Sunday, April 28, 2024

అసెంబ్లీలో అక్బ‌రుద్దీన్ – కెటిఆర్ ల మాట‌ల యుద్ధం..

హైద‌రాబాద్ – తెలంగాణ అసెంబ్లీలో నేడు గ‌వ‌ర్న‌ర్ ప్ర‌సంగంపై చర్చ ప్రారంభ‌మైంది..ఈ సంద‌ర్భంగా మాట్లాడిన ఎంఎంఎం ఎమ్మెల్యే అక్బ‌రుద్దీన్ పాత బ‌స్తీ అభివృద్ధి ప‌నుల గురించి ప్ర‌స్తావిస్తూ, ప్ర‌భుత్వం పాత బ‌స్తీని ప‌ట్టించుకోవ‌డం లేదంటూ నిల‌దీశారు.. దీనిపై మంత్రి కెటిఆర్ అంతే ఘాటుగా స‌మాధానం ఇచ్చారు.. వివ‌రాల‌లోకి వెళితే స‌భ‌లో అక్బరుద్దీన్ ఓవైసీ, మాట్లాడుతూ, ఉస్మానియా ఆసుపత్రి నిర్మాణంపై మంత్రి కేటీఆర్ ను ప్రశ్నించారు. హైదరాబాద్ లోని ఇతర ప్రాంతాల్లో వేగంగా జరుగుతున్న పనులు పాతబస్తీలో ఎందుకు జరగడం లేదని నిలదీశారు. చార్మినార్ పాదాచారుల ప్రాజెక్టు ఇన్నేళ్లుగా జరుగుతుంటే ప్రజలకు ఏం చెప్పాలి ? అని ఆగ్రహం వ్యక్తం చేశారు. పాతబస్తీ మెట్రో ఏమైంది ? అంటూ మండిపడ్డారు. అసెంబ్లీ సమావేశాలు తక్కువ రోజులు జరుగుతున్నాయని, నాలుగున్నరేళ్ళలో కేవలం 64 రోజుల పాటు మాత్రమే సభ జరిగిందని ఆరోపించారు. ఇంత తక్కువ రోజులు బడ్జెట్ సమావేశాలు జరగడం చరిత్రలోనే మొదటిసారని గుర్తు చేశారు. అందుకే బీఏసీకి రాలేదని, కలవాలంటే మంత్రులు కూడా అసలు అందుబాటులో ఉండరని ఆరోపించారు.

దీనిపై మంత్రి కేటీఆర్ తీవ్రంగా స్పందించారు. ఏడుగురు సభ్యులు ఉన్న పార్టీకి ఎక్కువ సమయం సబబు కాదని అన్నారు. గొంతు చించుకున్నంత మాత్రాన ఉపయోగం ఉండదని అన్నారు. సభా నాయకుడు బీఏసీకి రాలేదని నిందా పూర్వకంగా మాట్లాడడం తగదని హిత‌వు చెప్పారు. ప్రభుత్వం తరపున నలుగురు మంత్రులు బీఏసీకి వెళ్ళారని, అక్బర్ రాకుండా నిందించడం భావ్యం కాదని తెలిపారు. మంత్రులు అందుబాటులో లేరని అనడం కూడా భావ్యం కాదని కేటీఆర్ అన్నారు. అసెంబ్లీ తక్కువ రోజులు అంటున్నారు. కానీ, రెండేళ్ల కొవిడ్ ను మరచిపోయారని చెప్పారు. కేటీఆర్ కామెంట్స్ కు అక్బరుద్దీన్ సమాధానంగా తానేమీ కొత్త సభ్యున్ని కాదని, మీకు సహనం తక్కువవుతోందని కామెంట్స్ చేశారు. పొగిడితే మాత్రం ఎంత సేపైనా ఏమీ అనరని వ్యాఖ్యానించారు. ఆ వెంటనే కల్పించుకున్న మంత్రి ప్రశాంత్ రెడ్డి అక్బర్ గవర్నర్ ప్రసంగంపై మాట్లాడితే బాగుంటుందని సూచించారు. అక్బర్ కే సహనం తగ్గి, కోపం వస్తోందని కామెంట్స్ చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement