Thursday, May 16, 2024

కాసేపట్లో యదాద్రి జిల్లాలోకి భట్టి విక్రమార్క పీపుల్స్ మార్చ్…ఘనంగా స్వాగత ఏర్పాట్లు

ప్రభన్యూస్, ప్రతినిధి/యాదాద్రి – నాలుగున్నర కోట్ల ప్రజల కన్నీరు తుడిచి బతుకుపై భరోసా కల్పిస్తూ.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను ప్రజలకు వివరిస్తూ రానున్న ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకు రావడమే లక్ష్యంగా సీఎల్పీ నేత భట్టి విక్రమార్క నిర్వహిస్తున్న పీపుల్స్ మార్చ్ కాసేపట్లో యాదాద్రి జిల్లాలో అడుగు పెట్టనుంది.. సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క చేపట్టిన పీపుల్స్ మార్చ్ 44 రోజులు పూర్తి చేసుకొని 45వ రోజున జనగాం జిల్లా పెంబర్తి వద్ద కళాతోరణం వద్ద జిల్లాలోని ఆలేరు నియోజకవర్గం లోనికి ప్రవేశించనుంది. భట్టి యాత్రకు జిల్లా కాంగ్రెస్ నేతలు ఘనంగా స్వాగతం పలికేందుకు అన్ని ఏర్పట్లను చేస్తున్నారు..


కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న ప్రజావ్యతిరేక విధానాలను ప్రజలకు వివరిస్తూ రానున్న ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకరావడమే లక్ష్యంగా పాద యాత్రలు నిర్వహిస్తున్నారు. రాహుల్ గాంధీ కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు చేపట్టిన భారత్ జోడో యాత్ర ముగిసిన సందర్భంగా ఇచ్చినటువంటి సందేశాన్ని ప్రజలకు వివరిస్తూ పలు యాత్రలను నిర్వహిస్తున్నారు. సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క చేపట్టిన పీపుల్స్ మార్చ్ యాత్ర నేడు 44 రోజులు పూర్తి చేసుకొని 45 వ రోజున జనగాం జిల్లా పెంబర్తి వద్ద కళాతోరణం వద్ద యాదాద్రి జిల్లా ఆలేరు నియోజక వర్గంలో ప్రవేశించనుంది. రెండు నియోజకవర్గాల్లో 6 మండలాల్లో పలు గ్రామాల్లో యాత్ర కొనసాగనుంది..

భట్టి యాత్రకు భారీ స్వాగత సన్నాహాలు
భట్టి విక్రమార్క నేతృత్వంలో కొనసాగుతున్న పీపుల్స్ మార్చ్ యాత్రకు ప్రజల్లో మంచి స్పందన కనిపిస్తున్నది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై విమర్శల దాడులు పుట్టిస్తూ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే అమలు చేసేటువంటి మ్యానిఫెస్టోను ప్రజలకు వివ రిస్తూ యాత్రనిర్వహిస్తున్నారు. 45వ రోజున జనగాం జిల్లాను పూర్తి చేసుకొని నేడు మధ్యాహ్నం 3 గంటల సమయంలో యాదాద్రి జిల్లాలోని పెంబర్తి కళాతోరణం వద్ద ఆలేరు నియోజక వర్గంలో ప్రవేశించనుంది. ఈ సంద ర్భంగా జిల్లా కాంగ్రెస్ శ్రేణులు, ముఖ్యనాయకులు యాత్రకు స్వాగతం పలికేందుకు అన్ని ఏర్పాట్లను చేస్తున్నారు. డీసీసీ అధ్యక్షుడు కుంభం అనిల్ కుమార్ రెడ్డి నాయకులు పొత్నక్ ప్రమోద్ కుమార్, కల్లూరి రామచంద్రారెడ్డి, బీర్ల ఐలయ్య, జనగాం ఉపేందర్ రెడ్డి, వంచ వీరారెడ్డి, ముఖ్య నాయకులు తమ అనుచరులతో స్వాగత ఏర్పట్లు చేస్తున్నారు.

యాత్ర కొనసాగింపు ఇలా..
జనగామ నియోజకవర్గం పెంబర్తి గ్రామం నుంచి ఆలేరు నియోజకవర్గం గుండ్ల గూడెం మీదుగా ఆలేరు పట్టణానికి చేరుకుంటుంది. నేటి నుంచి మే 6 వరకు యాదాద్రి జిల్లాలో పాదయాత్ర కొనసాగుతుంది. దాదాపు 526 కిలోమీటర్ల మేర పాదయాత్ర పూర్తి చేసుకోగా పాదయాత్ర మొదలైనప్పటి నుంచి 45వ రోజు నాటికి యాదాద్రి జిల్లాలోకి ప్రవేశిస్తున్నది. ఆలేరులోని అండర్పాస్ రైల్వే బ్రిడ్జిని పరిశీలిస్తారు.
మే 1న రఘునాథపురం మండల కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని అఖిలపక్ష నాయకులు చేస్తున్న పోరాటానికి సంఘీభావం ప్రకటిస్తారు. మే 2న యాదగిరిగుట్ట పట్టణంలోని ఆటో డ్రైవర్లతో సమావేశం అవుతారు.
మే 3న ఉదయం యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవాలయాన్ని సందర్శించి స్వయంభూలను దర్శించుకుంటారు. భువనగిరి మండలం బస్వాపురం రిజర్వాయర్ డ్యాం వద్ద నిర్వాసితులతో మాట్లాడి సమస్యలను తెలుసుకుంటారు.
మే 4న పాదయాత్ర యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్రానికి చేరుకుంటుంది . మే 5న పోచంపల్లి లో చేనేత కార్మికులను కలిసి వారి సమస్యలు తెలుసుకుంటారు. మే 6న భువనగిరి నియోజకవర్గం జలాల్ పురం గ్రామం నుంచి ఇబ్రహీంపట్నం నియోజకవర్గం కొత్తగూడెంలోకి ప్రవేశిస్తుంది.

86 కిలోమీటర్లు యాత్ర
సీఎల్పీ నేత భట్టి విక్రమార్క చేపట్టిన పీపుల్స్ మార్చ్ యాత్ర జిల్లాలో 86 కిలోమీటర్లు వరకు సాగనుంది.
ఆలేరు నియోజకవర్గంలో 48 కిలోమీటర్లు, భువనగిరి నియోజకవర్గం లో 38 కిలోమీటర్ల మేర పాదయాత్ర సాగనుంది.
ఆలేరు, కొలనుపాక, రఘునాథపురం, యాదగిరిగుట్ట, భువనగిరి, పోచంపల్లి గ్రామాల్లో కార్నర్ సమావేశాలు నిర్వహించనున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement