Monday, May 6, 2024

విద్యాశాఖకు 317 జీవో కేసుల తలనొప్పి.. అధికారులకు నిద్రలేకుండా చేస్తున్న పిటిషన్లు

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ : పాఠశాల విద్యాశాఖకు కోర్టు కేసులు వెంటాడుతున్నాయి. దీంతో అధికారులకు తలనొప్పిగా మారింది. ప్రతి రోజు ఎవరో ఒక ఉపాధ్యాయుడు లేదా ఉపాధ్యాయురాలు తమకు అన్యాయం జరిగిందని కోర్టు మెట్లు ఎక్కుతున్నారు. దాంతో వేలాది కేసులు కోర్టులో దాఖలవుతున్నాయి. ఇందులో 317 జీవో తీసుకొచ్చిన లొల్లే ఎక్కువగా ఉందని అధికారిక వర్గాలు చెబుతున్నాయి. ఇటీవల 317 జీవో అమలులో భాగంగా కొత్త జిల్లాలకు ఉపాధ్యాయులను కేటాయించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో చాలా మంది టీచర్లు తమకు సీనియారిటీలో అన్యాయం జరిగిందని, తాము స్థానికతను కోల్పోతున్నామని, భార్యబధర్తల కేటగిరీ (స్పౌజ్‌), వితంతువు, అనారోగ్య తదితర కారణాలతో వేసిన దాదాపు 3500కు పైగా కేసులు హైకోర్టులో విచారణకు ఉన్నాయని పాఠశాల విద్యాశాఖలోని ఓ ఉన్నతాధికారి తెలిపారు. ఒక్కొక్కటీ పరిష్కారమవుతున్న కొద్ది మళ్లి ఎవరో ఒకరు తమకు న్యాయం కావాలని కోరుతూ పిటిషన్లను హైకోర్టులో దాఖలు చేస్తునే ఉన్నారని అధికారిక వర్గాలు పేర్కొంటున్నాయి.

జీవో తెచ్చిన తంటాలు…

317 జీవో అమలులోకి వచ్చి దాదాపు 9 నెలలు కావొస్తుంది. ఈ జీవో ఆధారంగా అప్పట్లో కొత్త జిల్లాలవారీగా టీచర్లను కేటాయించారు. ఈ కేటాయింపుల్లో సీనియారిటీ తప్పులున్నాయని, స్పౌజ్‌, స్థానికతను కోల్పోయానని ఇలా వివిధ కారణాలతో పిటిషన్లను హైకోర్టులో దాఖలు చేశారు. రాష్ట్రంలో దాదాపు 1.06 లక్షల మంది టీచర్లు పనిచేస్తుండగా అందులో దాదాపు 24500 మంది జిల్లాలకు మారారు. వీరిలోనూ 12 వేల మంది తమకు అన్యాయం జరిగిందని సీనియారిటీ, స్థానికత, స్పౌజ్‌ లాంటి కారణాలు చూపుతూ పాఠశాల విద్యాశాఖకు అప్పీళ్లు చేసుకున్నారు. వీటిలో సగానికిపైగా దరఖాస్తులను అధికారులు తిరస్కరించారు. అలాగే 13 జిల్లాల్లో స్పౌజ్‌ కేసులను పెండింగ్‌లో పెట్టడంతో టీచర్లు ఇంకా కోర్టులను ఆశ్రయిస్తున్నారు.

ఇప్పట్లో పరిష్కారం కష్టమే?

ఇప్పటి వరకు దాదాపు 3500 వరకు పిటిషన్లు కోర్టులో దాఖలైనట్లు పాఠశాల విద్యాశాఖ వర్గాలు పేర్కొన్నాయి. కొన్ని కేసులకు అఫిడవిట్లను అధికారులు దాఖలు చేయాల్సి వస్తోంది. దీంతో అధికారులు నిత్యం కేసుల పనితోనే బిజీగా ఉంటున్నారు. ఒక్కోసారి అర్థరాత్రి వరకు వీటిపైనే పనిచేయాల్సి వస్తోందని విద్యాశాఖ అధికారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 317 జీవో కారణంగా దాఖలైన పిటీషన్లు పరిష్కారం కావాలంటే కొన్నేళ్ల సమయం పడుతుందని అంటున్నారు. ఇక 13 జిల్లాల్లో బ్లాక్‌ చేసిన స్పౌజ్‌ కేసుల అంశమైతే ఇప్పట్లో పరిష్కారం కావడం కష్టమేనని అంటున్నారు. స్పౌజ్‌ కేసులను పరిష్కరించడం ద్వారా ఆయా జిల్లాల్లో పోస్టులు తగ్గిపోతాయని ప్రభుత్వం వాదనగా తెలుస్తోంది. ఇందులో భాగంగానే సూర్యాపేట, కరీంనగర్‌, ఖమ్మం, వరంగల్‌, హనుమకొండ, రంగారెడ్డి, మేడ్చల్‌, సిద్ధిపేట, నిజామాబాద్‌, ఆదిలాబాద్‌, మహబూబ్‌నగర్‌, సంగారెడ్డి, సిద్దిపేట, మంచిర్యాల జిల్లాల్లో స్పౌజ్‌ బదిలీలను ప్రభుత్వం చేపట్టలేదు. మిగిలిన 20 జిల్లాల్లో మాత్రం దాదాపు 1155 మందికి పోస్టింగులు ఇచ్చారు. పెండింగ్‌ కేసుల్లో అధిక శాతం ఆదిలాబాద్‌, మహబూబ్‌నగర్‌, రంగారెడ్డి జిల్లాలోనే ఉన్నాయి. ఇవి ఎప్పటికి పరిష్కారమవుతాయో అధికారులు సైతం చెప్పలేకపోతున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement