Wednesday, May 1, 2024

సాగు, తాగు నీటి రంగాల్లో అభివృద్ధి సాధించాం : ఎమ్మెల్యే బాపురావు

బోథ్, జూన్ 7 (ప్రభ న్యూస్) : తెలంగాణ ఏర్పడ్డ తర్వాత గత తొమ్మిది సంవత్సరాలలో బోథ్ నియోజకవర్గం లో సాగునీరు, తాగునీటి రంగాలలో గణనీయంగా అభివృద్ధి సాధించామని తద్వారా బోథ్ ను సస్యశ్యామలం చేసే దిశగా ప్రయాణిస్తున్నామని ఎమ్మెల్యే రాథోడ్ బాపురావు అన్నారు. రాష్ట్ర దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా బుధవారం బోథ్ నియోజకవర్గ కేంద్రంలోని పరిచయ గార్డెన్లో నీటి పారుదల శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన సాగునీటి దినోత్సవ వేడుకలకు ముఖ్యఅతిథిగా ఎమ్మెల్యే హాజరై మాట్లాడారు. ముందుగా సాగునీటి రంగంలో ప్రగతి ప్రవాహం అనే పుస్తకాన్ని ఆవిష్కరించారు. అనంతరం రాథోడ్ బాపురావు మాట్లాడుతూ.. ఉమ్మడి రాష్ట్రంలో తాగు నీరు, సాగు నీరు లేక అనేక మంది ఆత్మ హత్యలు ఉండేవని, నేడు సాధించి తెచ్చిన స్వరాష్ట్రంలో నీటి కష్టాలు పూర్తిగా తొల‌గిపోయి ప్రజలు ఆనందంగా ఉన్నారు. మిషన్ భగీరథ ద్వారా తెలంగాణ వ్యాప్తంగా మారుమూల గూడాలకు, తండాలకు సైతం మంచినీరు అందిస్తున్న గణత తెలంగాణ ప్రభుత్వానిది అన్నారు. మిషన్ కాకతీయ ద్వారా నియోజకవర్గంలోని చెరువులన్నీ పునర్ నిర్మాణం గావింపబడి నీటితో కలకలాడుతున్నాయని అన్నారు. మిషన్ కాకతీయ పథకం ద్వారా 51 వేల కోట్ల రూపాయలతో 69 చెరువులు పునర్ నిర్మించబడ్డాయని అన్నారు. 60 కోట్లతో 26 చెక్ డ్యాంల నిర్మాణం జరిగిందని, మొత్తంగా 2060 వేల కోట్ల రూపాయలతో నియోజకవర్గ వ్యాప్తంగా ప్రాజెక్టులు చెక్ డ్యాంలు చెరువుల పూడికతీత పనులు చేపట్టపడ్డాయని తెలిపారు. తద్వారా వేల ఎకరాలు సాగు చేయబడుతున్నాయని అన్నారు. కుప్టి ప్రాజెక్టు సర్వే పూర్తయిందని 1323 కోట్ల రూపాయలు మంజూరు కూడా కావడం జరిగిందన్నారు. జూలై, ఆగస్టు మాసాల్లో టెండర్ ప్రక్రియ పూర్తయిపోయి పనులు ప్రారంభించబడతాయని తెలిపారు.

ఊహించని విధంగా తెలంగాణ అభివృద్ధి పథంలో దూసుకుపోతుందని తెలిపారు. ఆంధ్ర పాలకుల చేతుల్లో రాళ్లు రప్పలుగా ఉన్న బోథ్ నియోజకవర్గం తెలంగాణ ఏర్పడిన తర్వాత ఎటు చూసినా పచ్చదనం, చెరువులతో చెక్ డ్యాంలతో కలకలాడుతున్నాయని కొనియాడారు. మరింత అభివృద్ధి చేయడానికి కట్టుబడి ఉన్నామని, దానికి ఇరిగేషన్ అధికారులు, కలెక్టర్ కూడా తమ వంతుగా నియోజకవర్గ అభివృద్ధిలో కీలకపాత్ర పోషించాలని సూచించారు. కలెక్టర్ రాహుల్ రాజ్ మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం అధికారంగా నిర్వహిస్తున్న దశాబ్ది ఉత్సవాలు 21 రోజులు పాటు జరుగుతాయని అన్నారు. ఈ ఉత్సవాల ముఖ్య ఉద్దేశం గత తొమ్మిది సంవత్సరాలలో తెలంగాణలో జరిగిన అభివృద్ధి గురించి ప్రజలకు తెలియ చేసేందుకు ఈ ఉత్సవాలు జరుపబ‌డుతున్నాయని అన్నారు. అంతకుముందు సాగునీటి ఉన్నతాధికారులు గత తొమ్మిది సంవత్సరాలలో జరిగిన అభివృద్ధి గురించి వివరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్, జడ్పీటీసీ సంధ్యారాణి, ఎఎంసి చైర్మన్ రుక్మన్ సింగ్, వైస్ చైర్మన్ సంజీవ్ రెడ్డి, వైస్ ఎంపిపి లింబాజి, సర్పంచ్ సురేందర్, ఇరిగేషన్ శాఖ ఎస్ ఈ, డి ఈ,ఏ ఈ,బిఆర్ఎస్ నాయకులు జగన్ రెడ్డి, తాహెర్, ఎలుక రాజు,నారాయణరెడ్డి,సుభాష్ తో పాటు మండల నాయకులు, అంగన్వాడి కార్యకర్తలు పలువురు రైతులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement