Friday, May 3, 2024

ఆర్డ‌ర్లు రాని న‌గ‌రాల్లో సేవ‌లు నిలిపివేస్తోన్న జొమాటో

ఆర్డ‌ర్లు రాని చిన్న న‌గ‌రాల‌లో సేవ‌ల‌ను నిలిపివేస్తున్న‌ట్లు ప్ర‌క‌టించింది జొమాటో సంస్థ‌. దాంతో దేశవ్యాప్తంగా 225 చిన్న నగరాలలో సేవలను నిలిపి వేయ‌నుంది. ఆయా నగరాలలో తగినన్ని ఆర్డర్లు రాకపోవడంతో నష్టాలు వస్తున్నాయని, అందువల్లే ఈ నిర్ణయం తీసుకున్నామని సంస్థ ఓ ప్రకటనలో తెలిపింది. ఫుడ్ డెలివరీ రంగంలో ఒడిదొడుకుల కారణంగా గతేడాది డిసెంబర్ తో ముగిసిన త్రైమాసికంలో కంపెనీ రూ.346.6 కోట్లు నష్టపోయిందని పేర్కొంది. దీంతో నష్టాలను తగ్గించుకునేందుకు తగినన్ని ఆర్డర్లు రాని నగరాలలో సేవలను నిలిపేస్తున్నట్లు వెల్లడించింది. గతంలో అమలు చేసిన గోల్డ్ సబ్ స్క్రిప్షన్ ను జొమాటో మరోమారు తీసుకొచ్చింది. మెట్రో నగరాలతో పాటు, ఇతర నగరాలలో సేవలందించేందుకు సుమారు 800 మందిని నియమించుకుంటామని పేర్కొంది. దేశంలోనే అత్యధికంగా ఉపయోగిస్తున్న ఫుడ్ డెలివరీ యాప్ లలో జొమాటో కూడా ఒకటి.. కంపెనీ విస్తరణలో భాగంగా గతేడాది పలు చిన్న నగరాలలోనూ సేవలను మొదలుపెట్టింది. ఇందుకోసం భారీగా సొమ్ము వెచ్చించింది. అయితే, ఆయా నగరాలలో సేవలందించడం పెద్దగా లాభదాయకం కాదని త్వరలోనే తెలిసొచ్చిందని కంపెనీ ప్రతినిధులు చెప్పారు.ఈ నిర్ణయం వల్ల కంపెనీకి వాటిల్లిన నష్టాన్ని త్వరలోనే పూడ్చుకుంటామని వివరించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement