Friday, April 26, 2024

అమ్మకానికి కేసీఆర్ గుడి.. టీఆర్ఎస్‌కు షాకిచ్చిన కార్యకర్త

మంచిర్యాల జిల్లా దండేపల్లికి చెందిన గుండ రవీందర్ సీఎం కేసీఆర్‌కు వీరాభిమాని. కేసీఆర్ పిలుపు మేరకు ప్రత్యేక తెలంగాణ ఉద్యమంలో పాల్గొని బైండోవర్ కేసులను సైతం ఎదుర్కొన్నాడు. ఈ క్రమంలో రవీందర్ తన స్వగ్రామంలో రూ.3 లక్షలతో కేసీఆర్ కు గుడి కట్టాడు. తెలంగాణ తల్లి, ప్రొఫెసర్ జయశంకర్ విగ్రహాలను కూడా ఏర్పాటు చేశాడు. కేసీఆర్ ను దైవంగా భావించి నిత్యం పూజలు చేస్తూ తన వీరభక్తిని చాటుకునేవాడు. అయితే కాలక్రమంలో పరిస్థితి మారింది. సొంత ఊరిలో కేబుల్ నెట్ వర్క్ వ్యాపారం చేసే రవీందర్‌కు ఊహించని పరిణామం ఎదురైంది. ఆయన వ్యాపారాన్ని ఇతరులు హస్తగతం చేసుకున్నారు. దాంతో తనను ఆదుకోవాలని, న్యాయం జరిగేలా చూడాలని కోరుతూ అనేక పర్యాయాలు ప్రగతి భవన్ కు వచ్చాడు. కేసీఆర్, కేటీఆర్ లను కలిసేందుకు చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాయి. చివరికి కేసీఆర్‌కు తాను కట్టిన గుడి ఎదుట ధర్నా చేసినా ఫలితం లేకపోయింది. చేసేదిలేక టీఆర్ఎస్ కు రాజీనామా చేసి బీజేపీలో చేరాడు.

తాజాగా కేసీఆర్ గుడిని అమ్మేస్తానంటూ ఫేస్ బుక్ లో పోస్టు పెట్టడంతో అందరి దృష్టి గుండ రవీందర్ పై పడింది. టీఆర్ఎస్ నేతలు మాత్రం దీనిపై అసంతృప్తి వ్యక్తం చేస్తుండగా, మరికొందరు మాత్రం మంచి పనిచేస్తున్నావంటూ రవీందర్ ను అభినందిస్తున్నారు. కేసీఆర్ గుడిని ఎవరూ కొనేందుకు ముందుకు రాకపోతే, తానే కూల్చిపడేస్తానని రవీందర్ అంటున్నాడు. కొన్ని రాజకీయ శక్తులు తన కేబుల్ వ్యాపారాన్ని దెబ్బతీశాయని, టీఆర్ఎస్ పార్టీ ద్వారా తనకు న్యాయం జరగలేదని అతడు వాపోయాడు. ఈ నేపథ్యంలో ఫేస్ బుక్ లో పోస్టు పెట్టిన రవీందర్, తన ఫోన్ నెంబరు కూడా ఇచ్చాడు. ఈ క్రమంలో, కొందరు వ్యక్తులు కేసీఆర్ గుడిని కొనేందుకు ఆసక్తి చూపిస్తున్నారని, భవిష్యత్తులో ఏంజరుగుతుందో చూడాలని వ్యాఖ్యానించాడు.

Advertisement

తాజా వార్తలు

Advertisement