Monday, April 29, 2024

అటవీ భూముల్లో ఈద్గా నిర్మాణాలా… కేసీఆర్ కు బండి లేఖ

నిర్మల్ ప్రతినిధి, ఏప్రిల్ 18 ( ప్రభ న్యూస్) : నిర్మల్ పట్టణంలో వృత్తి నైపుణ్య శిక్షణా కేంద్రం కోసం కేటాయించిన అటవీ భూమిని చట్ట విరుద్దంగా ఈద్గా నిర్మాణం కోసం కేటాయించిన బాధ్యులపై చర్యలు తీసుకోవాలని రాష్ట్ర బీజేపీ అధ్యక్షులు బండి సంజయ్ ఒక లేఖను సీఎంకు పంపించారు.
లేఖలో వివరించిన వివరాలు…
నిర్మల్ జిల్లా చించోలి గ్రామంలోని సర్వే నెంబర్ 543, 544, 969 లోని అటవీ భూమిని వృత్తి విద్యా నైపుణ్యాల అభివృద్ధి కోసం కేటాయించాలనే రాష్ట్ర ప్రభుత్వ అభ్యర్థన మేరకు సుమారు 3.373 హెక్టార్ల అటవీ భూమిని రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం కేటాయిస్తూ ఆమోదం తెలిపింది. ఆయా అటవీ భూములను సైతం డీనోటిఫై చేసిందే నిరుద్యోగ యువత భవిష్యత్తు కోసం… అటువంటి భూమిని మీ స్వార్ధ రాజకీయాల కోసం ఈద్గా ప్రార్థనల కోసం కేటాయించడం చట్ట విరుద్దం. ప్రజా ఉపయోగ కార్యక్రమాల కోసం ఉపయోగించాల్సిన ప్రభుత్వ భూములను ప్రార్థనా స్థలాలకు కేటాయించడానికి వీల్లేదని ప్రభుత్వ నిబంధనలు స్పష్టం చేస్తున్నాయి. అంతేగాకుండా ఏ ప్రజా ప్రయోజనాల కోసమైతే భూములను కేటాయిస్తారో… ఆ ప్రజా ప్రయోజనాలకు మాత్రమే సదరు భూమిని వినియోగించాలే తప్ప అందుకు భిన్నంగా ఇతర ప్రయోజనాలకు వినియోగించడం చట్ట విరుద్ధం. గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ హైకోర్టు సహా పలు కోర్టులు ఈ మేరకు స్పష్టమైన ఉత్తర్వులు జారీ చేశాయి. ఈ విషయంలో న్యాయస్థానాలు ఇచ్చిన తీర్పులే పాలకులకు అనుసరణీయం. అయినప్పటికీ కోర్టు తీర్పులకు వ్యతిరేకంగా నిర్మల్ జిల్లాలోని చించోలిలో ఈద్గాను నిర్మించడమంటే న్యాయ వ్యవస్థను అవమానించినట్లే. ఇది ముమ్మాటికీ కోర్టు థిక్కరణే. రాజ్యాంగాన్ని ధిక్కరించడమే. ప్రజా ప్రయోజనాల కోసం కేటాయించబడిన ఫారెస్ట్ భూములను మీ స్వార్థ రాజకీయాలకు వాడుకోవాలనుకోవడం నీచమైన పని. ఈ చర్యలను తీవ్రంగా ఖండిస్తున్నాం. ఈద్గా ప్రార్ధన కోసం ప్రభుత్వం ప్రారంబించాలనుకుంటున్న ప్రాంతాలకు అత్యంత సమీపంలో రెండు హిందూ దేవాలయాలున్న విషయం మీ దృష్టిలో లేదనుకోలేను. నిరుద్యోగ యువత కోసం కేటాయించిన భూమిని ప్రార్థనా స్థలాలకు కేటాయించడం ఒక పొరపాటు అయితే.. ప్రజల మధ్య వైషమ్యాలను రెచ్చగొట్టేందుకు ప్రభుత్వం స్వయంగా పూనుకోవడం క్షమించరాని నేరం. ఓట్ల కోసం విద్యార్థుల ప్రయోజనాలను పక్కనపెట్టి ఒక మతానికి కొమ్ము కాసేలా నిర్ణయాలు తీసుకోవడం మీ స్వార్ధ రాజకీయాలకు పరాకాష్ట.

ప్రభుత్వ భూములను మతపరమైన కార్యక్రమాలకు వినియోగించకూడదని స్పష్టమైన నిబంధనలున్నప్పటికీ ఆ భూములను ఈద్గా నిర్మాణానికి కేటాయించడం దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి మహమూద్ అలీ ఆ నిర్మాణ పనులను స్వయంగా ప్రారంభించేందుకు ఈ రోజు ఆ ప్రాంతానికి వెళుతుండటం బాధాకరం. రాజ్యాంగంపై ప్రమాణం చేసి మంత్రులుగా కొనసాగుతూ ఆ రాజ్యాంగాన్ని, న్యాయ వ్యవస్థ తీర్పులను ధిక్కరించడం దుర్మార్గ చర్య. ఈ విషయం తెలిసి కూడా మీరు సైతం అటువంటి చట్ట వ్యతిరేక పనులకు సహకరిస్తున్నట్లు కన్పిస్తుండటం చూస్తుంటే ఉద్దేశపూర్వకంగా చట్టాలను, న్యాయస్థాన తీర్పులను ధిక్కరిస్తున్నట్లు భావిస్తున్నాం. మీ రాజకీయ స్వార్థ ప్రయోజనాల కోసం యువత భవిష్యత్తును బలిచేసే చర్యలను బీజేపీ తెలంగాణ పక్షాన తీవ్రంగా ఖండిస్తున్నాను. ఈ విషయంలో నిబంధనలకు అనుగుణంగా పనిచేయాల్సిన అధికారులు సైతం మౌనం వహిస్తుండటం బాధాకరం. మీ ప్రభుత్వ నిర్వాకం వల్ల ఉద్యోగాలు లేక నిరుద్యోగ యువత ఇప్పటికే తీవ్రంగా నష్టపోయింది. అనేక మంది ఆత్మహత్యలకు పాల్పడ్డారు. ఉపాధి శిక్షణలోనైనా వారికి అందాల్సిన కనీస సౌకర్యాలను దూరం చేసే చర్యలకు పాల్పడకండి. కేంద్ర ప్రభుత్వం, కేంద్ర పర్యావరణ శాఖ ఉత్తర్వులు బేఖాతరు చేసి రాష్ట్ర ప్రభుత్వం ముందుకు వెళితే తగిన మూల్యం చెల్లించాల్సి వస్తుంది. ఇకనైనా వృత్తి విద్య, నైపుణ్యం అభివృద్ధి కోసం కేటాయించబడిన భూమిని అదే ప్రయోజనాల కోసం వినియోగించాలని డిమాండ్ చేస్తున్నాను. దీనికి భిన్నంగా ప్రభుత్వం వ్యవహరిస్తే న్యాయ స్థానాన్ని ఆశ్రయించడంతోపాటు ప్రజల్ని సమీకరించి పెద్ద ఎత్తున ఆందోళన చేసేందుకు సిద్ధం. ప్రజాక్షేత్రం లోనూ మీ ప్రభుత్వం తీవ్రమైన ప్రతిఘటన ఎదుర్కోక తప్పదని హెచ్చరిస్తున్నాం అని లేఖలో బండి సంజయ్ హెచ్చరించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement