Thursday, June 13, 2024

భద్రాద్రి సీతారామచంద్ర స్వామి కళ్యాణం వైభ‌వంగా నిర్వ‌హించాలి.. మంత్రి పువ్వాడ‌

ఖమ్మం : ఈనెల 30వ తేదిన శ్రీరామ నవమిని పురస్కరించుకుని భద్రాద్రి శ్రీసీతారామచంద్ర స్వామి వారి కళ్యాణం ఈసారి అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు ప్రభుత్వం నిర్ణయించిందని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ స్పష్టం చేశారు. రెండో అయోధ్యగా భాసిల్లుతున్న భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలంలో స్వామివారి కల్యాణ మహోత్సవం వేలాదిగా భక్తజన సందోహనం నడుమ వైభవోపేతంగా ఈనెల 30న జరిగే స్వామివారి కళ్యాణ ఉత్సవంకై భక్తులకు ఏర్పాటు చేయాల్సిన సౌకర్యాల ఏర్పాట్లపై రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ భద్రాచలం సబ్ కలెక్టర్ కార్యాలయలో జిల్లా కలెక్టర్ అనుదీప్ అధ్వర్యంలో ఆలయ అధికారులు, పోలీస్, పంచాయతిరాజ్, విద్యుత్, రవాణా, గ్రామ పంచాయతి, ఆర్టీసి, వైద్య ఆరోగ్య, ఇరిగేషన్, ఫైర్, రెవెన్యూ, ఎండోమెంట్ సంభందిత శాఖల అధికారులు, ఆలయ అర్చకులతో సమీక్ష నిర్వహించారు.
ఈనెల 30న జరగనున్న రాములవారి కల్యాణం, 31న పుష్కర పట్టాభిషేకం నేపథ్యంలో ఇప్పటి వరకు చేపట్టిన చర్యలపై జిల్లా కలెక్టర్ అనుదీప్ ను ఆయా వివరాలు అడిగి తెలుసుకున్నారు.

కళ్యాణ మహోత్సవంకు ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులు, ఇతర ప్రముఖులు వచ్చే అవకాశం ఉన్నందున అన్ని చర్యలు చేపట్టామని జిల్లా కలెక్టర్ అనుదీప్ వివరించారు. ఇప్పటి వరకు 200 క్వింటాల తలంబ్రాలు, ప్రతి ఒక్కరూ కళ్యాణం తిలకించేందుకు 6 భారీ LCD లు, తెప్పోత్సవం వద్ద ప్రమాద హెచ్చరిక బోర్డులు, 200 మంది స్విమ్మర్లు, 135 వివిధ రకాల బోట్స్, ఎక్కడికక్కడ తగు సిబ్బంది, సిబ్బంది వారి విధులకు అనుగుణంగా జాకెట్స్, 75 శాతం వసతి సౌకర్యాలు, పబ్లిక్ టాయిలెట్స్, విద్యుత్ దీపాలు, 4 ఫైర్ ఇంజన్లు, సిగ్నల్ ఇబ్బంది లేకుండా క్షుణ్ణమైన సమాచారం కోసం 30 ప్రత్యేక హ్యాండ్ సెట్స్ (WALKIES) తదితర ఎర్పాటు చేశామన్నారు. భక్తులకు సౌకర్యంగా ఉండేందుకు DPRO అధ్వర్యంలో 25 సమాచార కేంద్రాలు ఎర్పాటు చేస్తామని, అందులో వేదిక పూర్తి Map, కళ్యాణం వివరాలు, సమయంతో కూడిన 25 వేలు కరపత్రాలు ముద్రిస్తున్నామని, ప్రతి కేంద్రంలో వెయ్యి కరపత్రాలు ఉంచుతామని పేర్కొన్నారు. సీతారామ కళ్యాణ మహోత్సవాన్ని తిలకించేందుకు సుదూర ప్రాంతాల నుండి తరలివచ్చే అశేష భక్తులకు సకల సౌకర్యాలు కల్పించాలని మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ పేర్కొన్నారు. ఈ సారి లక్ష మందికి పైగా భక్తులు తరలివచ్చే అవకాశం ఉన్నందున స్వామివారి ప్రసాద లడ్డూలను అధిక సంఖ్యలో పెంచి, విరివిగా కౌంటర్ లను ఏర్పాటు చేసి భక్తులకు అందుబాటులో ఉంచాలన్నారు. సామాన్య భక్తులకు ఇబ్బందులు కలగకుండా తాత్కాలిక వసతి, మరుగుదొడ్లు, ఉచిత వైద్యశిభిరాలను ఏర్పాట్లు చేయాలని సూచించారు. పార్కింగ్ ప్రాంగణాలు దూర ప్రాంతాలలో కాకుండా సాధ్యమైనంత దెగ్గరగా ఉండేలా చూడాలని సూచించారు. భక్తుల కోరిక మేరకు తలంబ్రాలు విరివిగా అందుబాటులొ ఉండేలా ఎక్కువ కేంద్రాలు ఎర్పాటు చేయాలన్నారు. ముఖ్యంగా పరిశుభ్రతను తప్పనిసరిగా పాటించాలని, కళ్యాణంకు వచ్చే భక్తులు వేసవి తాపానికి గురై అనారోగ్యం పాలు కాకుండా బ్లీచింగ్ ను ఎప్పటికప్పుడు వెదజల్లుతూ పరిశుభ్రత పాటిస్తూ, ORS, మజ్జిగ, వాటర్ ప్యాకెట్స్ ను అందుబాటులో ఉంచి ఉచితంగా అందించాలన్నారు.

- Advertisement -

ప్రత్యక్షంగా స్వామి వారి కళ్యాణంను తిలకించేందుకు రాలేని వారికోసం వారధిగా ఉన్న మీడియాకు ప్రత్యేక విభాగంను ఏర్పాటు చేసి ప్రసార సదుపాయాలు కల్పించాలన్నారు. భక్తులు సులువుగా కల్యాణ ప్రాంగణంకు చేరుకునేలా ఎక్కడికక్కడ సూచిక బోర్డులు ఏర్పాటు చేయాలన్నారు. తలంబ్రాల వద్ద తొక్కిసలాట లేకుండా పకడ్బందీ చర్యలు తీసుకోవాలని, కళ్యాణంలో విధులు నిర్వర్తిస్తున్న ప్రతి ఉద్యోగికి వారి విధులు ముగించుకున్నాక ప్రత్యేకంగా తలంబ్రాలు అందజేయాలని ఆలయ ఈఓ ను మంత్రి పువ్వాడ అదేశించారు. అగ్నిమాపక సిబ్బంది, రెస్క్యూ టీమ్స్ అప్రమత్తంగా ఉండాలని, మంటలను ఆర్పే పరికరాలు, Fire Extinguisher లు అందుబాటులో ఉంచుకోవాలన్నారు. ఆలయంలో కల్యాణ మంటపాలకు రంగులు అద్ది మెరుగులు దిద్దాలన్నారు. నిర్దేశించిన పనులన్నీ 28వ తేదీ కల్లా శ్రీరామ నవమి పనులు పూర్తచేయాలని, మిథిలా స్టేడియం స్వామివారి కళ్యాణ మండపం వద్ద భక్తులకు ఇబ్బందులు లేకుండా అవసరమైన సౌకర్యాల ఏర్పాట్లు చేయాలన్నారు. భక్తుల తాకిడి అధికంగా ఉండనున్న నేపథ్యంలో అవసరమైతే CRPF బలగాలను వినియోగించుకోవాలని, వరంగల్, ఖమ్మం జిల్లా పోలీసులను కూడా వినియోగించుకుని పటిష్ట బందోబస్తు ఏర్పాట్లు చేయాలన్నారు. స‌మీక్ష‌లో ప్రభుత్వ విప్ రేగా కాంతారావు , ఎమ్మెల్సీ తాతా మధు, ఎమ్మెల్యే పొడెం వీరయ్య, జెడ్ పి చైర్మన్ కొరం కనకయ్య, జిల్లా ఎస్పీ వినీత్, అదనపు వెంకటేశ్వర్లు, ఆలయ ఈఓ రమాదేవి , వివిధ శాఖల జిల్లా అధికారులున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement