Saturday, April 20, 2024

అన్ని సౌక‌ర్యాల‌తో బేగంబ‌జార్ షిఫ్ మార్కెట్ : మంత్రి త‌ల‌సాని

ఎన్నో సంవత్సరాల చరిత్ర కలిగిన బేగంబజార్ ఫిష్ మార్కెట్ అన్ని సౌకర్యాలతో నిర్మాణం పూర్తి చేసుకొని ప్రారంభానికి సిద్దంగా ఉందని రాష్ట్ర పశుసంవర్ధక, మత్స్య, పాడి పరిశ్రమల అభివృద్ధి, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. శనివారం ఆయన స్థానిక ఎమ్మెల్యే రాజాసింగ్, వివిధ శాఖల అధికారులతో కలిసి నూతన ఫిష్ మార్కెట్ భవనాన్ని తిరిగి పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ… గతంలో ఈ మార్కెట్ లో ఎలాంటి సౌకర్యాలు, వసతుల్లేక వ్యాపారులు, ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడేవారని పేర్కొన్నారు. అన్ని వసతులతో కూడిన అత్యాధునిక పద్దతిలో నూతన మార్కెట్ ను నిర్మించాలనేది ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు కల అన్నారు. ఆయన ఆదేశాల మేరకు 9.50 కోట్ల రూపాయల వ్యయంతో జీ ప్లస్ టూ పద్దతిలో నూతన ఫిష్ హోల్ సేల్, రిటైల్ మార్కెట్ భవనాన్ని నిర్మించినట్లు వివరించారు. ఇందులో సెల్లార్ లో వాహనాల పార్కింగ్, గ్రౌండ్ ఫ్లోర్ లో హోల్ సేల్ మార్కెట్, కోల్డ్ స్టోరేజి ఉంటాయని, పస్ట్ ఫ్లోర్ లో కటింగ్ సెక్షన్, రిటైల్ మార్కెట్, సెకండ్ ఫ్లోర్ లో డ్రై ఫిష్ విక్రయాలు జరుగుతాయని, క్యాంటీన్ ను కూడా ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. మిగిలిన చిన్న చిన్న పనులను త్వరితగతిన పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. అపరిశుభ్ర వాతావరణంలో చేపల విక్రయాలు జరిగేవని, చేపల అమ్మకం దారులు, కొనుగోలు చేసేందుకు వచ్చే ప్రజలు కూడా అనేక ఇబ్బందులు పడ్డారని, కానీ నూతన భవనంలో ఎలాంటి ఇబ్బందులు ఏర్పడకుండా చర్యలు తీసుకున్నట్లు తెలిపారు.

మార్కెట్ భవనానికి కాంపౌండ్ వాల్ నిర్మాణం చేపట్టేందుకు ప్రతిపాదనలను సిద్దం చేయాలని అధికారులను ఆదేశించారు. అదేవిధంగా త్రాగునీరు, సేవరేజ్ పైప్ లైన్ ల కోసం 33 లక్షల రూపాయలు ఖర్చవుతాయని అధికారులు మంత్రికి తెలపగా, వెంటనే నిధులు మంజూరు చేసి పనులు చేపట్టాలని జీహెచ్ఎంసీ కమిషనర్ లోకేష్ కుమార్ ను మంత్రి ఆదేశించారు. ఈ మార్కెట్ లో సుమారు 500 కుటుంబాలు ఉపాధిని పొందుతున్నాయని పేర్కొన్నారు. ఈ మార్కెట్ లో చేపలు విక్రయించు కుంటున్న వారికి మాత్రమే జీహెచ్ఎంసీ ఆధ్వర్యంలో ఫోటో తో కూడిన లైసెన్స్ లను జారీ చేయడం జరుగుతుందని చెప్పారు. నూతన మార్కెట్ భవనం చుట్టూ ఉన్న ఆక్రమణలను తొలగించేందుకు చర్యలు తీసుకోవాలని టౌన్ ప్లానింగ్ అధికారులను ఆదేశించారు. ఈ సందర్బంగా స్థానిక కిరాణా వ్యాపారులు కొందరు తమ ప్రాంతం వరకు సీవరేజ్ లైన్ లేకపోవడం వలన మురుగునీరు నిలిచిపోయి తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని మంత్రికి విన్నవించగా, సీవరేజ్ పైప్ లైన్ ఏర్పాటు కోసం 12 లక్షల రూపాయలను మంజూరు చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ శంకర్ యాదవ్, జీహెచ్ఎంసీ కమిషనర్ లోకేష్ కుమార్, మత్స్య శాఖ కమిషనర్ లచ్చిరాం భూక్యా, వాటర్ వర్క్స్ ఈఎన్ సీ కృష్ణ, సీఈ దేవానంద్, ఈఈ సురేష్, ఎలెక్ట్రికల్ డీఈ నెహ్రు నాయక్ తదితరులు పాల్గొన్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement