇక మాజీ కేంద్ర మంత్రి, గవర్నర్ బండారుదత్తాత్రేయ, రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్‌ రెడ్డి, మంత్రి మల్లారెడ్డి, టీఎస్‌ పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌ రెడ్డి తో పాటుగా పలురాజకీయ పార్టీలనాయకులు అమ్మవారిని దర్శించుకోనున్నారు. అలాగే మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత నారాచంద్రబాబు నాయుడు అమ్మవారిని దర్శించుకోనున్నట్లు తెలుస్తుంది. బోనాల వేడుకల్లోప్రధాన ఘట్టం రంగం సోమవారం జరగనుంది.

పోతరాజుల ఆటలు, శివసత్తుల పూనాకాలు, ఘాటాల,ఊరేగింపులతో సింకింద్రాబాద్‌ బోనం ఎత్తనుంది. అవివాహితైన జోగిన భవిష్యవాణి చెప్పడం ఈ రంగం ప్రాధాన్యత. అలాగే గజరాజుపై అమ్మవారి ఊరేగింపు. అనంతరం హైదరాబాద్‌ పాతబస్తీ బోనాలు ఈనెల 16,17న జరగనున్నాయి. గోల్కొండ రాజుల కాలం నాటి లాల్‌ దర్వాజా సింహవాహినీ, ఉప్పుగూడ, మీరాలం మండి, సుల్తాన్‌ షాహీలోని జగదాంబిక ఆలయం, శాలిబండ, గౌలిపురా, బంగారుమైసమ్మ, చందూలాల్‌ బేలా ముత్యాలమ్మ ఆలయాలతో పాటుగా వందలాది అమ్మవారి ఆలయాల్లో బోనాలు సమర్పించనున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement