Saturday, May 4, 2024

TS: మన లేఖతోనే 10 లక్షల ఉద్యోగాలు.. ప్రధాని మోడీ ప్రకటన సంతోషకరం : మంత్రి కేటీఆర్‌

సిరిసిల్ల/ సిద్దిపేట/ ముస్తాబాద్‌, ఆంధ్రప్రభ: జీవితంలో ప్రభుత్వ ఉద్యోగమే పరామవధి కాదని ప్రతిభ ఉంటే ఏదైనా సాధించవచ్చని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీ రామారావు చెప్పారు. ప్రపంచంలో చాలా అవకాశాలు ఉన్నాయని, ఉద్యోగాల కోసం సిద్ధమవుతున్న యువత ఈ మూడు నెలలు శ్రమించాలని, చదువుపై శ్రద్ధ పెట్టాలని మిగతా పనులు, ఫోన్లు కట్టివేయాలని సూచించారు. ప్రధాని నరేంద్ర మోడీ పది లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తానని ప్రకటించారని ఐదారు రోజుల క్రితం తాను డిమాండ్‌ చేస్తే ఉద్యోగాల భర్తీకి ఆయన ముందుకు వచ్చినందుకు సంతోషమని చెప్పారు.

స్వరాష్ట్రంలో ప్రభుత్వ కార్యాలయాలు, ప్రభుత్వరంగ సంస్థల్లో లక్షా 32వేల ఉద్యోగాలను తెలంగాణ ప్రభుత్వం భర్తీ చేసిందని, మరో 82వేల ఉద్యోగాలను భర్తీ చేసే ప్రక్రియ కొనసాగుతోందని చెప్పారు. సిద్దిపేట జిల్లా ముస్తాబాద్‌ ప్రభుత్వ కళాశాలలో బుధవారం మంత్రి కేటీఆర్‌ నిరుద్యోగ యువతకు ప్రేరణ పాఠం చెప్పారు. ప్రభుత్వ కళాశాలలో పోటీ పరీక్షలకు ఏర్పాటు చేసిన ఉచిత శిక్షణా కేంద్రాన్ని ఆయన ప్రారంభించారు. ఉద్యోగ పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న అభ్యర్థులకు ఆయన స్ఫూర్తి నింపారు. లక్షలాది మంది పోటీ పడుతున్న పరీక్షల్లో విజేతలుగా నిలవాలంటే కష్టపడి చదవాలని ఈ సమయంలో సెల్‌ఫోన్లను దూరంగా ఉంచాలని కోరారు.

తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిన తర్వాత ఉద్యమ నినాదం నీళ్లు, నిధులు, నియామకాలని వీటిని సాకారం చేసుకున్నామని చెప్పారు. నీళ్లు సాధించుకోవడంతో పాటు మన నిధులు మనమే ఖర్చు చేసుకుంటున్నామని నియామకాల ప్రక్రియ జరుగుతోందని ఆయన వివరించారు. వాళ్లు, వీళ్లు ఉద్యోగాలు ఇవ్వలేదని ఇంట్లో కూర్చుని వాట్సప్‌ చూసుకుంటూ ముచ్చట్లు పెడితే సాధించేదేమీ ఉండదని పేర్కొన్నారు. మంత్రి, ఎమ్మెల్యే చెబితే ఉద్యోగాలు ఇవ్వరని అభ్యర్థుల నైపుణ్యం పరిశ్రమకు ఉపయోగపడుతుందా, లేదా అని చూసుకుని ఉద్యోగాలు ఇస్తారని చెప్పారు. జీవితంలో రాణించేందుకు ఏకైక మంత్రం స్కిల్‌, అప్‌స్కిల్‌, రీస్కిల్‌ అని చెప్పారు. ప్రతిభను ఎప్పటికప్పుడు అప్‌డేట్‌ చేసుకోవాలని లేకపోతే ఔట్‌డేట్‌ అవుతారని హితవు పలికారు.

ప్రపంచంలో ఏం జరుగుతుందో తెలుసుకోకుంటే, అప్‌డేట్‌ కాకుంటే అవకాశాలు రావని ఒకవేళ ఉద్యోగంలోకి తీసుకున్నా పదోన్నతులు రావని తెలిపారు. ప్రభుత్వం ఉద్యోగం వస్తే సంతోషం.. రాకుంటే ఏదో అయిపోయిందని అపజయం పొందానని భయపడి బాధ పడితే ఎటువంటి ప్రయోజనం ఉండదని చెప్పారు. టీఎస్‌ ఐపాస్‌ ద్వారా ఎనిమిదేళ్లలో 19వేల పరిశ్రమలు, 16 లక్షల మందికి ఉపాధి అవకాశాలు కల్పించామని చెప్పారు. కేంద్ర ప్రభుత్వ పరిధిలో 16 లక్షల ఉద్యోగాలు భర్తీ చేయాలని వారం రోజుల కిందట తాను ప్రధాని నరేంద్ర మోడీకి లేఖ రాశానని 10 లక్షల ఉద్యోగాలు రెండేళ్లలో భర్తీ చేయాలని ఆయన అధికారులను ఆదేశించారని చెప్పారు.

భౌగోళికంగా తెలంగాణ దేశంలో 11వ అతిపెద్ద రాష్ట్రమని జనాభా ప్రాతిపదికన 12వ అతిపెద్ద రాష్ట్రమని చెప్పారు. దేశానికి అన్నం పెట్టే రాష్ట్రాల్లో తెలంగాణది నాలుగో స్థానమని తలసరి ఆదాయం, జీఎస్‌డీపీలో రాష్ట్రం అగ్రగామిగా ఉందని పేర్కొన్నారు. 2014లో తెలంగాణ తలసరి ఆదాయం రూ.లక్షా 24 వేలు కాగా ప్రస్తుతం రూ.2 లక్షల 78వేలుగా ఉందని పేర్కొన్నారు. దేశ సగటు తలసరి ఆదాయం రూ.లక్షా 49వేల కోట్లు ఉందని చెప్పారు. రాష్ట్ర స్థూల ఉత్పత్తి ఆదాయం ఐదు లక్షల కోట్ల నుంచి రూ.11 లక్షల 55వేల కోట్లకు చేరిందని దేశ జనాభాలో తెలంగాణది 2.5 శాతం కాగా దేశ జీడీపీకి తెలంగాణ 5 శాతం తోడ్పాటునందిస్తోందని చెప్పారు. టీఎస్‌ ఐపాస్‌ ద్వారా ప్రైవేట్‌ రంగంలో పెద్దఎత్తున పరిశ్రమలను ఆహ్వానిస్తున్నామని చెప్పారు. ప్రైవేట్‌ రంగంలో ఉపాధి అవకాశాలు ఎన్నో ఉన్నాయని ప్రభుత్వ ఉద్యోగం రాలేదని నిరాశ పడవద్దని కోరారు. చదువు, నైపుణ్యం ఉంటే ప్రపంచంలో ఉద్యోగ, ఉపాధి అవకాశాలకు కొదవ లేదని వివరించారు.

- Advertisement -

దేశానికే ఆదర్శంగా పల్లెల అభివృద్ధి
ముఖ్యమంత్రి కేసీఆర్‌ నాయకత్వంలో జోడెడ్ల మాదిరి అభివృద్ధి, సంక్షేమం పరుగులు తీస్తోందని మంత్రి కేటీఆర్‌ అన్నారు. సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్‌ మండలం వెంకట్రావుపల్లెలో నిర్వహించిన పల్లె ప్రగతి కార్యక్రమంలో మంత్రి కేటీఆర్‌ పాల్గొన్నారు. చీకోడు రైతు వేదికలో ప్రజలను ఉద్ధేశించి మంత్రి కేటీఆర్‌ మాట్లాడుతూ.. దేశంలోనే అత్యుత్తమ 20 గ్రామాలలో 19 తెలంగాణవేనని అన్నారు. రైతులకు 24గంటల పాటు ఉచిత కరెంట్‌ ఇస్తున్న ఏకైక రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ అని చెప్పారు. 75 ఏండ్లలో దేశంలో ప్రతి ఇంటికి త్రాగునీరు ఇవ్వాలన్న స్పృహ ఏ ప్రభుత్వానికి లేదని, అది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మాత్రమే మిషన్‌ భగీరథ ద్వారా ప్రతి ఇంటికి నల్లా ద్వారా సురక్షిత త్రాగునీరు అందిస్తోందన్నారు తెలిపారు.

కాళేశ్వరం ప్రాజెక్ట్‌తో సాగునీటి రంగంలో అద్భుతాలు సృష్టించామన్నారు. పెన్షన్‌ల క్రింద ఏటా తెలంగాణలో రూ.10 వేల కోట్లు ఖర్చు చేస్తున్నామని, 2600 రైతు వేదికలను 6 నెలల్లో నిర్మిం చామన్నారు. రైతు బంధు కింద రూ.50 వేల కోట్ల పెట్టుబడి సహాయంగా అందజేశామని పేర్కొన్నారు. కొత్త పెన్షన్లు, రేషన్‌ కార్డుల మంజూరుకు సీఎం కేసీఆర్‌ ఆమోదం తెలిపారన్నారు. త్వరలోనే అర్హత కలిగిన ప్రతి ఒక్కరికీ కొత్త రేషన్‌ కార్డులు మంజూరు చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్‌ అనురాగ్‌ జయంతి, ఎస్పీ రాహుల్‌ హేగ్డే, జిల్లా పరిషత్‌ చైర్మన్‌ న్యాలకొండ అరుణ, ఎంపిీపీ జనగామ శరత్‌రావు, జడ్పీటీసీ గుండం నర్సయ్య, రైతు బంధు మండల కన్వీనర్‌ కల్వకుంట్ల గోపాల్‌రావు, ఏఎంసీ ఛైర్మన్‌ శీలం జానబాయి, సింగిల్‌ విండో తన్నీరు బాపురావు, సెస్‌ డైరెక్టర్‌ కొమ్ము బాలయ్య, అధికారులు, ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement