Monday, May 6, 2024

TS: రైతుబంధు ఆపిన కాంగ్రెస్ ను బొంద పెట్టండి.. మంత్రి కేటీఆర్

రైతు బంధును ఆపిన కాంగ్రెస్ పార్టీని బొంద పెట్టాలని రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపునిచ్చారు. సోమవారం పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ లో నిర్వహించిన రోడ్ షోలో మాట్లాడుతూ… ప్రపంచంలోనే ఎక్కడా లేని విధంగా ముఖ్యమంత్రి కేసీఆర్ రైతులకు ముందస్తు పెట్టుబడి అందించేందుకు రైతుబంధు పథకం ప్రారంభించారన్నారు. ఇప్పటికే 11 సార్లు రైతుబంధు ఇచ్చారని, కేంద్ర ఎన్నికల సంఘం సైతం రైతుబంధు నిరంతర ప్రక్రియ కాబట్టి రైతుల ఖాతాల్లో రైతుబంధు నిధులు వేసుకోవచ్చని ఆదేశాలు ఇచ్చారన్నారు. ఓటమి భయంతో పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఫిర్యాదుతో బీజేపీ ఢిల్లీలో కుట్ర చేసి కేంద్ర ఎన్నికల సంఘం నుండి తిరిగి రైతుబంధును వేయకుండా ఆదేశాలు ఇప్పించారన్నారు.

అటువంటి కాంగ్రెస్, బీజేపీలకు ఈనెల 30న జరిగే ఎన్నికల్లో తగిన గుణపాఠం చెప్పాలన్నారు. కారు గుర్తుకు ఓటు వేసి దాసరి మనోహర్ రెడ్డిని గెలిపిస్తే డిసెంబర్ 3 తర్వాత ప్రతి మహిళకు మూడు వేల రూపాయలు అందుతాయన్నారు. 400 రూపాయలకే సిలిండర్ అందిస్తామని, తెల్ల రేషన్ కార్డు గల ప్రతి ఒక్కరికీ సన్న బియ్యంతో పాటు ఐదు లక్షల రూపాయల బీమా అందిస్తామన్నారు. సన్యాసులకు ఓటు వేస్తే అభివృద్ధి జరగదని, నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తున్న మనోహర్ రెడ్డికి మరోసారి పట్టం కట్టాలని పిలుపునిచ్చారు. రోడ్ షోలో ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి, ఎంపీ వెంకటేష్ నేత తో పాటు బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలతో పాటు వేలాది సంఖ్యలో ప్రజలు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement