Wednesday, March 27, 2024

Big Story | వివాదంలో బుద్ధుడి చితాభస్మం.. మాకే కావాలంటున్న తెలంగాణ, ఏపీ

సత్యం, ధర్మం, అహింస సిద్ధాంతాలను ప్రభోదించిన బుద్ధభగవానుని చితాభస్మం తెలుగు రాష్ట్రాల మధ్య అశాంతిని ప్రేరేపిస్తుంది. రాష్ట్ర విభజన అనంతరం పంపకాల్లో బుద్ధుని చితాభస్మం వివాదానికి కేంద్రంగా నిలిచింది. రాష్ట్ర విభజన చట్టం మేరకు 58:32 శాతం ఆస్తుల పంపకానికి కుదిరిన ఒప్పందం చితాభస్మం వ్యవహారంలో వర్తించాల్సి ఉండగా బుద్ధిని చితాభస్మం తమకే చెందుతుందని ఆంధ్ర చేస్తున్న వాదనలను తెలంగాణ చరిత్ర కారులు తప్పుబడుతున్నారు.

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ: 1980లోవిశాఖ బావికొండతవ్వకాల్లో వెలుగుచూసిన మహాచైత్యంలో బంగారుభరిణిలో లభించిన బుద్ధుని చితాభస్మం, ధాతువు, పూసలను తెలంగాణ పురావస్తు శాఖలో బుల్లెట్‌ బ్రూప్‌ గాజు ఫ్రేంలో భద్రపరిచారు. అయితే ఉమ్మడి రాష్ట్రంలో వెల్లడైన ఈ చితాభస్మం వెలికితీసేందుకు అయిన ఖర్చు, పరిశోధన వ్యయం, ఆస్తుల పంపకాల చట్టం మేరకు చితాభస్మంలోని కొంత భాగం తెలంగాణ కు ఇవ్వాల్సిందేననే వాదనలు వినిపించడంతో ఈ చిక్కుముడిని ఇప్పటివరకు ఇప్పేందుకు ఎవరూ సాహసం చేయడంలేదు.

తెలుగు రాష్ట్రాల పురావస్తు సంపద పంపిణీ వివాదాల ముసురులో తల్లడిల్లుతుంది. బుద్ధిని మహానిర్యాణం అనంతరం ఆయన శిష్యులు చితాభస్మాన్ని 8 భాగాలుగా చేస్తే దేశాన్ని క్రీ.పూ. 232నుంచి 268 వరకు పాలించిన అశోక చక్రవర్తి క్రీ.పూ.261 లో జరిగిన కళింగ యుద్ధానంతరం బౌద్ధాన్ని స్వీకరించి 8 కలశాల్లోని బుద్ధుని చితాభాస్మాన్ని 84 వేల విభాగాలు చేసి ప్రపంచంలోని అనేక ప్రాంతాల్లో మహాచైత్యాల కింద భద్రపరిచారని చరిత్ర కారులు నిర్ధారించారు. ఈ కలశాల్లో ఒకటి బావికొండ తవ్వకాల్లో వెలుగుచూసింది. రాష్ట్ర విభజన కావడంతో ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాలకు సమపాల్లలో పంపిణీ జరగాలనే వాదనలు మిన్నంటుతున్నాయి.

1940లో నిజాం మీర్‌ ఉస్మాన్‌ అలీఖాన్‌ స్థాపించిన స్టేట్‌ ఆర్కాలజీ మ్యూజియంలో అమరావతి తవ్వకాల్లో లభించిన గుప్తులు, శాతవాహనులు, మౌర్యుల నాణాలు 7,650 భద్రపరిచారు. ఈ నాణాలను ఏపీకి పంపించాలని ఏపీ ప్రభుత్వం పట్టు బడుతుంది. అయితే 1953లో తెలంగాణ పురావస్తు శాఖ రికార్డుల్లో ఈ నాణేల చరిత్ర ఉంది. 1956 రాష్ట్ర విభజనకు ముందే తెలంగాణ పురావస్తు శాఖకు చేరిన ఈ నాణాలపై ఏపీకి హక్కులేదని తెలంగాణ వాదిస్తుంది. అలాగే అమరావతి లో జరిగిన కాలచక్రసందర్భంగా ఫణిగిరి, ధూళికట్ట నుంచి ఏపీకి తీసుకువెళ్లిన బుద్ధవిగ్రహాలు ప్రస్తుతం చీమకుర్తి, బాపట్ల, నెల్లూరులో ఉన్నాయి. ఈ విగ్రహాలను తక్షణం తెలంగాణ కు తీసుకువచ్చి పంపకాలపై చర్చించాలని తెలంగాణ పట్టుబడుతుంది. అలాగే నల్గొండ తవ్వకాల్లో లభించిన చాళుక్యుల సామ్రాజ్య నాణాలు ఏపీ మ్యూజియంలో భద్రపర్చడం వివాదంగా మారింది.

- Advertisement -

రహస్య గదుల్లో మహా సంపద
నిజాంకాలం నుంచి హైదరాబాద్‌ సంస్థానంలో జరిపిన పురావస్తు తవ్వకాల్లో అత్యంత విలువైన రాజుల సంపద, రాగి, బంగారు, తామ్ర శాసనాలు, రాజముద్రికలతో చిన్నసైజుల్లోని లోహ విగ్రహాలు, విలువైన సంపద తెలంగాణ లోని స్ట్రాంగ్‌ రూముల్లో భద్రపరిచారు. ఇందులో 3లక్షల 45 వేల నాణాలు ఉన్నాయి. 17వేల బంగారు వస్తువులు ఉన్నాయి. 15,355 వెండినాణాలు,4,464 రాగినాణాలు, 23,688 సీసపు నాణేలు ఉన్నాయి. కాకతీయుల కాలంనాటి ఆభరణాలు, కుతుబ్షాహీలు, నిజాంల విలువైన బంగారు వస్తువులు, తాళపత్ర గ్రంథాలు, అత్యంత విలువైన అజంతా ఎల్లోరా చిత్రాలు, ఆయుధాల తో పాటుగా మొగలుల వస్తువులు, ఆభరణాలు, నాణాలు, టిప్పుసుల్తాన్‌ ఆయుధాలు, బుద్ధవిగ్రహాలు, యుద్ధ సామాగ్రి ఉన్నాయి.

వీటితో పాటుగా 1930లో నిజాం రాజులు సేకరించి భద్రపర్చిన ఈజిప్టు మమ్మి కూడా ఉంది. అయితే ప్రస్తుత వివాదాల్ల్లో వీటి పంపకం ప్రధానంగా నిలిచింది. ఇందులో వాటాకావాలని ఏపీ పట్టు బట్టడంతో తెలంగాణ చరిత్ర కారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తెలంగాణను రాజధానిగా చేరుకుని క్రీస్తు పూర్వం నుంచి 1948 వరకు అనేక రాజవంశాలు పాలించిన నేపథ్యంలో విలువైన వస్తువులు తవ్వకాల్లో లభిస్తే వాటిలో వాటా కావలానడం వివాదస్పదమని చరిత్రకారులు చెప్పుతున్నారు.

ఏపీకి చెందినవి ఇచ్చేందుకు అభ్యంతరం లేదు: మంత్రి శ్రీనివాస్‌ గౌడ్‌
తెలంగాణకు చెందిన పురావస్తు సంపద పంపకాలకు ప్రభుత్వం సిద్ధంగా లేదని మంత్రి శ్రీనివాస్‌ గౌడ్‌ స్పష్టం చేశారు. అయితే ఆంధ్రకు చెందిన పురాతన వస్తువులు ఇచ్చేందుకు తెలంగాణప్రభుత్వానికి అభ్యంతరం లేదన్నారు. ఏపీలో తెలంగాణ పురావస్తు సంపద ఉందని చెప్పారు. ఇదే విధానం రెండు రాష్ట్రాలకు వర్తించాలని ఆయన స్పష్టం చేశారు. విదేశాల్లో పురావస్తు సంపద లండన్‌ లోని ఆల్బర్ట్‌ మ్యూజియంలో తెలంగాణ పురావస్తు సంపద కొలువై ఉందని ఉమ్మడి రాష్ట్ర పురావస్తు శాఖ మాజీ డైరెక్టర్‌ చెన్నారెడ్డి చెప్పారు. చర్చలద్వారా ఆంధ్ర, తెలంగాణ సంపద పంపిణీ సమస్య కాదు కానీ విదేశాల్లో ఉన్న పురావస్తు సంపద తిరిగి ఎలా రాబట్టుకోవాలో కేంద్రం ఆంధ్ర,తెలంగాణ ప్రభుత్వాలతో సంప్రదించి నిర్ణయం తీసుకోవల్సి ఉంది. విక్టోరియా రాణి కిరీటంలోని కోహినూర్‌ వజ్రం మనదైనా తెప్పించుకునే ప్రయత్నం జరగడంలేదని విచారం వ్యక్తం చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement