Friday, April 26, 2024

Bandi Sanjay – బిజెపిది ఎదురేలేని విజ‌య‌ప‌రంప‌రం ….

ఉమ్మడి ఖమ్మం, ప్రభన్యూస్‌ బ్యూరో: ”భాజపాకు ప్రజాదరణ ఏమాత్రం తగ్గలేదు… తెలంగాణతో సహా దేశవ్యాప్తంగా ఎదురులేని విజయపరంపర కొనసాగిస్తాం… భారాస, కాంగ్రెస్‌ల గ్రాఫ్‌ దారుణంగా పడిపోయింది. తిరిగి లేవడానికి కొన్ని పత్రికలు ప్రయత్నిస్తున్నాయి. ఏం చేసినా భారాస ఇంటికి వెళ్లడం ఖాయం… కాంగ్రెస్‌ సోయిలో కూడా ఉండదు” అని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ కుమార్‌ ఉద్ఘాటించారు. రాష్ట్రంలో ప్రజల ఆశీర్వాదంతో భారతీయ జనతా పార్టీ(బీజేపీ) 30శాతం ఓటింగ్‌ను పెంచుకుందని, 5 నెలల తర్వాత అధికారం బీజేపీదేనని దీమా వ్యక్తం చేశారు. ఖమ్మం జిల్లా కేంద్రంలో నిర్వహించిన నిరుద్యోగ మార్చ్‌లో బండి సంజయ్‌ పాల్గొన్నారు. ఖమ్మం జిల్లా బీజేపీ అధ్యక్షుడు గల్లా సత్యనారాయణ అధ్యక్షతన నిర్వహించిన సభలో బండి సంజయ్‌ మాట్లాడుతూ పెరిగిన ఓటింగ్‌, ప్రజల అభిమానంతో వచ్చే ఎన్నికల్లో బీజేపీ అధికారంలోకి రానుందని ధీమా వ్యక్తం చేశారు. నిరుద్యోగుల ఆశలను బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం అడియాశగా మార్చిందని మండిపడ్డారు. నిరుద్యోగుల పక్షాన బీజేపీ పోరాడుతుందని, వారికి అండగా ఉంటుందని స్పష్టం చేశారు.

కొలువులు కావాలంటే బీజేపీ అధికారంలోకి రావాలంటూ నినాదాలతో హోరెత్తించారు. రాష్ట్రంలో 30లక్షల మంది నిరుద్యోగుల కోసం బీజేపీ నిరుద్యోగ మార్చ్‌ నిర్వహిస్తోందని, టీఎస్పీఎస్‌ పేపర్‌ లీకేజీని చిన్నదిగా చేసే కుట్రలు జరుగుతున్నాయని, సిట్టింగ్‌ జడ్జితో విచారణ జరిపించాలని, మంత్రి కేటీఆర్‌ను బర్తరఫ్‌ చేయాలని, నష్టపోయిన యువతకు రూ.1 లక్ష చొప్పున భృతి చెల్లించాలని డిమాండ్‌ చేశారు. ఖమ్మంలో బీజేపీ ఎక్కడ ఉందని చెప్పిన వారికి ఇంత పెద్ద ఎత్తున సక్సెస్‌ అయిన నిరుద్యోగ మార్చ్‌, బహిరంగసభ సమాధానం చెబుతుందని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి అంతా కేంద్రం నిధులతోనేనని పేర్కొన్నారు. లైట్లు, రోడ్లు, జాతీయ రహదారులు, చేపడుతున్న అభివృద్ధి అంతా కేంద్రానిదేనని, సీఎం కేసీఆర్‌, మంత్రి కేటీఆర్‌ పచ్చి అబద్దాలు చెబుతున్నారని మండిపడ్డారు. ఖమ్మంలో సీతారామ ప్రాజెక్టు ఎప్పుడు పూర్తి చేస్తారని, గోదావరి నీళ్లు తెచ్చి ఎప్పుడు ప్రజల కాళ్లు కడుగుతారని నిప్పులు చెరిగారు. భద్రాచలం అభివృద్ధికి సీఎం కేసీఆర్‌ వంద కోట్లు ఇస్తానని చెప్పి మోసం చేశారని, ఇటీవల గోదావరి వరదల సందర్భంగా వెయ్యి కోట్లు ఇస్తానని చెప్పిన హామీ ఏమైందో చెప్పాలని సవాల్‌ విసిరారు. కేంద్ర మంత్రి జి.కిషన్‌రెడ్డి ఇచ్చిన రూ.100 కోట్ల నిధులతోనే భద్రాచలం అభివృద్ధి జరుగుతుందన్నారు.

5 నెలల తర్వాత అధికారం బీజేపీదే అంటూ ఉద్ఘాటన
రాష్ట్రంలో 2018 ఎన్నికలతో పోల్చితే బీజేపీ ఓటింగ్‌, విజయాల పరంపర అనూహ్యంగా పెరిగిందని బండి సంజయ్‌కుమార్‌ పేర్కొన్నారు. 2018లో బీజేపీకి 7శాతం ఓటింగ్‌ ఉండగా, నేడు 30 శాతానికి పెరిగిందన్నారు. కాంగ్రెస్‌కు నాడు 29శాతం ఉండగా, నేడు19 శాతానికి పడిపోయిందని, బీఆర్‌ఎస్‌కు అప్పట్లో 40శాతం ఉండగా, నేడు 30 శాతానికి పడిపోయిందని గణాంకాలతో బండి సంజయ్‌ పేర్కొన్నారు. రాష్ట్రంలో 5 నెలల తర్వాత వచ్చేది బీజేపీ ప్రభుత్వమేనని బండి సంజయ్‌ ధీమా వ్యక్తం చేశారు.

టీఎస్‌పీఎస్‌పీ పేపర్‌ లీకేజీపై సిట్టింగ్‌ జడ్జితో విచారణ జరిపించాలి
టీఎస్‌పీఎస్‌సీ పేపర్‌ లీకేజీపై సిట్టింగ్‌ జడ్జితో విచారణ జరిపించాలని, మంత్రి కేటీఆర్‌ను బర్తరఫ్‌ చేయాలని బండి సంజయ్‌ డిమాండ్‌ చేశారు. టీఎస్‌పీఎస్‌సీ పేపర్‌ లీకేజీని రాష్ట్ర ప్రభుత్వం, సీఎం కేసీఆర్‌ చిన్న సంఘటనగా చూపే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. ఘటనపై సీఎం కేసీఆర్‌ కనీసం స్పందించలేదని, మళ్లి దొంగ చేతికే తాళాలు ఇచ్చి పరీక్ష పెట్టాలని చూస్తున్నారని, బీజేపీ చూస్తూ ఊరుకునే ప్రసక్తే లేదని హెచ్చరించారు.

- Advertisement -

అధికారంలోకి వస్తే ఉచిత విద్య, వైద్యం, ఇండ్లు
రాష్ట్రంలో 5 నెలల తర్వాత బీజేపీ అధికారంలోకి రానుందని, అధికారం లోకి వస్తే ఉచిత విద్య, వైద్యం, పేదలకు ఇండ్లు, ప్రతీ సంవత్సరం జనవరి నెలలో జాబ్‌ క్యాలెండర్‌ వేసి ఉద్యోగాలు భర్తీ చేస్తామని బండి సంజయ్‌ పేర్కొన్నారు. 20వేల ఉపాధ్యాయుల పోస్టులను ఓకేసారి జంబో డిఎస్సీ ద్వారా భర్తీ చేస్తామని, బిశ్వాల్‌ కమిషన్‌ సూచనల ప్రకారం 1.90లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామన్నారు.

స్కాచ్‌ టేస్టు కోసం, లిక్కర్‌ పంపకాల కోసం సీఎంలు
రాష్ట్రానికి వచ్చిన డిల్లి, పంజాబ్‌ సీఎంలు కొత్త స్కాచ్‌ టేస్టుల కోసం, లిక్కర్‌ వ్యాపార వాటాల్లో పంపకాల కోసం వచ్చారని, ప్రగతి భవన్‌లో పుల్‌గా తాగి బాటిళ్లు పగులగొడతారని బండి సంజయ్‌ డిల్లి, పంజాబ్‌ సీఎంలతో సీఎం కేసీఆర్‌ భేటీపై ఆరోపణలు చేశారు. ఈ నిరుద్యోగ మార్చ్‌లో బీజేపీ జాతీయ నాయకులు డాక్టర్‌ పొంగులేటి సుధాకర్‌రెడ్డి, మాజీ ఎంపి గరికపాటి రామ్మోహన్‌రావు, బీజేపీ కిసాన్‌ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు కొండపల్లి శ్రీధర్‌రెడ్డి, ఉప ్పల్‌ మాజీ ఎమ్మెల్యే ఎన్‌విఎస్‌ ప్రభాకర్‌, ఖమ్మం పార్లమెంటరీ నాయకులు దేవకి వాసుదేవరావు, మహిళా మోర్చా రాష్ట్ర నాయకురాలు ఉప్పల శారద, ఖమ్మం జిల్లా అధ్యక్షుడు గల్లా సత్యనారాయణ, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బీజేపీ అధ్యక్షుడు కోనేరు సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement