Friday, April 26, 2024

NeoCov: మరో కొత్త వైరస్ ‘నియో కోవ్‌’‌.. సోకితే ప్రతి ముగ్గురిలో ఒకరు మృతి!

కరోనా  మహమ్మారి కొత్త కొత్త వేరియంట్లు పుట్టుకొస్తూ యావత్ ప్రపంచాన్ని వణికిస్తోన్న వేళ.. మరో కొత్త వైరస్‌ను శాస్త్రవేత్తలు గుర్తించారు. ఒమిక్రాన్ వెలుగు చసిన దక్షిణాఫ్రికాలోనే మరో కొత్త వైరస్ వెలుగుచూసింది. దక్షిణాఫ్రికాలో బయటపడిన ‘నియో కోవ్‌ (NeoCoV)’ అనే కొత్త రకం వైరస్‌కు వేగంగా వ్యాప్తి చెందే లక్షణంతో పాటు మరణాల రేటు కూడా అధికంగానే ఉండే అవకాశముందని తెలుస్తోంది. ఈ మేరకు వుహాన్ శాస్త్రవేత్తలు హెచ్చరికలు చేయడం ప్రపంచాన్ని మరోసారి భయాందోళనకు గురిచేస్తోంది.

దక్షిణాఫ్రికాలోని ఓ ప్రాంతంలో గల గబ్బిలాల్లో ఈ ‘నియో కోవ్‌’ వైరస్ బయటపడింది. ఇది కూడా కరోనా వైరసే అని శాస్త్రవేత్తలు తెలిపారు. దీనిపై చైనాలోని వుహాన్ శాస్త్రవేత్తలు పరిశోధనలు జరపగా ఆసక్తికర విషయాలు వెలుగులోకి వచ్చినట్లు రష్యా అధికారిక మీడియా సంస్థ స్పుత్నిక్‌ తన కథనంలో పేర్కొంది. ప్రస్తుతం ఇది జంతువుల నుంచి జంతువులకు మాత్రమే పాకుతున్న వైరస్‌గా గుర్తించారు.

అయితే ఇందులోని ఓ మ్యుటేషన్‌ కారణంగా వైరస్‌ జంతువుల నుంచి మనుషులకు సోకే ప్రమాదం ఉందని వుహాన్‌ శాస్త్రవేత్తల అధ్యయనంలో తేలింది. ‘నియో కోవ్‌’ వైరస్‌కు.. గబ్బిలాల్లోని యాంజియోటెన్సిన్‌ – కన్వర్టింగ్‌ ఎంజైమ్‌ (ACE2) ప్రభావవంతగా వాడుకొంటుంది. దీనితో పోలిస్తే మనుషుల్లోని ACE2ను ఏమార్చి శరీరంలోకి ప్రవేశించే సామర్థ్యం కొంత తక్కువగా ఉన్నట్లు శాస్త్రవేత్తలు గుర్తించారు. వుహాన్‌ యూనివర్శిటీ, బయోఫిజిక్స్‌ ఆఫ్‌ ది చైనీస్‌ అకాడమీ ఆఫ్‌ సైన్సెస్‌కు చెందిన శాస్త్రవేత్తలు సంయుక్తంగా జరిపిన పరిశోధనల్లో ఈ విషయం వెల్లడైంది. అయితే ఈ అధ్యయనాన్ని ఇంకా పీర్‌ రివ్యూ చేయలేదు.

కొవిడ్‌ 19తో పోలిస్తే ‘నియో కోవ్‌’ వైరస్‌ కాస్త భిన్నమైనదే గాక, ప్రమాదకరమైనదని కూడా శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. యాంటీబాడీలు, కొవిడ్‌ 19 వ్యాక్సిన్లు కూడా దీనికి పనిచేయకపోవచ్చని చెబుతున్నారు. అంతేగాక, 2012, 2015లో మధ్య ప్రాశ్చ్య దేశాల్లో విజృంభించిన మెర్స్‌ – కోవ్‌ మాదిరిగా ‘నియో కోవ్‌’తో అధిక మరణాలు ఉండొచ్చని హెచ్చరించారు. ఈ వైరస్‌ మనుషులకు వ్యాపిస్తే.. సోకిన ప్రతి ముగ్గురిలో ఒకరికి ప్రాణాపాయం తప్పదని పేర్కొన్నారు. ఇక సార్స్‌ – కోవ్ ‌- 2 మాదిరిగా వేగంగా మనుషులకు సోకే ప్రమాదం ఉందన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement