Sunday, April 28, 2024

Adilabad – మండే ఎండల్లో అతి శీతలం! కారు మబ్బులతో తేలికపాటి వర్షం

ఆదిలాబాద్‌లో ఆహ్లాదక‌రం
సంతోషంలో గ్రామీణులు
పంట‌ల‌కు కాస్త ఊర‌ట‌
ప‌శువుల తాగునీటికి తీరిన కొర‌త‌

ఆంధ్ర‌ప్ర‌భ‌, ఉమ్మడి ఆదిలాబాద్ బ్యూరో: నిన్న మొన్నటి దాకా వడగాలులు, భరించరాని ఉక్క పోతతో ఉక్కిరి బిక్కిరైన జనం గురువారం శీతల గాలులతో కూడిన వర్షపు జల్లులతో సేదతీరారు. మహారాష్ట్రలో ఉపరితల ఆవర్తనం కేంద్రీకృతం కావడంతో నిన్నటి వరకు నిప్పులు కక్కిన భానుడు ఒక్కసారిగా చల్లబడ్డాడు. ఆదిలాబాద్ జిల్లాలో ఈరోజు ఉదయం నుంచి కారుమబ్బులు కమ్ముకొని సూర్యుడు బయటకు రాని పరిస్థితి. చల్లని గాలికి తోడు అకాల వర్షం కుర‌వ‌డంతో ప్రకృతి ప్రేమికులు వర్షంలో తడుస్తూ ఆనంద పరవశులయ్యారు. ఆదిలాబాద్ మండలంలో 22 మిల్లీమీటర్లు, మావల గుడిహత్నూర్ తలమడుగులో 19 మీటర్ల వర్షపాతం నమోదయింది. ఆదిలాబాద్ పట్టణం వర్షానికి జలమయం కాగా, రంజాన్ పండుగ సామూహిక ప్రార్థనలకు ముస్లింలు ఇబ్బందులు పడ్డారు. ఇచ్చోడ, గుడిహత్నూర్, ఇంద్రవెల్లి మండలాల్లో చల్లటి గాలులకు తోడు మోస్త‌రు వర్షాలు ఊరట కలిగించాయి. దాహార్తితో అల్లాడుతున్న పశువులకు నీటి కొరత తీరినట్టు అయింది.

ఆదిలాబాద్‌లో 32 డిగ్రీల ఉష్ణోగ్రత..
ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో గురువారం మధ్యాహ్నం పగటి ఉష్ణోగ్రత 32 డిగ్రీలు నమోదు కావడం గమనార్హం. మూడు రోజుల కిందట ఇక్కడే 42.4 డిగ్రీలు నమోదయింది. మరో మూడు రోజులపాటు వాతావరణం ఇదే విధంగా చల్లబడుతుందని, తేలికపాటి వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ నిపుణులు పేర్కొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement