Sunday, April 28, 2024

ADB: బాసర ఆలయంలో భక్తుల కోలహలం..

బాసర, ఫిబ్రవరి 19 (ప్రభ న్యూస్) : బాసర ఆలయంలో భక్తుల కోలాహలం నెలకొంది. మాఘ మాసం నవమి సోమవారం కలిసి రావడంతో భక్తులు భారీగా తరలివచ్చారు. ఉదయం నుండి భక్తులు గోదావరి నదిలో పుణ్యస్నానాలు ఆచరించి గోదారమ్మకు ప్రత్యేక పూజలు చేశారు. తీరాన గల శివాలయంలో పూజలు చేసుకొని దీపాలను వెలిగించారు. అమ్మవారి అక్షరాభ్యాస దర్శన పూజల కోసం భక్తులు క్యూ లైన్ లో బారులు తీరారు.

భక్తుల రద్దీ అధికంగా ఉండడంతో ఆలయ ఈఓ విజయరామారావు దగ్గరుండి భక్తులను వరుస క్రమంలో పంపించారు. ఆలయ సన్నిధిలోని అక్షరాభ్యాస మండపంలో ఆలయ అర్చకులు చిన్నారులకు వేదమంత్ర వచనలతో అక్షరాభ్యాస పూజలను జరిపించారు. భక్తులు ఆలయంలోని అమ్మవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. భక్తుల రద్దీకి అనుగుణంగా ఆలయ అధికారులు నిరంతరాయంగా అక్షరాభ్యాస పూజలు జరిపించారు. అమ్మవారి అన్నదాన సత్రంలో భక్తులు అమ్మవారి ప్రసాదాన్ని స్వీకరించారు. ఈ ఒక్కరోజే ఆలయానికి 15లక్షల రూపాయల వరకు ఆదాయం సమకూరినట్లు ఆలయ అధికారులు తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement